ఇసుక మాయం

18 Sep, 2018 14:38 IST|Sakshi
కృష్ణానదిలో తవ్వకాలు నిర్వహిస్తున్న బోట్లు

కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు

చోద్యం చూస్తున్న ఇరిగేషన్‌ అధికారులు

ఫ్లడ్‌బ్యాంక్‌కు పెనుప్రమాదం

విమర్శలు గుప్పిస్తున్న ప్రజలు

తాడేపల్లిరూరల్‌: లేనిది ఉన్నట్లు పత్రాలు సృష్టించారు. అధికారులను మభ్యపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకున్నారు. ఇష్టారాజ్యంగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు నిర్వహించారు. దొరికినంత దోచుకుంటున్నారు. అధికారం ఉంటే ఏదైనా చేయవచ్చునని టీడీపీ నేతలు నిరూపించారు. ఫలితంగా కృష్ణానది ఫ్లడ్‌బ్యాంకుకు, రివర్‌ గ్రాయిన్స్‌కు పెనుముప్పు వాటిల్లే పరిస్థితి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...  తాడేపల్లి మండల పరిధిలోని ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో పెనుమాక ఇసుక రీచ్‌కి 2012 నుంచి 2014 వరకు ఇసుక ఉందంటూ లేనప్పటికీ తవ్వకాలు నిర్వహిస్తూ, అప్పటి ఎమ్మెల్యే పత్రాలు సృష్టించారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడున్న టీడీపీ నాయకులు అవే సాక్ష్యాలుగా చూపిస్తూ మార్చి, మార్చి మరీ అనుమతులు తీసుకుంటున్నారు. 2012 నుంచి 2018 వరకు 180 ఎకరాల్లో అధికారులు అధికారికంగా ఇచ్చిన ఇసుక తవ్వకాల అనుమతులు 10 లక్షల క్యూబిక్‌ మీటర్లు. పెనుమాక పరిధిలో 5, 9 నుంచి 13 సర్వే నంబర్లలో అనుమతులు మంజూరు చేశారు. ఆ సర్వే నంబర్లలో రివర్‌ మార్జిన్‌ నుంచి 500 మీటర్లు, ఏమైనా నిర్మాణాలు, పక్కా గృహాలు ఉంటే 500 మీటర్లు, అలాగే లంక భూములకు 200 మీటర్లు వదిలి తవ్వకాలు నిర్వహించాల్సి ఉంది. కానీ అధికారులకు అక్కడ ఇసుక లేదు అని నిర్ధారణ అయినప్పటికీ జిల్లాలోని టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఒత్తిడితో అనుమతులు ఉన్నట్లు, ఇసుక ఉన్నట్లు సృష్టిస్తూ కృష్ణానది గర్భానికి పెనుముప్పు వాటిల్లేలా అధికారులే సహకరిస్తున్నారు.

