కౌండిన్య టు కర్ణాటక

1 Nov, 2018 12:27 IST|Sakshi
మాడి శివాడి చెరువులో జేసీబీలతో ఇసుక తవ్వకాలు

జోరుగా ఇసుక అక్రమ రవాణా

రోజూ రెండు వేల వాహనాల ద్వారా తరలింపు

అడ్డొస్తే అంతు చూస్తామనే     సంకేతాలు

అధికార పార్టీ నేతకు పోలీస్‌ అధికారి బాసట

జిల్లాలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు.     పలమనేరు పరిధిలోని కౌండిన్య నది నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై నిఘా పెట్టినా..    అడ్డుకున్నవారి అంతు చూసేందుకు ఇసుకాసురులు వెనుకాడడం లేదు. అధికార పార్టీ ముఖ్యుడితోపాటు ఓ పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు ఇసుక మాఫియాకు సహకారమందిస్తున్నారని సమాచారం.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పలమనేరు సమీపంలో కౌండిన్య నది పరీవాహక ప్రాంతాల్లో విలువైన ఇసుక ఉంది. మాడి శివాడి చెరువులో 6 కి.మీ మేర ఇసుక భారీగా చేరి ఉంది. కౌండిన్య నది, చెరువులోని ఇసుక ఒక డీఎస్పీకి, అధికార పార్టీ నేతకు కాసుల వర్షం కురిపిస్తోంది. రోజూ 2వేలకుపైగా వాహనాల ద్వారా జిల్లా సరిహద్దు ప్రాంతా నికి చేరవేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి 20 మీటర్ల దూరంలో అక్కడక్కడ డంప్‌ చేస్తున్నారు. కౌండిన్య నదిలోని ఇసుకతో పాటు మాడి శివాడి చెరువును సైతం తవ్వి పైన ఉన్న మట్టిని, కింది భాగంలో ఉన్న ఇసుకను  తోడేస్తున్నారు.  జేసీబీలతో ఇసుకను తోడి ట్రాక్టర్లకు నింపి సరిహద్దు ప్రాంతానికి చేరవేస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలో చేరవేసిన ఇసుకను కర్ణాటక నుంచి వచ్చిన వాహనాలకు అక్కడ కూలీలు నింపి బెంగుళూరుకు తరలిస్తున్నారు. ట్రాక్టర్‌ ఇసుకకు రూ.5వేలు వసూలు చేస్తున్నారని తెలిసింది.

డంపింగ్‌ వద్ద వేలాది మంది కూలీలు..
అధికార పార్టీ నాయకుని కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ రవాణాకు ఎవరైనా అడ్డొస్తే అంతుచూసేలా ఓ పోలీస్‌ అధికారి కొందరు వ్యక్తులను నియమించినట్లు ప్రచారం జరుగుతోంది.  ఆ ప్రాంతానికి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లినా ప్రమాదమే. అక్రమ రవాణాపై నిఘాపెట్టారని తెలిస్తే అక్కడికక్కడే మట్టుపెట్టేందుక్కూడా వెనుకాడవద్దని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఎవరూ సాహసం చేయటం లేదని తెలిసింది. ఇసుకను అక్రమంగా తరలించి అధికార పార్టీ∙ముఖ్య నాయకుడు, పోలీస్‌ అధికారి రోజూ లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నట్లు భోగట్టా. ఇక్కడ పోలీస్‌ ఉన్నతాధికారిగా బాధ్యతలు చేపట్టాకే కౌండిన్య నది, మాడి శివాడి చెరువులోని విలువైన ఇసుక కరిగిపోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరిద్దరి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే పలమనేరు, కుప్పం ప్రాంతాల భూగర్భ జలాలు భారీగా పడిపోయి ఎడారిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు