పెన్నమ్మకు గర్భశోకం

24 Jan, 2019 13:50 IST|Sakshi
ట్రాక్టర్లలో తరలిపోతున్న ఇసుక

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

కోర్టు ఆదేశాలు కూడా బేఖాతర్‌

స్పందించని అధికారులు

ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఒకటిరెండు కాదు నిత్యం వందలసంఖ్యల ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతోంది. ఇసుక మాఫియాఆగడాలకు పెన్నమ్మ గర్భశోకంతోఅల్లాడుతోంది. ఒంటినిండాగాయాలతో తల్లడిల్లిపోతోంది.ఇంత జరుగుతున్నా అధికారులుఅటువైపు కన్నెత్తి చూడకపోవడంఆందోళన కలిగిస్తోంది.  

కడప కార్పొరేషన్‌: కడప నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఓబులంపల్లి సమీపంలో, అదీ గండివాటర్‌ వర్క్స్‌ వద్ద ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఇసుక మాఫియా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో ఇసుకను అడ్డదారిలో సరిహద్దులు దాటిస్తోంది. ఇసుక తవ్వకాలతో తాగునీటి పథకాలకు ముప్పు తప్పదని పర్యావరణ వేత్తలు మొత్తుకుంటున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. న్యాయస్థానాలు ఇది పర్యావరణానికి చేటు, భూగర్భ జలాలు అడుగంటి పోతాయని హెచ్చరిస్తున్నా ఇసుకాసురుల ఆట కట్టించడంలో అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. కడప నగరానికి ప్రధాన తాగునీటి వనరు అయిన గండి వాటర్‌ వర్క్స్‌కు  మూడున్నర కిలోమీటర్ల వరకూ ఇసుక తవ్వకాలు జరపకూడదని కోర్టు స్టే ఇచ్చింది.

న్యాయస్థానం ఉత్తర్వులను కూడా కాదని చెన్నూరు తహసీల్దార్‌ టీడీపీ నాయకులు ఎవరు సిఫారసు చేస్తే వారికి అనుమతులు ఇచ్చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ తహసీల్దార్‌ అనుమతి ఇచ్చిన మేరకే ఇసుక తవ్వుతున్నారా... అంటే అదీ లేదు. ఓబులంపల్లెలోని శివుని గుడికి పోయే మార్గం ద్వారా నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుక తరలిపోతోంది. ఇసుక అక్రమ రవాణా వల్ల రోడ్డంతా పాడైపోయింది, ఈ మార్గంలో ఉండే పంట పొలాలు, మామిడి వనాలు ఎర్రటి మట్టితో నిండిపోయాయి. ఈ ప్రాంతంలో ఓబులంపల్లె దాని చుట్టు పక్కల ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే బోర్లు పదిదాకా ఉన్నాయి. వీటితోపాటు రైతుల బోర్లు కూడా పెన్నాలో ఉన్నాయి.  ఇసుక రవాణా వల్ల అవన్నీ  ఎండిపోయే పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు గండి వద్ద కడపకు నీటిని సరఫరా చేసే బోరు బావుల వద్ద ఇసుక పూర్తిగా లేకుండా పోయింది. దీంతో బోరుబావులు  ఒక పక్కకు ఒరిగిపోతున్నాయి.

స్పందించని అధికార యంత్రాంగం
ప్రతిరోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మిన్నకుండి చూస్తోంది. తప్పితే అక్రమార్కులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నెలరోజులుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా యాభై మంది కూలీలతో ఇసుక లోడ్‌ చేయిస్తున్నారు. ఇక్కడి నుంచి తరలిస్తున్న ఇసుక జిల్లా సరిహద్దులు దాటి పోతోంది. వివిధ కారణాలతో పోలీసులు దీనిపై దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇసుక తవ్వకాల వల్ల పెన్నానది గుల్లవడంతోపాటు ఈ ప్రాంతాల్లో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో మూడున్నర కిలోమీటర్ల పరిధిలో ఇసుక తవ్వరాదని ఆదేశాలిచ్చింది. వీటన్నింటినీ పట్టించుకోకుండా తహసీల్దార్‌ మొండిగా ముందుకెళ్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు