మన ఇసుక పేరిట మాయాజాలం

25 Apr, 2019 14:09 IST|Sakshi
జాతీయ రహదారి వద్ద ఇసుక కోసం క్యూలు కట్టిన లారీలు

సీజ్డ్‌ ఇసుక చేజిక్కించుకునేందుకు బ్లూఫ్రాగ్‌ స్కెచ్‌

హైవే పనులు పేరిట ఇసుక అనుమతులు కోసం దరఖాస్తు

ఒక్కో లారీ వద్ద రూ.12వేలు వసూలుకు పాల్పడుతున్న వైనం

అధికారుల కళ్లు కప్పుతూ దోపిడీ

నిబంధనలకు విరుద్ధంగా రాత్రిళ్లు తరలింపు  

శ్రీకాకుళం రూరల్‌: ఇసుక కోసం కొత్త ఎత్తులకు, స్వాధీనం చేసుకునేందుకు కొత్త పొత్తులకు ఆ సంస్థ నిర్వాహకులు  శ్రీకారం చుట్టారు. పేరులో తీరులో వేర్వేరుగా వ్యవహరిస్తూ అధికారులకే చుక్కలు చూపిస్తున్నారు. మండల పరిధిలోని బైరి, కరజాడ, రోణంకి పరిసర ప్రాంతాల్లో ఇటీవల సీజ్‌ చేసిన ఇసుకను స్వా«ధీనం చేసుకునేందుకు బ్లూఫ్రాగ్‌ మొబైల్‌ టెక్‌ లిమిటెక్‌ సంస్థ ముందుకొచ్చింది. ప్రధానంగా హైవే పనులు పేరిట ఇసుక అవసరం కోసం ఓ లేఖను మనశాండ్‌ ద్వారా బ్లూఫ్రాగ్‌ సంస్థ నిర్వాహకులకు జాతీయ రహదారి పనులు చేస్తున్న వారు కొన్నాళ్ల కిందట రాశారు. దీంతో బ్లూఫ్రాగ్‌ సంస్థ వారు కలెక్టర్‌ ఉన్నతాధికారులకు ఆ లేఖను జతచేస్తూ సీజ్డ్‌ ఇసుక ఫలాన ప్రాంతంలో ఉందని ప్రభుత్వ జాతీయ రహదారి పనులు పేరిట కావాలని కోరారు.

అసలు కథ ఇక్కడే మొదలు
వాస్తవంగా జాతీయ రహదారి పనులుకు కావాల్సిన ఇసుకతో పాటు మరికొంత ఇసుకను అక్రమంగా అమ్మేందుకు ఆ సంస్థ నిర్వాహకులు ఓ పన్నాగం పన్నినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పేరు మాత్రం జాతీయ రహదారి పనులు కోసం చెబుతూ అందులో భాగంగానే మరికొంత ఇసుకను పక్కతోవ పట్టిస్తూ విశాఖ, అనకాపల్లి, విజయనగరం తదితర ప్రాంతాల్లో అమ్ముకునేందకు గాను ఒక్కో లారీ రూ.12,000లు చొప్పున బ్లూఫ్రాగ్‌ సంస్థ నిర్వాహకులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా జియోట్యాగింగ్‌ కోసం ఒక్కో లారీకు మాత్రం రూ.260లు వసూలు చేయాలి. ఇది ప్రభుత్వ నిబంధన. కానీ ఇందులో స్వామికార్యం, స్వకార్యంతో కలిపి ఇష్టానుసారంగా ఆ సంస్థ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా..
వాస్తవంగా బ్లూఫ్రాగ్‌ సంస్థ నిర్వాహకులకు కావాల్సిన ఇసుక ఎవరికైనా అప్పగించేందుకు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల లోపు (పగటి వేళల్లో) మాత్రమే జియోట్యాగింగ్‌ చేస్తూ పంపించాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రాత్రి 7గంటల తర్వాత సుమారు వందకు పైగా లారీలను వంశధార నది ర్యాంప్‌ పరిసర ప్రాంతాల్లోకి పెద్దపెద్ద యంత్రాలతో ఇసుకను ఎత్తించేందుకు బ్లూ ఫ్రాగ్‌ సంస్థ సిబ్బంది పూనుకున్నారు. ఇది చట్ట విరుద్ధం.

అధికార పార్టీ నాయకులే కీలకం
మండలంలోని బైరి, కరజాడ గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత ఈ ఇసుక దందా వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన ముందస్తుగానే బ్లూఫ్రాగ్‌ సంస్థ నిర్వాహకులతో లాలూచీ పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రోణంకిలో 510, బైరిలో 3920, కరజాడలో 4,890 క్యూబ్‌లకు ఇసుకను రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం గుర్తించారు. సీజ్‌ చేసిన ఇసుకను ప్రభుత్వ అవసరాలకే తరలిస్తున్నామని, దీన్ని ఎవరూ అడ్డుకోవద్దని సంఘటన స్థలానికి చేరుకున్న ప్రభుత్వ సిబ్బంది ఆయా గ్రామస్తులకు సూచించారు. 

మరిన్ని వార్తలు