మాతల తాకట్టు

21 Mar, 2019 09:21 IST|Sakshi
మేట వేసిన పొలాల మీదుగా నదీ గర్భం వరకూ నిర్మించిన రోడ్డు

ఆయన పాతపట్నంలో నాయకుడు... ఆయనేదో తమను ఉద్ధరిస్తారని ప్రజలు ప్రజాప్రతినిధిని చేశారు. కానీ నియోజకవర్గం అభివృద్ధి ముసుగులో అధికార టీడీపీలోకి ఫిరాయించేశారు. ప్రజల ఉద్ధరణ మాటెలా ఉన్నా మాతల ఇసుక నుంచి రూ.కోట్లు ఎలా పిండేయాలో బాగా తెలుసుకున్నారు. ఇంకేమి అధికార పార్టీ అండ ఉంది... ఉచిత ఇసుక విధానం కలిసొచ్చింది... అయితే మాతల ర్యాంపును ఇస్తానని ఏకంగా టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్‌టీ రామారావు బంధువులకే ఎసరు పెట్టేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికార టీడీపీలోకి ఫిరాయించినపుడు ఆ ప్రజాప్రతినిధి చాలా మాటలు చెప్పారు. 2016 మార్చి నెలలో ఆయన విజయవాడలో టీడీపీ ముఖ్యనేత సమక్షంలోనే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేకపోతున్నానని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగాలంటే అధికార పార్టీలో చేరడమే మంచిదని ఆరోజు చెప్పుకున్నారు. కానీ అభివృద్ధి ఏమిటో ప్రజలకు కొద్దిరోజుల్లోనే అర్థమైపోయింది. మాతల ఇసుక ర్యాంపు నుంచి సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక వరకూ, నీరు–చెట్టు పనుల నుంచి ఐటీడీఏ రోడ్లు నిర్మాణం వరకూ, అక్రమ నిర్మాణాల నుంచి ఆక్రమణల వరకూ... ఇలా అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించిన ఘనత ఏమిటో పాతపట్నం నియోజకవర్గ ప్రజల కళ్లకు కడుతోంది.

 
రైతుల ముసుగులో ఇసుక అమ్మకం....
పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న వంశధార, మహేంద్రతనయ నదుల నుంచి ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా జరిగింది. వంశధార నదికి గతంలో వచ్చిన వరదల కారణంగా కొత్తూరు మండలంలోని పొనుటూరు, మాతల ప్రాంతాల్లో రైతుల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రజాప్రతినిధి పార్టీ ఫిరాయించిన వెంటనే ఓ ఎత్తుగడ వేశారు. వరదల వల్ల పొలాల్లో మేట వేసిన ఇసుక తొలగించి అమ్ముకునేందుకు అనుమతి కావాలని రైతుల పేరుతో జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేసుకున్నారు. అనుకున్నట్లుగానే అనుమతి వచ్చింది.

ఇదే సమయంలో మాతల ఇసుక జిల్లాలో మిగతా నదుల కంటే నాణ్యమైనదిగా ప్రచారం చేయించారు. దీంతో ఎంతోమంది ఇసుక వ్యాపారులు మాతలకు బారులు తీరారు. అలా ఆశపడి వచ్చినవారిలో ఎన్‌టీఆర్‌ బంధువులు కూడా ఉన్నారు. విశాఖపట్నంలో నివాíసం ఉంటున్నారు. మాతల ర్యాంపులో ఇసుక తవ్వుకోవడానికి అనుమతి (అన్ని విధాలా అండదండలు) ఇవ్వడానికి రూ.కోటి కమీషనుగా తీసుకున్నారు. అంతేకాదు ఇసుక ఉన్న పొలాల రైతులకు ఇచ్చేందుకు మరో రూ.50 లక్షలు అదనంగా తమ వద్ద వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. తీరా ర్యాంపు వారికి ఇవ్వకుండా విశాఖపట్నానికే చెందిన మరో వ్యాపార బృందంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆ ప్రజాప్రతినిధి రూ.కోట్లలోనే గడించిన విషయం బహిరంగ రహస్యమే!


నిబంధనల ఉల్లంఘన...
వాస్తవానికి అధికారులు ఇచ్చిన అనుమతి ప్రకారం మాతల రైతుల పొలాల్లో మేట వేసిన ఇసుకను తవ్వి విశాఖపట్నం రవాణా చేసుకోవచ్చు. కానీ ఆ పొలాల్లో ఇసుక నేటికీ అలాగే ఉంది. మరి తవ్విన ఇసుక ఎక్కడిది అంటే.. అంతా నదిలో ఇసుకే! పొలాల్లోని ఇసుక మేటలు వదిలేసి వంశధార నదిలోని ఇసుకను అక్రమంగా తోడేశారు. నిలువెత్తు లోతున చెరువులను తలపించేలా నదిని తవ్వేశారు. ఈ అక్రమ ఇసుక వ్యాపారంతో రూ.కోట్లు మూటగట్టుకున్నారు. అదండీ మరోసారి ఓట్ల కోసం ప్రజల ముందుకు వస్తున్న ఆ ప్రజాప్రతినిధి గారి ఇసుక దందా కథ! 


 

మరిన్ని వార్తలు