ఆగని అక్రమ తవ్వకాలు

6 Jun, 2019 13:34 IST|Sakshi
పోలవరం మండలం పట్టిసం ర్యాంపు నుంచి ఇసుక తరలిస్తున్న దృశ్యం

పట్టిసం నుంచి ఇసుక తరలిస్తున్న వైనం

పోలవరం రూరల్‌: అనుమతులు లేకున్నా ఇసుక అక్రమంగా తరలిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా రాత్రీ, పగలూ ఇసుకను అక్రమార్కులు తరలించేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉచిత ఇసుక విధానంలో ఇసుకను లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలవరం మండలంలో పోలవరం, గూటాల, గ్రామాల్లోని ఇసుక ర్యాంపులు వారం రోజుల క్రితమే మూతపడినా పట్టిసం గ్రామంలోని ఇసుక ర్యాంపు నుంచి ఇంకా ఇసుకను తరలిస్తున్నారు. ర్యాంపుల్లో సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు.

ఇసుక ర్యాంపులు మూసివేయాలి: ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
పోలవరం మండలంలో అనుమతులు లేకున్నా ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారని, వాటిని వెంటనే మూసివేయాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతుల పేరుతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక ర్యాంపుల నిర్వహణపై కొత్త విధానం తీసుకురానున్నారని చెప్పారు. మండలంలోని ఏ ఒక్క ఇసుక ర్యాంపునకు అనుమతులు లేవని, ఇసుక ర్యాంపులు మూసివేయాలని బాలరాజు పేర్కొన్నారు.

పట్టిసం ర్యాంపునకు అనుమతులున్నాయి: జి.చినబాబు, తహసిల్దార్‌
పోలవరం మండలంలోని పట్టిసం రేవు నుంచి ఇసుకను తరలించేందుకు ఇంకా అనుమతులు ఉన్నాయి. ఇటీవల ర్యాంపుల నిర్వహణకు సంబంధించి రికార్డులు తనిఖీ చేశాం. వారి నుంచి అనుమతుల వివరాలు కూడా తీసుకున్నాం. అనుమతులు ముగిసిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే ఇసుక ర్యాంపును మూయిస్తాం.  

మరిన్ని వార్తలు