మాన్సాస్‌లో పెనుమార్పు..!

5 Mar, 2020 11:36 IST|Sakshi
మాన్సాస్‌ ట్రస్టు బోర్డు చైర్‌పర్సన్‌గా ప్రమాణం చేసి, బాధ్యతలు స్వీకరించిన సంచయిత గజపతిరాజు

ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె

బాధ్యతలు చేపట్టిన సంచయిత గజపతి

తరతరాల ఆధిపత్యానికి తెరదింపిన రాష్ట్ర ప్రభుత్వం

జిల్లాలో సంచలనమైన సీఎం నిర్ణయం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు ఇంతటి బృహత్తర బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంచయిత గజపతిరాజు కృతజ్ఞతలు తెలిపారు. మాన్సాస్‌ ట్రస్ట్‌కు సంబంధించి జరిగిన ఈ పరిణామం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా నిరంకుశంగా మాన్సాస్‌పై పెత్తనం చెలాయిస్తున్నవారికి గట్టి దెబ్బ తగిలిందని జనం చర్చించుకోవడం మొదలైంది. 

విద్యాభివృద్ధే ధ్యేయంగా మాన్సాస్‌ ఆవిర్భావం

1958లో దివంగత పి.వి.జి.రాజు నెలకొల్పిన మాన్సాస్‌ సంస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పి.వి.జి.రాజు మరణం తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతలు తీసుకున్నారు. అశోక్‌ కుమార్తె అథితి గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌గా తెరపైకి వచ్చారు. 13వేల ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగిన మాన్సాస్‌ సంస్థ చైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఇప్పటి వరకూ ఉన్నారు. బుధవారం ఉదయం సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానానికి వెళ్లి ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. సింహాచలం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌ పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమెకు ఘనత దక్కింది.

ఎమ్మెల్యే కోలగట్లతో భేటీ

సింహాచలం నుంచి సంచయిత గజపతిరాజు నేరుగా విజయనగరం చేరుకుని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుతో పాటు పలువురు పార్టీ నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, యువజన నాయకుడు ఈశ్వర్‌ కౌశిక్‌తో కలిసి విజయనగరం కోటలోని మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. పి.వి.జి.రాజు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి మాన్సాస్‌ ట్రస్ట్‌ బాధ్యతలను చైర్‌పర్సన్‌ హోదాలో స్వీకరించారు. త్వరలోనే ట్రస్ట్‌ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించి, అన్ని విషయాలపై చర్చిస్తామని ఈ సందర్భంగా సంచయిత గజపతిరాజు స్పష్టం చేశారు.

పూసపాటి వంశీయురాలిగా...  
సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్లుగా పూసపాటి వంశీయులే కొనసాగుతున్నారు. గతంలో పూసపాటి ఆనందగజపతి రాజు ఉన్నప్పుడు ఆయనే ధర్మకర్తగా ఉండేవారు. ఆయన మరణం తరువాత సోదరుడైన అశోక్‌ గజపతి బాధ్యతలు తీసుకుని నేటి వరకూ కొనసాగారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సభ్యులను నియమించింది. విజయనగరం జిల్లాకు చెందిన వారికి దానిలో ప్రాతినిధ్యం కల్పించింది. ఆనంద గజపతి, అశోక్‌ గజపతి అన్నదమ్ములైనప్పటికీ రాజకీయంగా ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉండేది.

అశోక్‌ టీడీపీలో ఉంటే ఆనందగజపతి కాంగ్రెస్, టీడీపీల్లో పనిచేశారు. ఆయన కుమార్తె అయిన సంచయిత గజపతిరాజు ఢిల్లీలో స్థిర నివాసం అయినప్పటికీ విశాఖ ఏజెన్సీలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారిశుధ్ధ్యం, తాగునీరు రంగాల్లో విశిష్ట సేవలందించిన సంస్థలకు ఇచ్చే గూగుల్‌ గ్లోబల్‌ ఇంపాక్ట్‌ చాలెంజ్‌ అవార్డును 2013లో సాధించారు. ఆ విజయంతో వచ్చిన రూ.3 కోట్లను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఇరవై గ్రామాలు, మరో ఇరవై స్కూళ్లకు తాగునీటి సదుపాయాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల తీసుకున్న మూడురాజధానుల నిర్ణయాన్ని సంచయిత గజపతి స్వాగతించారు. విజయనగరం గడ్డపై పుట్టిన సంచయిత చెన్నై, కేరళ, ఢిల్లీలో పెరిగి ఇప్పుడు సొంత గడ్డమీద బృహత్తర బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నారు. (చదవండి: 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు

మరిన్ని వార్తలు