నిబంధనలకు తూట్లు

23 Mar, 2018 13:10 IST|Sakshi
కానూరు పెండ్యాల ఇసుక ర్యాంపులో ఐదు అడుగులపైనే ఇసుక తవ్వేస్తోన్న వైనం

అడ్డూఅదుపు లేకుండా ఇసుక తవ్వకాలు 

ఇష్టారాజ్యంగా నదీగర్భంలో రాళ్లతో రోడ్లు 

కన్నెత్తి చూడని అధికారులు

నిబంధనలకు తూడ్లు పొడిచి ఇసుక తవ్వకాలు చేస్తుండడంతో గోదావరి నదీగర్భం ప్రమాదకరంగా మారుతోంది. ఈ లోతైన తవ్వకాల వల్ల నదీ ప్రవాహ దిశ మారిపలు గ్రామాల వద్ద లంకలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. నదీగర్భంలో రాళ్లతో రోడ్డు నిర్మాణం చేయకూడదని నిబంధనలు చెబుతున్నా పట్టించుకోవడం లేదు.దీంతో గోదావరి ప్రవాహానికి ఆ రోడ్లు అడ్డంకిగా మారుతున్నాయి.

పెరవలి: జిల్లాలో గోదావరి నదిలో పోలవరం నుంచి లంకలకోడేరు వరకు సుమారు 13 ఇసుకర్యాంపులు ఉన్నాయి. వీటన్నింటిలోనూ నిబంధనలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు కేవలం మట్టిని ఉపయోగించి రహదారి ఏర్పాటు చేసుకోవాలని నిబంధన ఉన్నా మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు కాసులకు కక్కుర్తి పడటంతో ఇష్టారాజ్యంగా నదీగర్భంలో రోడ్లను వేస్తున్నారు. మట్టిరోడ్లైతే గోదావరికి వరద వచ్చినప్పుడు మట్టి కరిగిపోయి కొట్టుకుపోతుందని, దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని ప్రభుత్వం ఈ నిబం ధన పెట్టింది. అయినా నిర్వాహకులు రాళ్లతోనే రహదారులు నిర్మిస్తున్నారు. అలాగే రెండు మీటర్ల లోతు వరకే తవ్వవలసి ఉండగా 4 మీటర్లకు పైగా ఇసుక కోసం గోతులు తవ్వేస్తున్నారు. ఒక యూనిట్‌ వాహనాలను అనుమతించాల్సి ఉండగా భారీ లారీలు సైతం లోపలికి ప్రవేశిస్తున్నాయి.

నిబంధనలు ఇవిగో..
గోదావరిలో ఇసుక తవ్వకాలకు మైనింగ్‌ డిపార్టుమెంట్‌ ఇచ్చిన ఆదేశాలు ఇలా ఉన్నా యి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక తవ్వకాలు జరపాలి. గోదావరిలో ఇసుక మేటలను బట్టి తవ్వకాలు రెండు మీటర్ల నుంచి 3 మీటర్లు మాత్రమే తవ్వకాలు జరపాలి.
ఇసుక మేటలు 6 మీటర్లు ఉంటే 2 మీటర్లు, 8 మీటర్లు ఉంటే 3 మీటర్లు తవ్వవచ్చు.
మనుషులతో తప్ప మెషీన్లు ఉపయోగించకూడదు.
గోదావరిలో నదీ ప్రవాహానికి అడ్డులేకుండా బాట వేసుకోవాలి. అదీ మట్టితోతప్ప రాళ్లతో వేయకూడదు.
ఇసుకను సమాంతరంగా తీయాలి.కానీ గోతులు పెట్టకూడదు.
నదీ గర్భంలోకి కేవలం ట్రాక్టర్లు,ఎడ్లబండ్లు మాత్రమే వెళ్లాలి. వీటి ద్వారా ఒక యూనిట్‌ మాత్రమే ఇసుకను బయటకు తీసుకురావాలి.
నీరు ఊరిన చోట ఇసుక తవ్వకాలు జరపకూడదు.
నీటి ప్రవాహానికి 20 మీటర్ల దూరంలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలి.

మరిన్ని వార్తలు