జిల్లా విద్యాశాఖ అధికారిగా శామ్యూల్‌ 

12 Jul, 2019 07:00 IST|Sakshi

గతంలో రెండుమార్లు డీఈఏ ఎఫ్‌ఏసీగా విధులు 

నేడు బాధ్యతల స్వీకరణ 

సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్‌: చిత్తూరు జిల్లా మదనపల్లి డెప్యూటీ డీఈఓగా పని చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (ఎఫ్‌ఏసీ)గా రెండుసార్లు పని చేసిన శామ్యూల్‌ను ప్రస్తుతం అనంతపురం జిల్లా రెగ్యులర్‌ డీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇక్కడ డీఈఓగా పని చేస్తున్న జనార్దనాచార్యులును సరెండర్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజా బదిలీల్లో జనార్దనాచార్యులును నెల్లూరుకు బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న శామ్యూల్‌ను ఇక్కడికి నియమించారు. కాగా శామ్యూల్‌ గతంలో ఇక్కడ పని చేసిన సమయంలో జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు. తొలిసారి 2012 ఆగస్టు 2 నుంచి 2013 ఏప్రిల్‌ 25 వరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా పని చేశారు.

అలాగే రెండోమారు 2016 నవంబరు 2 నుంచి 2017 జనవరి 24 వరకు పని చేశారు. ఆయన పని చేసినంతకాలమూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా బడికి వెళ్లకుండా ఎగనామం పెట్టే టీచర్ల భరతం పట్టారు. సాధారణ ఉపాధ్యాయులే కాదు బడులు ఎగ్గొట్టి పైరవీలు చేసే కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సైతం వణుకు పుట్టించారు. ప్రతి టీచరూ బడివేళల్లో బడిలోనే ఉండాలనే సిద్ధాంతం అమలుకు గట్టి చర్యలు తీసుకున్నారు. అంతకుముందు వేళాపాళా లేకుండా టీచర్లు, సంఘాల నాయకలు డీఈఓ కార్యాలయం చుట్టూ తిరిగేవారు. శామ్యూల్‌ వచ్చిన తర్వాత వారి తీరు మారింది. బడివేళల్లో ఒక్కరంటే ఒక్క టీచరు కూడా ఈ దరిదాపుల్లో కనిపించలేదంటే ఆయన ఎంత కఠినంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.  

సొంత వ్యాపారాలపైనే మక్కువ 
కొందరు టీచర్లు బడికి డుమ్మా కొడుతూ చీటీలు, రియల్‌ ఎస్టేట్‌ తదితర వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే ఎస్జీటీల అక్రమాలకు కొందరు ఎంఈఓలు అండగా నిలుస్తున్నారు. వారానికి, పదిరోజులకోసారి బడికి వెళ్లి సంతకాలు చేస్తున్నారు. నెలనాడు జీతం రాగానే ఎంఈఓలకు వాటా ఇస్తుండటంతో చూసీచూడనట్లు వెళ్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరికొన్ని పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు వంతులు వేసుకుని మరీ బడులకు వెళ్తున్నారని చెబుతున్నారు. కొందరు టీచర్లు వారంలో తొలి మూడు రోజులు వెళ్తే తర్వాత మూడు రోజులు తక్కిన టీచర్లు వెళ్తున్నారు. ఉదయం బడికి గంట ఆలస్యంగా, సాయంత్రం ఇంటికి గంట ముందు వెళ్లే టీచర్లూ చాలాచోట్ల ఉన్నారు. ఇలాంటి వారిపై కొత్త డీఈఓ దృష్టి సారించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   

మరిన్ని వార్తలు