2012లో ఇసుక పూడిక తీత ప్రారంభం
2012లో సర్వే నంబర్లు 5, 9, 10, 11, 12, 13లో కృష్ణానదిలో ఇసుక పూడికతీత పనులను ప్రారంభించారు. అప్పుడు ప్రొసీడింగ్‌ నంబర్స్‌ 109/ఎస్‌2–పెనుమాకలో మొదటి సారిగా 50వేల క్యూబిక్‌ మీటర్లు, రెండో దఫాగా 50 వేల క్యూబిక్‌ మీటర్లు అనుమతులు ఇచ్చారు. వేరే చోట ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారంటూ పత్రికల్లో వార్తలు రావడంతో విజిలెన్స్‌ అధికారులు పరిశీలించి, అక్రమాలు జరుగుతున్నాయంటూ డిసెంబర్‌ 14, 2012న కేసు నమోదుచేశారు. అనంతరం కేసుల్లో ఇరుక్కుంటామని భయపడిన ఇరిగేషన్‌ అధికారులు లెటర్‌ నెం. సిబి/సూపరింటెండెంట్‌/ఎంసి/161తో ఒక లెటర్‌ను నవంబర్‌ 29, 2012న విడుదల చేశారు. ఆ లెటర్‌లో ప్రకాశం బ్యారేజీ 0/0 కి.మీ.నుండి 5వ కి.మీ. వరకు ఇసుక లేదని, అలా ఇసుక తీయడం వల్ల ప్రకాశం బ్యారేజీకి పెనుముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇరిగేషన్‌ అధికారులు వాటన్నింటిని తుంగలో తొక్కి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, తిరిగి మరలా అదే ఇసుక రీచ్‌లో అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఇసుక రీచ్‌ గత నెల రోజుల క్రితం గప్‌చుప్‌గా మూసివేశారు. తిరిగి మరలా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లతో అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అనుమతులు ఇలా..
ప్రొసీడింగ్‌ ఆర్‌సి నెం. 4225 పేరిట పెనుమాక ఇసుక రీచ్‌కి 2014 జి3, మే 12, 2015న 3.5 కి.మీ. – 4.5 కి.మీ. మధ్య గల ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందో చెప్పాలంటూ ఎంఆర్‌వోకు లెటర్‌ను అందజేశారు. ఆ తదుపరి ఎంఆర్‌వో ఆ ప్రాంతం పెనుమాక పరిధిలోకి వస్తుందని తెలిపారు. వెంటనే తిరిగి మరలా ఇరిగేషన్‌ అధికారులు సి.బి./సూపరింటెండెంట్‌/ఎం.సి./81ఆర్‌డబ్ల్యూ పేరు మీద మే, 16, 2015న 3.5 కి.మీ.–4.5కి.మీ.ల మధ్య లక్ష క్యూబిక్‌ మీటర్లకు అనుమతులిస్తూ, 0.5కి.మీ. వద్ద డంపింగ్‌ యార్డ్‌కు అనుమతించారు. అక్కడ ఇసుక నిల్వ చేయడానికి స్థలం లేకపోవడంతో నిబంధనలకు విరుద్ధంగా 3 కి.మీ.ల దూరంలో స్టాక్‌ యార్డ్‌ ఏర్పాటు చేయడంతో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. లక్ష క్యూబిక్‌ మీటర్లు అయిపోగానే 3 నెలల వ్యవధిలోనే ఆర్‌సి నెం.4225/శాండ్‌/పెనుమాక/జి3/21–08–2015న తిరిగి మరలా 4.5కి.మీ–5.5.కి.మీల మధ్య 4,15,000 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలు నిర్వహించవచ్చంటూ అనుమతులిచ్చారు. ఇక్కడ కూడా ఇరిగేషన్‌ అధికారులు రెవెన్యూ హద్దులను మార్చి వెంకటపాలెం రీచ్‌ వరకు ఇసుక తవ్వకాలు నిర్వహించవచ్చంటూ అనుమతులిస్తూ, అధికార పార్టీ నేతలకు సలాం కొట్టారు.
అనంతరం పలు పత్రికల్లో కథనాలు వెలువడడంతో క్వారీని నిలిపివేశారు. తిరిగి మరలా మార్చి 11, 2016న ప్రొసీడింగ్‌ నెం. 1218/శాండ్‌/పెనుమాక పేరుతో 3.2కి.మీ.–4.4కి.మీ.ల మధ్య 3 లక్షల క్యూబిక్‌ మీటర్లకు అనుమతిచ్చారు. మరల జూన్‌ 25, 2018న ప్రొసీడింగ్‌ నెం. 2025/శాండ్‌/పెనుమాక పేరిట 3.2కి.మీ.–4.4.కి.మీ.ల మధ్య 1,49,500 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చారు. 6 సంవత్సరాల వ్యవధిలో 180 ఎకరాల్లో అనుమతులు లేవంటూనే ఇరిగేషన్‌ అధికారులు 10,64,500 క్యూబిక్‌ మీటర్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారు.

మరిన్ని వార్తలు