ఇదేమి 'అ'లక్ష్యం !

14 Jan, 2019 12:54 IST|Sakshi
సంక్రాంతి కానుకల కిట్లు

పండగొచ్చినా సంక్రాంతి కానుకేదీ!

 లక్షమందికిపైగా అందలేదే

 ప్రభుత్వ ప్రచారార్భాటం  పంపిణీలో పితలాటకం

 తూకం ఎక్కువై తగ్గిన ప్యాకెట్లు  తలలు పట్టుకుంటున్న రేషన్‌ డీలర్లు

పశ్చిమగోదావరి, కొవ్వూరు: ప్రచారార్భాటానికి పెద్దపీట వేస్తున్న టీడీపీ సర్కారు..  సంక్రాంతి కానుకల పంపిణీపై శ్రద్ధ చూప లేదు. ఫలితంగా పండగొచ్చినా జిల్లాలో నేటికీ 1,27,997 మందికి కానుకలు  అందలేదు. చౌక దుకాణాలకు అందించిన ఆరు రకాల సరుకుల్లో  తూకం వ్యత్యాసాల వల్ల కొన్ని రకాల ప్యాకెట్లు తగ్గాయి. దీంతో సుమారు పది శాతం మంది లబ్ధిదారులు కానుకలు పొందే అవకాశం కోల్పోయారు.

90 శాతంలోపే పంపిణీ
జిల్లాలో మొత్తం రేషన్‌కార్డులు 12,39,698 ఉన్నాయి. వీటిలో ఇంత వరకు 11,11,701 మందికి మాత్రమే కానుకలు అందాయి. అంటే జిల్లాలో 89.68 శాతం మాత్రమే పంపిణీ పూర్తయింది. దాదాపు అన్నీమండలాల్లోనూ 86 నుంచి 90శాతం లోపు మాత్రమే పంపిణీ పూర్తయింది. కేవలం పదహారు మండలాల్లోనే 90 శాతం పంపిణీ పూర్తయింది. ఉండ్రాజవరం మండలంలో గరిష్టంగా 93.09 కొయ్యలగూడెంలో 92.55 శాతం పంపిణీ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం 88.26 శాతం పూర్తయినట్టు సమాచారం. మిగిలిన వాళ్లకు పండగ రోజుకైనా కానుకలు అందుతాయా అంటే అనుమానమే.

ప్యాకెట్ల రూపంలో రావడం వల్లే..!
నేడు భోగి పండగ. ఇప్పటికే పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. సోమ, మంగళ, బుధ వారాలు పండగ రోజులు కావడంతో మిగిలిన వారికి రానున్న రెండు, మూడు రోజుల్లో కానుకలు అందడం గగనమే అని చెప్పవచ్చు. పౌర సరఫరాల గోదాముల నుంచి రేషన్‌ డీలర్లకు అందించిన ఆరు రకాల సరుకుల్లో కొన్ని ప్యాకెట్లు తక్కువగా వచ్చాయి. ప్రతి సరుకునూ విడివిడిగా యాభై కిలోల బస్తాల్లో ప్యాకెట్ల రూపంలో పంపించడంతో తూకాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. దీంతో ఒక్కో రేషన్‌ దుకాణంలో ప్రతి సరుకు ప్యాకెట్లు  సుమారు పది వరకు తక్కువయ్యాయి. ఈ లెక్కన ప్రతి చౌకదుకాణం పరిధిలో యాభై నుంచి అరవై మంది వరకు కానుకలు పొందే అవకాశం కోల్పోతున్నారు. అధికారులు ఉన్న సరుకులు హెచ్చుతగ్గులున్న చోట సర్దుబాటు చేసినా జిల్లా వ్యాప్తంగా లక్ష మందికిపైగా కార్డుదారులకు కానుకలు అందడం కష్టమే.

తలలు పట్టుకుంటున్న డీలర్లు
ఒక్కో బస్తాలో ఐదారు ప్యాకెట్లు తక్కువగా రావడంతో డీలర్లు  పంపిణీలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కార్డుదారులు డీలర్లతో వాగ్వివాదాలకు దిగుతున్నారు.  గోధుమ పిండి, బెల్లం, శెనగ పప్పు ప్యాకెట్లు నిర్దేశించిన తూకం కంటే  ఎక్కువ రావడంతో బస్తాల్లో ప్యాకెట్లు సంఖ్య తగ్గింది. గోదాముల నుంచి డీలర్లు సరుకు తీసుకునే సమయంలో నికర తూకం సరిపోవడంతో వాటిని తెచ్చుకున్నారు. తీరా పంపిణీకి వచ్చేసరికి ప్యాకెట్లు తగ్గిన విషయం గుర్తించారు. కొన్ని ప్యాకెట్లు గోధుమ పిండి 60 నుంచి 120 గ్రాము లు వరకు ఎక్కువగా వస్తుందని డీలర్లు చెబుతున్నారు. బెల్లం, కంది పప్పు, శెనగపప్పులదీ అదే పరిస్థితి. ప్రతి బస్తాకి ఐదారు ప్యాకెట్లు తక్కువ వచ్చాయి. నెయ్యి ప్యాకెట్లు చిరిగిపోవడం వల్ల తక్కువ వచ్చినట్టు డీలర్లు చెబుతున్నారు. ఇలా ప్రతి చౌక దుకాణంలో అన్ని సరుకులూ కలిపి యాభై, ఆరవై వరకు ప్యాకెట్లు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను కొందరు డీలర్లు ప్రారంభంలోనే గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.

బెల్లం నాసిరకం.. సంచుల్లేవు
బెల్లం నాసిరకంగా ఉండడంతో అధికారులు మళ్లీ ఆ స్టాకును వెనక్కి పంపించారు. కొందరు డీలర్లు కానుకలు అందజేసే సంచులు సైతం తక్కువగా అందాయని చెబుతున్నారు. అయితే తగ్గిన  సరుకులు మళ్లీ వచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు.

సమ్మె, పోర్టబిలిటీ వల్ల కొంత ప్రభావం
గత నెలలో డీలర్ల సమ్మెతోపాటు డిసెంబర్‌ 28 నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ తాత్కాలికంగా పొర్టబులిటీ సదుపాయం తొలగించడం సంక్రాంతి కానుకల పంపిణీ జాప్యానికి కారణంగా చెబుతున్నారు.  దీనివల్ల సంక్రాంతి కానుకల పంపిణీ అస్తవ్యస్తమైంది. జిల్లా వాప్యంగా 1,63,582 మంది పోర్టబిలిటీ సదుపాయం వినియోగించుకోగలిగారు.  ప్యాకెట్లు తక్కువ వచ్చిన విషయం తెలియదుసంక్రాంతి కానుకలు పంపిణీలోజిల్లా ద్వితీయ స్థానంలో ఉంది.  సరుకుల ప్యాకెట్లు తక్కువగా అందిన విషయం నా దృష్టికి రాలేదు. మండల స్ధాయి అధికారులెవరూ ఈ సమస్యచెప్పలేదు. ఏవైనా సరుకులు తేడాలుఉంటే పౌర సరఫరాల గిడ్డంగి నుంచి మళ్లీ పొందవచ్చు. కొన్నిచోట్ల నాసిరకంగాబెల్లం ఉందని చెబితే మార్పించాం.  – జి.మోహన్‌బాబు,జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి 

మరిన్ని వార్తలు