ఇళ్ల నిర్మాణ ఎత్తుపై ఆంక్షలు

19 Nov, 2013 02:12 IST|Sakshi
ఇళ్ల నిర్మాణ ఎత్తుపై ఆంక్షలు

సాక్షి, హైదరాబాద్:  ఇళ్ల నిర్మాణ ఎత్తుపై మళ్లీ ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మౌలిక వసతులు లేకపోయినా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అపార్ట్‌మెంట్ల సంస్కృతికి కళ్లెం వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పురపాలక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ సొసైటీల్లో వ్యక్తిగత ఇంటికోసమం టూ మూడునాలుగు అంతస్తుల భవనాలకు అనుమతి తీసుకుని ఆ తరువాత అపార్ట్‌మెంట్లుగా మారుస్తున్నారని, దీంతో ఆ కాలనీలో మౌలిక వసతులు సరిపోవడంలేదని పలు హౌసింగ్ సొసైటీలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయన్నారు. అదీగాక సొసైటీ నిబంధనలను సైతం ఉల్లంఘిస్తున్నారని అందువల్ల భవన నిర్మాణం ఎత్తుపై ఆంక్షలు విధించాలని కోరినందున ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
 భవన నిర్మాణ ఎత్తుపై ఆంక్షలు ప్రధానంగా మౌలిక వసతుల లేమి ఉన్నచోట, పర్యావరణ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం, వారసత్వ సంపద పరిరక్షణ, రాతి సముదాయం ఉన్న ప్రాంతాలు, చరిత్రాత్మక, పురావస్తు ప్రాధాన్యత ఉన్న కట్టడాలకు అడ్డంగా నిర్మాణాలు జరిగే చోట, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలున్న ప్రాంతాల్లోనూ విధిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు ప్రభుత్వం సుమోటోగా తీసుకోవడం లేదా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, నగర పంచాయతీ, మునిసిపాలిటీల కమిషనర్లు, హౌసింగ్ సొసైటీలు విజ్ఞప్తి చేసిన పక్షంలో.. ఆయా ప్రాంతాలనూ నోటిఫై చేసి ఎత్తుపై ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. ఏఏ ప్రాంతాల్లో ఎత్తు నిర్మాణంపై ఆంక్షలు విధించాలన్నది ఆయా ప్రాంతాల స్వభావం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నోటిఫై చేస్తామన్నారు.
 
 వంద అడుగుల రోడ్డును ఆనుకుని ఉండే పెద్ద విస్తీర్ణం ప్లాట్లలో ఎంత ఎత్తు వరకైనా నిర్మాణం చేసుకోవడానికి ప్రస్తుతం అనుమతినిస్తున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనే ఉత్తర్వులు ఉన్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో రహదారి, మౌలిక వసతుల గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా 400 చదరపు గజాల విస్తీర్ణంలో నాలుగైదు అంతస్తుల భవనాలు రావడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఒత్తిడి పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నందున ఈ నిర్ణయానికి వచ్చినట్లు పురపాలక శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం ఎత్తుపై ఆంక్షలు విధించడానికి అవకాశం లేనందున ఈ ఉత్తర్వులతో ఆంక్షలు విధించే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు