ఇసుకను కొల్లగొట్టె.. కోట్లు కూడబెట్టె

27 Dec, 2015 00:14 IST|Sakshi

 జిల్లాలో యథేచ్ఛగా ఇసుకాసురుల దందా
 గోదావరికి గుండెకోత
 కాలువలు, వాగులనూ వదలని అక్రమార్కులు
 కోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోని యంత్రాంగం
 కలెక్టర్ పేరుచెప్పి మరీ దందా సాగిస్తున్న ఓ ఎంపీడీవో

 
 టాస్క్‌పోర్స్ :‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు’ అన్న వేమన మాట ఎంతవరకూ నిజమో చెప్పడం కష్టం కావచ్చు కానీ.. ఇసుకను బొక్కి కోట్లాది రూపాయలు కొల్లగొట్టవచ్చని నిరూపిస్తున్నారు అక్రమార్కులు. అధికారం అండతో నాయకులు, వారి అనుచరులు, కొందరు అధికారులు గోదావరి గర్భాన్ని నిలువెల్లా తవ్వేస్తున్నారు. తమ్మిలేరు, జల్లేరు వాగులతోపాటు ఎర్రకాలువ, బైనేరు, తూర్పు, పడమర కాలువల నుంచి సైతం అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. ఇల్లు కట్టుకోవాలని ఆశపడే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇసుకాసురుల్లో ప్రజాప్రతినిధులతోపాటు కొందరు అధికారులు సైతం ఉన్నారు.
 
 తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా బహిరంగంగానే సహజ సంపదను దోచేస్తున్నారు. జిల్లాలో ఇసుక ర్యాంపులు మూతపడటంతో అక్రమ వ్యాపారం ఊపందుకుంది. ప్రజాప్రతినిధుల అండతో అధికార పార్టీ నేతలు కొందరు ఇసుక దందా సాగిస్తున్నారు. గోదావరి తీరంలోని ఆచంట, పెనుగొండ, పెరవలి, యలమంచిలి మండలాలతోపాటు మెట్ట ప్రాంతంలోని దెందులూరు, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, చింతలపూడి, ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయగూడెం మండలాల్లో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. మెట్ట ప్రాంతానికి చెందిన ఓ ఎంపీడీవో అయితే కలెక్టర్ పేరు చెప్పి బహిరంగంగా తవ్వకాలు, తరలింపు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పంచాయతీల పేరుచెప్పి ఎర్రకాలువ ప్రాంతం నుంచి ఇసుక తరలిస్తున్నారు.
 
 ర్యాంపులు మూతపడినా..
 జిల్లాలో 22 ఇసుక ర్యాంపులు ఉండగా, పర్యావరణ అనుమతులు లేని కారణంగా అక్టోబర్ 30న  మూసివేశారు. కొవ్వూరు మండలంలో గోంగూరతిప్పలంక-1, 2 పేరుతో రెండు ర్యాంపులు నడుస్తున్నా గతనెల 7వ తేదీ నుంచి ఆన్‌లైన్ బుకింగ్ నిలిపి వేశారు. దీంతో సామాన్యులకు ఇసుక కష్టాలు మొదలయ్యాయి. పోల వరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పారిశ్రామిక వేత్తలు, బడా సంస్థల పేరిట బల్క్ బుకింగ్ ముసుగులో ఈ రెండుచోట్ల అక్రమ వ్యాపారానికి కొందరు పెద్దలు తెరలేపారు.
 
 ‘తూర్పు’ వే బిల్లు .. ‘పశ్చిమ’లో తవ్వకం
 కొవ్వూరు పరిసర ప్రాంతాలకు చెందిన వారు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ర్యాంపునుంచి ఇసుక తెచ్చుకుంటున్నారు. ఉదయం పూట ఆ ర్యాంపు నుం చి ఒక ట్రిప్పు వేసిన వాహనాలపై రాత్రివేళ అదే వే బిల్లుతో కొవ్వూరు ప్రాంతంలో తవ్విన ఇసుకను తరలిస్తున్నారు. జిల్లాలో సాగుతున్న ఇసుక అక్రమ తవ్వ కాలు, రవాణా వ్యవహారం హైకోర్టు మెట్లెక్కింది. ఇక్కడ సాగుతున్న వ్యవహారాలపై జిల్లా అధికారు లకు హైకోర్టు అక్షింతలు వేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా ఉన్నతా ధికారులు అక్రమాల జోలికి వెళ్లడం లేదు. దీనిని అలుసుగా చేసుకుని కొందరు చెలరేగిపోతున్నారు.
 
 అక్రమాలివిగో
 అచంట నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతం, నడిపూడి, పెదమల్లం, కోడేరు, భీమలాపురం ప్రాం తాల్లో అర్ధరాత్రి వేళ ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రెండు యూనిట్ల ఇసుకను రూ.14 వేలకు విక్రయిస్తున్నారు. ఆచంట మండలం అయోధ్యలంక పరిధిలోని పుచ్చల్లంకలో అక్రమ వ్యాపారం జోరుగా సాగిపోతుంది. అయోధ్యలంక, పుచ్చల్లంకు చెందిన టీడీపీ నేతలు అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
 పెరవలి మండలం కానూరు అగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ఉమ్మిడివారిపాలెం, ఖండవల్లి గ్రామాల్లోనూ అక్రమ వ్యాపారం పెద్దఎత్తున సాగుతోంది. పగటివేళ ఇసుక సేకరించి మూటలు కట్టి ఆటోల్లో తరలిస్తున్నారు. రాత్రివేళ ట్రాక్టర్లలో లోడ్ చేసి బయటి ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఇక్కడ ఇసుక తవ్వేవారి నుంచి ఓ ప్రజాప్రతినిధి పీఏ ట్రాక్టర్‌కు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారు.
 
 చింతలపూడి మండలంలో తమ్మిలేరు వాగులో క్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా దొడ్డిదారుల్లో తరలించేస్తున్నారు. ట్రక్కు ఇసుకను రూ. 3,800 నుంచి రూ.4,200కు విక్రయిస్తున్నారు.     ఇటీవల నాగిరెడ్డిగూడెంలో భారీఎత్తున నిల్వ ఉంచిన ఇసుకను అధికారులు కనుగొన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఎక్కడి ఇసుకను అక్కడే వదిలేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో  మండలస్థాయి టీడీపీ నాయకుల కనుసన్నల్లో రాత్రి సమయాల్లో రవాణా చేస్తున్నారు. జల్లేరు, ఎర్రకాలువ, బైనేరు కాలువల నుంచి గుర్వాయిగూడెం, పంగిడిగూడెం, పేరంపేట, జల్లేరు,  బైనేరు, మైసన్నగూడెం తదితర ప్రాంతాల నుంచి రవాణా చేస్తున్నారు. ట్రక్కు ఇసుకను రూ.3వేలకు పైగా విక్రయిస్తున్నారు. కొయ్యలగూడెం మండలంలో ఎర్రకాలువ, బైనేరు పడమటి, తూర్పు కాలువల్లో తవ్వకాలు పెద్దఎత్తున సాగుతున్నాయి.
 
 అర్ధరాత్రి దాటిన తరువాత ట్రక్కులతో ఇసుకను రవాణా చేస్తున్నారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఈ దందా నడుస్తోంది. బుట్టాయగూడెం మండలంలో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఇసుక మాఫియా కొనసాగుతోంది. అల్లికాలువ, జల్లేరు, బైనేరు, కొవ్వాడ కాలువల నుంచి ఇసుక తవ్వి తరలిస్తున్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో కొవ్వూరు మండలం  సీతంపేట, మద్దూరులంకల్లో రాత్రివేళ ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. చిడిపి గ్రామ శివారున గండిపోశమ్మ ఆలయ సమీపంలోనూ ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి.
 

మరిన్ని వార్తలు