భారీముప్పు!

20 Mar, 2018 12:40 IST|Sakshi
కూలడానికి సిద్ధంగా ఉన్న సమిశ్రగూడెం వంతెన

వణికిస్తున్న వంతెన

కూలడానికి సిద్ధంగా సమిశ్రగూడెం వారధి

యథేచ్ఛగా భారీ వాహనాల రాకపోకలు

కనీస హెచ్చరిక బోర్డులేవీ?  

నిడదవోలు వంతెన కూలినా కళ్లు తెరవని అధికారులు

నిడదవోలు: నిడవోలులో పురాతన వంతెన కూలినా అధికారులు కళ్లుతెరవడం లేదు. భారీ ముప్పు పొంచి ఉన్నా.. శిథిలావస్థలో ఉన్న వంతెనల పరిరక్షణకు చర్యలు చేపట్టడం లేదు. కూలిన నిడదవోలు వంతెనకు కూతవేటు దూరంలో ఉన్న సమిశ్రగూడెం వంతెనను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ వంతెనపై రాకపోకలకు ప్రస్తుతం ప్రజలు వణుకుతున్నారు. సమిశ్రగూడెం గ్రామంలో  పశ్చిమడెల్టా ప్రధాన కాలువపై బ్రిటిష్‌ హయాంలో 1932లో నిర్మించిన ఐరన్‌ గడ్డర్‌ బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఈ వంతెన 50 మీటర్ల పొడవు, ఆరుమీటర్ల వెడల్పు ఉంటుంది. గతంలో దీని శ్లాబ్‌ పనులు మాత్రమే చేపట్టారు. ప్రస్తుతం  వంతెన ఐరన్‌ గడ్డర్లు తుప్పుపట్టాయి. గడ్డర్ల ముక్కలు పట్టు వదలి ఒక్కొక్కటిగా కాలువలోకి వేలాడుతున్నాయి. ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితి నెలకొంది. 

నిబంధనలు పట్టవు
ఇంతటి భయానక పరిస్థితి ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం.. ఈ వంతెనపై 16 టన్నులకు మించిన లోడు వాహనాలు తిరగకూడదు. అయితే ప్రస్తుతం 80 టన్నుల లోడు వాహనాలూ యథేచ్ఛగా పోతున్నాయి. అయినా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కనీసం 16 టన్నులలోపు లోడు వాహనాలు మాత్రమే వెళ్లాలనే  హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు.  ఇసుక, క్వారీ లారీలతోపాటు కోళ్ల పరిశ్రమ, వ్యవసాయ ఉత్పత్తుల భారీ లోడు వాహనాలు రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి.  ఈ వంతెనపై రెండు వాహనాలు ఒకేసారి రావడానికి వీలుండదు. అయినా చాలా సందర్భాల్లో రెండు వాహనాలు ఒకేసారి రావడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. దీంతో పోలీసులకూ తలనొప్పిగా మారింది. ఒక్కోసారి వంతెనపై భారీ వాహనాలు నిలిచిపోయి 200 టన్నుల భారం వంతెనపై పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో వంతెన కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. వంతెనకు రెయిలింగ్‌ కూడా లేకపోవడంతో కాలువలోకి వాహనాలు దూసుకుపోయిన ఘటనలు అనేకం జరిగాయి. రాత్రి సమయాల్లో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఉభయగోదావరి జిల్లాల మధ్య ప్రధాన మార్గం
ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు ఈ వంతెన ప్రధాన మార్గంగా ఉంది. తాడేపల్లిగూడెం, నిడదవోలు, పంగిడి, దేవరపల్లి నుంచి రాజమండ్రి, నరసాపురం, ధవళేశ్వరం, రావులపాలెం, మార్టేరుకు వెళ్లాలంటే ఈ వంతెన దగ్గరదారి. అందుకే ఎక్కువమంది వాహనదారులు, ప్రయాణికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. రోజూ వంతెన పైనుంచి సుమారు 5,000 వేల వాహనాలు వెళ్తుంటాయి. ఇంతటి కీలకమైన వంతెన శిథిలావస్థకు చేరినా.. అధికారులకు పట్టడం లేదు. నిడదవోలు బ్రిడ్జి కూలిన తర్వాత కూడా దీనిపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించలేదు.

ప్రతిపాదనలకే పరిమితం
చాలాకాలం నుంచి వంతెన పడగొట్టి దాని స్థానంలో కాంక్రీట్‌ హైలెవెల్‌ బ్రిడ్జిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 2014లో  రూ.10 కోట్ల అంచనాలతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇదిలా ఉంటే జలరవాణాలో భాగంగా వంతెన పొడవు పెంచాలనే ఇరిగేషన్‌ శాఖ ప్రతిపాదనలతో వంతెన నిర్మాణ వ్యయం ప్రస్తుతం రూ.24 కోట్లకు పెరిగింది.

పొంతన లేని సమాధానాలు
ఈ వంతెన గురించి వివరణ కోరగా ఆర్‌అండ్‌ బీ ఏఈ కె.నందకిషోర్‌ పొంతన లేని సమాధానాలు చెప్పారు. కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని అడగ్గా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు ఆర్‌అండ్‌బీ డీఈ ఎ.శ్రీకాంత్‌ను వివరణ కోసం యత్నించగా ఆయన ఫోన్‌ లిఫ్ట్‌చేయట్లేదు. 

మరిన్ని వార్తలు