ఇసుకాసురులు బౌండరీ దాటేశారు !

7 Jun, 2015 23:43 IST|Sakshi

 ఆమదాలవలస: ఇసుక కోసం కొంతమంది నిబంధనలను అతిక్రమిస్తున్నారు. అనుమతి ఒకచోట ఇవ్వగా..మరోచోట యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించడంతోపాటు..బౌండరీలు (హద్దులు) దాటేస్తున్నా అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకుల తీరు కారణంగానే ఈ పరిస్థితి నెలకుందనే విమర్శలు వస్తున్నాయి. పొందూరు మండలం సింగూరు ర్యాంపు పేరతో ఆమదాలవలస మండలం దూసి పంచాయతీ పరిధి నాగావళి నదిలో ఇసుక అక్రమ త వ్వకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. వాస్తవంగా సింగూరు గ్రామం వద్ద ఇసుక ర్యాంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా దూసి గ్రామం వద్ద విచ్చలవిడిగా ఇసుకను తవ్వి తరలించేస్తుండడంతో ఈ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
 
 వివరాల్లోకి వెళితే...గతంలో దూసి వద్ద ఇసుక ర్యాంపును ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ఆ గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ర్యాంపు నిర్వాహణకు వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. అయితే రాజకీయ నాయకుల అండతో సింగూరు ర్యాంపును నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులు దూసి వద్ద ఇకసును తవ్వేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. సింగూరు ఇసుక ర్యాంపు పేరుమీద వచ్చిన చలానాలకు దూసిలో ఇసుకను లోడింగ్ చేస్తూ రాత్రి వేళల్లో దర్జాగా రవాణా చేస్తున్నారు.
 
 దూసి గ్రామం నుంచి తోటాడ వరకు రహదారిపై సుమారు 200 లారీలు ఇసుక కోసం బారులు దీని దర్శనమిస్తున్నాయి. పొక్లయినర్లతో బహిరంగంగా తవేస్తున్న ఇసుకను సుమారు 60 ట్రాక్టర్లలో లోడు చేసి రోడ్డుపైకి తీసుకొచ్చి లారీలకు లోడు చేస్తున్నారు. ఈ విషయంపై దూసి గ్రామస్తులు తహశీల్దారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి ఒత్తిడి కారణంగా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారని దూసి సర్పంచ్ ప్రతినిధి దశరధరావు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
 
  అక్రమ వసూళ్లు, రవాణా
 ర్యాంపు వద్ద ఉన్న లారీలు, ట్రాక్టర్లు చలానాలు కట్టి ఇసుకను తీసుకెళ్లేందుకు వచ్చినప్పటికీ వారి వద్ద నుంచి లారీకి రూ. 200, ట్రాక్టర్‌కు వంద రూపాయలు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని డ్రైవర్లు ఆరోపిసుతన్నారు. డబ్బులు ఇవ్వనివారి వాహనాలను క్యూలైన్ల నుంచి తప్పించి వెనుక వచ్చిన వారికి లోడింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని లోకల్ వాహనాలతో ఒకే చలానా, ఒకే బిల్లుతో మూడు, నాలుగు సార్లు ఇసుకను లోడ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని దూసి గ్రామస్తులు చెబుతున్నారు.
 
  మహిళా సంఘాలతో నడిపిస్తున్న ఇసుక ర్యాంపు వద్దకు రాజకీయ నాయకులు, గ్రామ సర్పంచ్‌లు రావాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారు. చీకటి పడిన తరువాత ఇసుక ర్యాంపు నిర్వాహణ నిలిపి వేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ అర్ధరాత్రి వరకు తవ్వకాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక అక్రమరవాణాకు అడ్డకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు