ఇసుక మాఫియా

24 Dec, 2013 04:27 IST|Sakshi

తుర్కపల్లి, న్యూస్‌లైన్: హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న తుర్కపల్లి మండల కేంద్రం ఇసుక దందాకు కేంద్రంగా మారింది. రోజురోజుకు లక్షలాది రూపాయల విలువైన ఇసుక అక్రమంగా నగరానికి యథేచ్ఛగా తరిలిపోతోంది. ప్రభుత్వాధికారులు, పోలీసుల సహకారంతో ఇసుక మాఫియాకు పట్టిష్టమైన చట్టాలు సైతం చుట్టాలుగా మారిపోతున్నాయి. స్థలం ఎవరిదైనా సరే గుట్టుచప్పుడు గాకుండా చీకటి వ్యాపారానికి తెరతీస్తున్నారు. అధికార యంత్రాంగం ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో ఈ వ్యాపారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా కొనసాగుతోంది.

ఇప్పటికే గంధమల్ల చెరువులో చాలా ఏళ్ల నుంచి ఇసుక అక్రమంగా తరులుతున్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలూ చేపట్టలేకపోయింది. దీంతో ఇసుక అక్రమదారులకు ఆడిందే ఆటగా మారింది. ఈ ఇసుక వ్యాపారంలో ప్రభుత్వ యంత్రాంగానికి ముడుపుల రూపంలో లక్షలాది రూపాయలు ముడుతున్నాయని ఆరోపణలున్నాయి.  రాత్రి పూట యంత్రాలతో ఇసుకను డంప్‌లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రే నగరానికి తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు.

 కుంటలకు ఎసరు
 తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రా మ సమీపంలోని ఓ కుంటకు ఇసుక వ్యా పారులుఎసరు పెడుతున్నారు. ప్రముఖ సినీ నటుడు సుమన్‌తో పాటు సింధూర (కిన్నెర) శ్రీనివాస్‌ల పేరిట 176.35 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి తుర్కపల్లి, మాంత్రోనిమామిడి, ఇబ్రహీం పురం, దత్తాయపల్లి గ్రామ శివారుల్లోని దట్టమైన ఆడవిలో ఉంది. ఎక్కువ భా గం కొండలు, చెట్లతో నిండి ఉంది. ఈ భూమిలోనే కొన్ని నీటి కుంటలున్నాయి. చాలా ఏళ్ల నుంచి పైనుంచి వచ్చిన వరదల ద్వారా టన్నులకొద్ది ఇసుక ఈ కుంటల్లో చేరింది. అక్రమదారుల కన్ను ఈ కుంటలపై పడింది.

ఈ కుంటలకు లారీలు, ట్రాక్టర్లు చేరాడానికి కొండ చెరియలను కూడా తవ్వి అడవిలో నుం చి  బుడబుడకలోని కుంట వరకు దారిని ఏర్పాటు చేసుకున్నారు. కుంటల్లో ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి జేసీబీల ద్వారా ఇసుకను తవ్వి డంప్‌ల వద్దకు టాక్టర్లలో కూలీలతో చేరవేస్తున్నారు. అక్కడి నుంచి లారీల ద్వారా నగరానికి రవాణా చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. సదరు భూమి యజమానులకు తెలియకుండా రాత్రిపూట యాంత్రాలతో పని కానిచ్చేస్తున్నారు.
 వివాదాస్పద భూమిలో చీకటి దందా
 ఈ భూమి విషయంలో సుమాన్, కోనేరు శ్రీనివాస్‌కు వివాదం ఏర్పడి కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. దీంతో ఇద్దరూ ఈ భూమిని పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా భావించిన అక్రమదారులు తమ పంజా విసిరారు. భూయజమానులకు తెలియకుండానే చీకటి దందా సాగిస్తున్నారు. దూరంగా ఉంటున్న యజమానులకు ఈ తతంగం తెలియడం లేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, కఠినమైన వాల్టా చట్టం తెచ్చినా ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. మండలంలో ఎక్కడ చూసినా ఇసుక డంప్‌లు ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా వ్యాపా రం సాగిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి ఇసుక అక్రమ రవాణా, ఇసుక ఫిట్లర్ల ఏర్పాట్లను నివారించి, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది.
 

మరిన్ని వార్తలు