తమ్ముళ్లకు సిరులు

30 Mar, 2016 23:59 IST|Sakshi

శ్రీకాకుళం టౌన్ : ఇసుక వ్యాపారం తెలుగు తమ్ముళ్లకు సిరులు కురిపిస్తోంది. ఉచిత విధానాన్నీ జన్మభూమి కమిటీలు అనుకూలంగా మలుచుకున్నాయి. అధికారులను డమ్మీలుగా చేసి అధికార పార్టీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. తొలుత జిల్లాలో మహిళా సంఘాల పేరుతో రూ.65కోట్ల ఇసుక వ్యాపారం జరిగితే అనధికారికంగా రూ.వందలకోట్లు విలువైన ఇసుకను అధికారపార్టీ పెద్దలే అమ్మేశారనేది బహిరంగ రహస్యం. ఇసుక విధానంలో లోపాలు ఉన్నాయంటూ ఈ-వేలంలో ఇసుక అమ్మకాలు సాగిస్తామని జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది.
 
  రెండునెలలపాటు ఏవేలం లేకుండా చేశారు. ఇదే అదనుగా ఇంజినీరింగ్ పనులకంటూ ఇసుకను కొల్లగొట్టేశారు. విశాఖకు ఇసుక కావాలన్న సాకు చూపి నదుల్లో ఇష్టానుసారంగా ఇసుక తవ్వేశారు. ప్రభుత్వం ఈనెలలో ఆ విధానం తూచ్ అంది.  అంతా ఉచితమని ప్రకటించింది. ఈ ఉచిత విధానాన్నీ తెలుగు తమ్ముళ్లు వదల్దేదు. ఏటి ఒడ్డు గ్రామాల్లో వీరంతా పాగా వేస్తున్నారు. అక్రమ వసూళ్లకు దిగుతున్నారు. వాల్టాచట్టం, పర్యావరణ అనుమతులకు లోబడి తవ్వకాలు జరపాలంటూ కలెక్టరు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు.  
 
 తాజాగా షరతులు
 ఇసుక రీచ్ పరిస్థితి చేజారిపోతుండటంతో కలెక్టరు ఇటీవల రంగంలోకి దిగారు. తన పరిధిలో నాలుగు రీచ్‌లకు పర్యావరణ అనుమతులిచ్చి అక్కడే తవ్వకాలు జరపాలని షరతు విధించారు. విశాఖ అవసరాలకు ఒకచోట, వంశధార ప్రాజెక్టు అవసరాలకు వేరొకచోట తవ్వకాలు జరుపుకునేందుకు అవకాశమిచ్చారు. తాజాగా మరో ఆరు రీచ్‌లకు అనుమతులిచ్చారు. జలుమూరు మండలం అందవరంతోపాటు అందవరం రేవును ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు, పొన్నాం రేవును విశాఖ అవసరాలకు కేటాయింపులిచ్చారు.కిల్లిపాలెం, ముద్దాడపేట, అంగూరు, దొంపాక, పెద్దసవళాపురం, పురుషోత్తపురం, యరగాం,బొడ్డేపల్లి రేవుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు.   
 
 నిర్మాణదారులకు తగ్గని బారం
 ఇసుక ఉచితమన్నా ప్రజలకు భారం తప్పలేదు. మరింత పెరగడం విశేషం. నది నుంచి ఒడ్డుపైకి నాటుబళ్లతో తరలించి ఇసుక ట్రాక్టర్లకు ఇస్తున్నామని వెయ్యి నుంచి రెండు వేల రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే టెక్కలి డివిజన్‌లో మాత్రం ఇసుక లభ్యత లేని కారణం చూపించి ట్రాక్టరు ఇసుక రూ.3 వేల నుంచి 4వేలకు విక్రయిస్తున్నారు. నదిపరివాహక ప్రాంతాల్లో తెలుగుతమ్ముళ్లు అక్రమ వసూళ్లకు తెగబడుతుండడంతో వారికి ముడపులు చెల్లించి ఆపై ట్రాక్టరు అద్దె, కళాసీల ఖర్చంటూ నిర్మాణ దారులనుంచి భారీగానే వసూలు చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు