ఫిరాయింపుదారులకు మంత్రి పదవులా?

3 Apr, 2017 10:08 IST|Sakshi
ఫిరాయింపుదారులకు మంత్రి పదవులా?

జగ్గయ్యపేట:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన క్యాబినెట్‌ విస్తరణలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టడం అప్రజాస్వామికమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో చేరిన ఫిరాయింపుదారులతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయితే కేసీఆర్‌ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించిన చంద్రబాబు నేడు అదే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారన్నారు. అప్పట్లో గవర్నర్‌ను సైతం దూషించిన చంద్రబాబు ప్రస్తుతం అదే గవర్నర్‌తో  టీడీపీలో చేరిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారని దుయ్యబట్టారు. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరం చెప్పాల్సిన గవర్నర్‌ కూడా మంత్రివర్గ విస్తరణలో పాల్గొని వారితో ప్రమాణస్వీకారం చేయించటం హేయమన్నారు. ఇటీవల విడుదలైన కాగ్‌ నివేదిక కూడా చంద్రబాబు అవినీతిని తేటతెల్లం చేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు తీరుపై పార్టీ ఆధ్వర్యంలో పోరాడనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు