ఆగని ఇసుక దందా

1 Jun, 2019 11:13 IST|Sakshi
లారీలో ఇసుకను తరలింపు

ప్రభుత్వం మారినా ఆగని టీడీపీ నాయకుల ఆగడాలు

అరణియార్‌లో అడ్డగోలుగా తవ్వకాలు

టిప్పర్లతో తమిళనాడుకు తరలింపు

పడిపోతున్న భూగర్భ జలాలు

పట్టించుకోని అధికారులు

అడిగేవారు లేరు.. అడ్డగోలుగా తవ్వెయ్‌! అందినకాడికి దోచెయ్‌!అన్నట్లుంది అరణియార్‌లో ఇసుక దందా. జిల్లాలో టీడీపీనాయకుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ప్రభుత్వంఏర్పాటైనా వారిలో మార్పు రాలేదు. అధికారులు సంపూర్ణ మద్దతు ఇస్తుండడంతో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. యంత్రాలతో తవ్వి టిప్పర్లతో ఇసుకను తమిళనాడుకు తరలిస్తున్నారు. రాత్రీ పగలూ తేడా లేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. నిత్యం50 టిప్పర్లకు తక్కువ కాకుండా  దొంగ దారుల్లో ఎగుమతిచేస్తున్నారు. ఇక్కడ రోజువారీ వ్యాపారం కోటి పైనే ఉంటుందంటేవ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

చిత్తూరు, సాక్షి: రైతుల పాలిట కల్పతరువుగా ఉన్న అరుణానది అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం మండలాల్లో సుమారు 40 కిలో మీటర్ల మేర అరుణానది విస్తరించి ఉంది. నదిలో వరదలు వచ్చిన ప్రతిసారి తెల్లబంగారం లాంటి ఇసుక మేటలు నదికి కొట్టుకొచ్చి నిల్వ ఉంటుంది. నియోజకవర్గం సరిహద్దుగా తమిళనాడు ఉండడం.. ఆ రాష్ట్ర రాజధాని అయిన మహానగరం చెన్నై 50 కిలోమీటర్లదూరంలో ఇసుక స్మగ్లర్లకు కాసుల పంట కురిపిస్తుంది. వీరితో అధికారులు, టీడీపీ నేతలు చేతులు కలపడం వల్ల నదిలో ఇసుక అక్రమ రవాణా చాపకింద నీరులా సాగిపోతుంది. సుమారు 40–50 అడుగుల మేర నదిలో ఇసుకను తోడేయడంతో భూగర్భ జలాలు అడుగంటి పర్యావరణానికి హాని కలిగించే పరిస్థితి తలెత్తింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని సుమారు 200 గ్రామాల్లో వందల అడుగుల్లో ఉన్న బోర్లలో కూడా నీరు రాకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

గత టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది అరుణానదిలో సురుటపల్లి, కొప్పేడు గ్రామాల వద్ద రెండు ఇసుక రీచ్‌లను ఏర్పాటుచేసింది. స్థానికంగా ఇసుక కావలసిన లబ్ధిదారులు మీసేవా కేంద్రాల్లో రుసుం చెల్లించి రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ పథకం ద్వారా రీచ్‌లను ఆ పార్టీ నేతలకు కట్టబెట్టారు. ఏడాది తిరక్క ముందే రీచ్‌లలో అంతులేని అవినీతి విమర్శలు వెల్లువెత్తాయి. స్పందించిన ప్రభుత్వం ఉచితంగా ఇసుకను ఇస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో స్మగ్లర్లు మరింత పెట్రేగిపోయారు. స్థానికులకు పేరిట జోరుగా తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. మరికొంత మంది రీచ్‌లతో సంబంధం లేకుండా తమకు అనుకూలంగా ఉన్న చోట రాత్రికి రాత్రే చెన్నైకి, తమిళనాడు రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకున్నారు. చివరికి స్మగ్లర్ల మధ్య విభేదాలు తలెత్తడంతో పిచ్చాటూరు మండలం కీళపూడి వద్ద ఇసుక డంప్‌ను తమిళనాడుకు రవాణా చేసేస్తున్న లారీ, జేసీబీలను పోలీసులు సీజ్‌ చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ సుకుమార్‌కు మూడు నెలలకే బదిలీ కానుకగా ఇచ్చారు.

నాగలాపురం మండలంలో టీడీపీకి చెందిన నేత ఇసుక స్మగ్లింగ్‌ చేస్తుంటే ఎస్‌ఐ నరేష్‌ అడ్డుకున్నారన్న నెపంతో రెండు నెలలు తిరక్క ముందే బదిలీ వేటు వేశారు. ఆ తరువాత వారికి అనుకూలంగా ఉన్న అధికారులను నియమించుకుని పెట్రేగిపోయారు. నారాయణవనం మండలంలో ఇసుక స్మగ్లింగ్‌ కేసులు లెక్కలేనన్ని నమోదైనా వాటిపై చర్యలు మాత్రం శూన్యం.

ఇష్టారాజ్యం..
♦ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా చేయాలి. ఇక్కడ నిబంధనలేవీ కానరావడం లేదు.
♦ రోజులో ఇరవై నాలుగు గంటలూ అక్రమాలు కొనసాగుతున్నాయి.
♦ నదీ ప్రవాహానికి వంద మీటర్ల లోపున ఇసుక తవ్వకాలు జరుపరాదు. ఇక్కడ నదీ గర్భంలోనే జేసీబీలతో ఇసుక తోడేస్తున్నారు.
♦ ట్రాక్టరుతోనే ఇసుకను తరలించాలి. కానీ ఇక్కడ టిప్పర్లతో తోలుతున్నారు. ఇసుకను లోడు చేస్తే ఆ ఇసుక నుంచి నీరు కారుతూ ఉండకూడదు.

రైతుల కన్నా నేతలకే ఉపయోగం
అరుణానది వల్ల భూగర్బ జలాలు పెరిగి రైతులకు ఉపయోగపడడం కన్నా అందులోని ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించే నేతలకే  కాసుల వర్షం కురిపిస్తుందని ప్రజల వాదన. దీనిని అరికట్టాలసిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబందనలకు విరుద్ధం
నదిలో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 40 అడుగుల మేర ఇసుకను తోడేయడం వల్ల భూగర్భ జల మట్టం గణనీయంగా పడిపోయింది. ఈ కారణంగా ప్రస్తుతం గ్రామాల్లో తాగునీరు కరువై ప్రజలు అల్లాడుతున్నారు. నదిని ఆనుకుని ఉన్న కారూరు, వేలూరు ఒడ్డి ఇండ్లు, అడవికండ్రిగ, కీళపూడి గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తి ప్రజలు అవస్థలు పడుతున్నారు.

కాళంగి నదిలోనూ అక్రమ రవాణా
కేవీబీ పురం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లో విస్తరించి ఉన్న కాళంగి నదిలోని ఇసుకను స్మగ్లర్లు వదిలి పెట్టడం లేదు. శ్రీ సిటీ, శ్రీకాళహస్తి పేరిట ఎల్లలు దాటిస్తున్నారు. ఈ కారణంగా కేవీబీ పురంలో తెలుగు గంగ కాలువ ఉన్నా విపరీతమైన తాగునీటి ఎద్దడి తలెత్తింది. ప్రస్తుతం పదుల సంఖ్యలో గ్రామాలకు ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

మరిన్ని వార్తలు