ఇ(సు)క ‘ఫ్రీ’గా దోపిడీ

2 Mar, 2016 23:38 IST|Sakshi

ఇసుకతో పచ్చనేతలకు కాసుల పంటే
ఉచితం పేరిట‘దేశం’ నేతల దందా
దళారులకు మేలు..పేదలకు మోత..
రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్ పేరుతో లూటీ

 
నిన్నటి వరకు డ్వాక్రా మాటున దోపిడీ... ఇక ఉచితం పేరుతో లూటీ.. నిత్యావసర చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన ఇసుకను నిరుపేదలు..ప్రభుత్వావసరాలకు ఉచితంగా ఇవ్వ నున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అడుగడుగునా ఆంక్షలు ఉన్నప్పుడే అడ్డగోలుగా నదులు..వాగులు..వంకల్లోని ఇసుకను దోచుకుతిన్నారు. ఇప్పుడు ఆయుధంలా మారిన ‘ఉచితం’ను అడ్డంపెట్టుకుని పేదల మాటున నదీ గర్భాలను సైతం అడ్డూ..అదుపు లేకుండా తూట్లు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
విశాఖపట్నం: జిల్లాలో ఇసుక విషయమై మైనింగ్‌శాఖ జనవరిలో ప్రత్యేకంగా సర్వే చేపట్టింది. నారాయణరాజుపేట రీచ్‌లో 10 వేలు, కాశీపట్నం రీచ్‌లో 15వేలు, కైలాసపట్నం రీచ్‌లో 14వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్టు నిర్ధారించింది. తాండవ రిజర్వాయర్‌లో పూడిక తీత ద్వారా వెలికి తీసే ఇసుక 62,470 క్యూబిక్‌మీటర్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇలా మొత్తంమ్మీద జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో రూ.లక్ష క్యూబిక్ మీటర్లు ఇసుక అందుబాటులోఉంది. గతంలో ఇలాగే నోటిఫై చేసిన 25 రీచ్‌ల్లో 3.5లక్షల క్యూ.మీ.ఇసుక ఉన్నట్టు లెక్క తేలిస్తే ఏకంగా ఐదున్నర లక్షల క్యూ.మీ.లకు పైగా ఇసుకను తవ్వేశారు. ఇంకా తవ్వుతూనే ఉన్నారు. తాజాగా లక్ష      క్యూ.మీ. ఇసుక  అందుబాటులో ఉందంటే ఇక ఏ స్థాయిలో తవ్వకాలు జరుపుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా జిల్లాలో గోస్తని, వరహా, శారదా నదుల రూపురేఖలే మారిపోయాయి. ఇక వాగులు..వంకలైతే ఇసుకతవ్వకాల వల్ల దిశ మారిపోయి వంకరటింకరగా ప్రవిహ స్తున్నాయి.
 
దళారీలను ఆశ్రయించాల్సిందే..
సాధారణంగా వ్యక్తిగత అవసరాల కోసం పేదలు, ప్రభుత్వాసవసరాలకు కాంట్రాక్టర్లు, అధికారులు నేరుగా ఇసుక తవ్వే అవకాశం ఉండదు. వీరంతా ఎప్పటిలాగే వ్యాపారులపైనే ఆధారపడాలి. ప్రస్తుతం క్యూబిక్ మీటర్ రూ.550 కాగా రవాణా, లోడింగ్ అన్‌లోడింగ్ కలిపి యూనిట్ (3 క్యూ.మీ.) ఇసుకను ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.1700లు చెల్లించాల్సి ఉంది. ఇసుక కొరతను ఆసరాగా చేసుకుని యూనిట్ ఇసుకను రూ.2,500నుంచిరూ.3వేల వరకువిక్రయిస్తున్నారు. కొత్త విధానంలో ఇసుక ఫ్రీగా ఇస్తున్నప్పటికీ లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా చార్జీలను భరించాల్సిందే. ప్రస్తుతం జిల్లాలో నిర్మాణానికి అనువైన ఇసుక లేకపోవడంతో శ్రీకాకుళం, గోదావరి జిల్లాల నుంచి దిగుమతి అవుతున్న ఇసుకపైనే ఆధారపడుతున్నారు. ఒక వేళ నిజంగా రీచ్‌ల వద్ద ఎలాంటి రుసుం వసూలు చేయక పోయినప్పటికీ జిల్లాలోని ఇసుకనే ఇతర జిల్లాల నుంచి తీసుకొస్తున్నట్టుగా చెబుతూ లోడింగ్, అన్‌లోడింగ్, దూరాభారాన్ని బట్టి రవాణా చార్జీలు కలిపి భారీగానే వసూలు చేసే అవకాశాలున్నాయి. ఇసుక పంపిణీ బాధ్యత కూడా జన్మభూమి కమిటీలకు అప్పగించనుండ డంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. వీరిని అడ్డంపెట్టుకుని స్థానిక టీడీపీ ప్రజాప్రతి నిధులు అడ్డంగా దోచుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.  ఒక వైపు ఇసుక మాఫియా.. మరో వైపు టీడీపీ నేతలు పేదల పేరిట అడ్డగోలుగా తవ్వకాలు సాగించి దర్జాగా సొమ్ముచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

వాటి రూపురేఖలు మారిపోతాయి
 ఇప్పటికే చాలా వరకు వాగులు..వంకలు ఎండిపోతున్నాయి. మరోనెలరోజుల్లో జిల్లా లోని నదుల్లో కూడా నీటి ప్రవాహం పూర్తిగా అడుగంటి పోతుంది. దీంతో బయట కొచ్చే ఇసుకను ఇష్టమొచ్చినట్టుగా తవ్వే అవకాశం ఉంది. జిల్లాలో నదులన్నీ థర్డ్ ఆర్డర్ పరిధిలోనివే. వాటిలో ఇసుకతవ్వకాల కోసం స్థానిక పంచాయతీల నుంచి అనుమతులు తీసుకుంటే చాలు. పూడిక తీత ద్వారా వెలికి తీసే ఇసుక తవ్వకాలతో తాండవ రిజర్వాయర్‌కు ముప్పువాటిల్లే అవకాశాలు లేకపోలేదు. ఇక నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థలకు సీనరేజ్‌లో వాటాలు దక్కేవి. ప్రస్తుతం సీనరేజ్ వసూళ్లను పూర్తిగా నిలిపివేస్తే ఆ మేరకు వాటి ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది.
 
ఉచితంపై నిఘా ఉంటుంది
 ఇసుకను నిత్యావసరాల చట్టం పరిధిలోకి తీసుకొచ్చి పేదలు, ప్రభుత్వావసరాలకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు రాలేదు. ఎంత ఉచితంగా ఇచ్చినా..తవ్వకాలు..అమ్మకాలపై ఆయా శాఖల నిఘా ఉంటుంది.
-సూర్యచంద్రరావు, ఏడీ, మైన్స్,
 

మరిన్ని వార్తలు