ఇసుక అమ్మకాల్లో నిబంధనలు బేఖాతరు

1 Nov, 2018 13:50 IST|Sakshi
పెనుమూడి రేవులో ఇసుక ట్రాక్టర్లు

డ్రెడ్జర్ల నిలుపుదల సాకుతో దోపిడీ

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో యూనిట్‌ ఇసుక ధర రూ.400

రూ.700 వరకు వసూలు చేస్తున్న టీడీపీ నాయకులు

మత్స్యకార్మికులకు బెదిరింపులు

చోద్యం చూస్తున్న అధికారులు

గుంటూరు, రేపల్లె: ఆఖరి అవకాశం తవ్వుకో... దాచుకో... నినాదాన్ని అనుసరిస్తూ టీడీపీ నాయకులు దోపిడీలకు తెగబడుతునే ఉన్నారు. అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని వదులుకోకుండా సొమ్ము వసూలులో బరి తెగింపు కొనసాగుతోంది. టీడీపీ నాయకులు తమ పంథాను యధావిధిగా కొనసాగిస్తున్న తమ అక్రమ దందాపై నియోజకవర్గంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెనుమూడి ఇసుక రేవులో టీడీపీ నాయకుల అక్రమ దందా పంథా మార్చారు. ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన టీడీపీ నాయకుల బరితెగింపు కథనానికి అధికారులు స్పందించి డ్రెడ్జర్లను నిలుపుదల చేయించారు. దీంతో టీడీపీ నాయకులు పడవల ద్వారా మ్యాన్యువల్‌ తరలిస్తున్న ఇసుకకు రేటు పెంచి తమ అక్రమ దందాను తెరతీశారు. యూనిట్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.400 వసూలు చేయాల్సి ఉండగా మంగళవారం వరకు రూ.600 వసూలు చేసిన టీడీపీ నాయకులు బుధవారం నుంచి రూ.700లకు పెంచి మరింత బరి తెగించారు. ప్రతి రోజు సుమారు 200 ట్రాక్టర్లలో ఇసుకను లోడు చేస్తున్న పరిస్థితులు నెలకొనటంతో భారీ వసూలుకు రంగం సిద్ధం చేశారు. రోజుకు అక్రమ సంపాదన రూ.60 వేలు ఒక్క మత్స్యకార్మికుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. గత ఆగస్టు 2017 నుంచి జూన్‌ 2018 వరకు సుమారు రూ.50 కోట్లు ఇసుక రీచ్‌లో సంపాదించిన టీడీపీ నాయకులు తిరిగి కార్మికులకు అందించిన అవకాశా>న్ని తమ అక్రమ సంపాదనకు మలుచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇసుకకు గిరాకీ
నియోజకవర్గ పరిధిలో ఎన్టీఆర్‌ గృహకల్ప, ప్రైవేటు వ్యక్తులు ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇతర ప్రాంతాలకు పెనుమూడి ఇసుక రీచ్‌ నుంచి తరలిస్తున్నారు. దీంతో ఇసుకకు మంచి గిరాకీ ఏర్పడింది. ఇసుక రుచి మరిగిన టీడీపీ నాయకులు అక్రమ దందాకు తెరతీసి రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆందోళనలో కార్మికులు
మత్స్యసంపద గణనీయంగా తగ్గిపోతుండటంతో మత్స్యకారులు పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు తమ సమస్యలను విన్నవించారు. దీనికి కలెక్టర్‌ స్పందించి ఇసుక తరలింపు చేసుకునేందుకు మత్స్యకార్మికులకు అనుమతినిచ్చారు. టీడీపీ నాయకులు అవకాశంగా మలుచుకుంటూ తమ పొట్టకొట్టడం ఏమిటని మత్స్యకార్మికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూనిట్‌ ఇసుక తరలిస్తే రూ.400 కార్మికులకు ఇచ్చి అదనంగా రూ.300లు దండుకుంటున్నారని ఇదేమని ప్రశ్నిస్తే ఇసుక రేవు మూయించి వేస్తామని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇసుక రేవు వద్ద టీడీపీ నాయకుల అక్రమాలకు అడ్డుకట్ట వేసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం
పెనుమూడి ఇసుక రేవులో మత్స్యకార్మికులు మ్యాన్యువల్‌గా ఇసుకను తరలించుకునేందుకు జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రెడ్జర్లను ఏర్పాటు చేయకుండా అధికారుల పర్యవేక్షణ నిర్వహిస్తున్నాం. కార్మికులు తరలించే ఇసుకకు యూనిట్‌కు రూ.400 మాత్రమే వసూలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూలు చేస్తున్న అంశం నా దృష్టికి రాలేదు. అదనపు వసూలుపై కూడా అధికారుల పర్యవేక్షణ నిర్వహిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటాం.–ఎస్వీ రమణకుమారి, తహసీల్దార్, రేపల్లె

మరిన్ని వార్తలు