ఇసుకాసురులదే ఈ నేరం..!

17 Jun, 2015 01:27 IST|Sakshi
ఇసుకాసురులదే ఈ నేరం..!

 తెనాలి : ఇసుక తవ్వకాల పేరుతో కృష్ణానదిలో నిబంధనలకు పాతరేసి మరీ గోతులు తీసిన ఇసుకాసురుల నేరానికి అమాయక యువత బలవు తోంది. నదీపాయలోని నీటి మడుగుల్లో పాతాళాన్ని తలపించే గోతులున్నట్టు తెలియని యువత, సరదా కోసం నీటిలో దిగి జలసమాధి అవుతున్న దుష్టాంతాలు కలవరపరుస్తున్నాయి. విహారానికి వచ్చి, నీటిలో కాసేపు సేదదీరుదామనుకుంటే మడుగు గర్భాల్లో దాగిన గోతులు మృత్యువులా ఒడిలోకి తీసుకుంటున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని కలిగిస్తున్నాయి.నిన్నగాక, మొన్న వీర్లపాలెం వద్ద మృత్యువాత పడిన మంగళగిరికి చెందిన ముగ్గురు బీటెక్ విద్యార్థులతో కలుపుకుని ఏడాదిన్నర వ్యవధిలో 20 మంది వరకు మరణించిన దాఖలాలు ఇందుకు నిదర్శనం.

 కృష్ణానది కుడి కరకట్టకు అంచున కనకదుర్గమ్మ వారధి నుంచి పెనుమూడి వారధి వరకు దాదాపు 70 కిలోమీటర్లు ఉంటుంది. కరకట్ట ఆనుకుని తాడేపల్లి, మంగళగిరి రూరల్, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టి ప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని గ్రామాలున్నాయి. కరకట్ట ఏర్పడ్డాక వాహనాల రాకపోకలు పెరిగాయి. సమీప ప్రాంతాల్నుంచి ఆటవిడుపుకని యువకులు నదీతీరానికి రావటం పరిపాటిగా మారింది. నదీపాయల్లో అక్కడక్కడా ఉన్న మడుగుల్లోకి లోతు తక్కువనుకుని దిగుతూ, అగాధంలోకి కూరుకుపోతుండటం ఇటీవల పెరిగింది.

ఈనెల 15న బీటెక్ చదువుతున్న మంగళగిరికి చెందిన అయిదుగురు చిన్ననాటి స్నేహితులు సరదాగా గడిపేందుకని కరక ట్ట మీదుగా దుగ్గిరాల మండల గ్రామం వీర్లపాలెంలో నదీతీరానికి వెళ్లారు. నీటిమడుగులోకి దిగిన అంకం అభిలాష్, బిట్ర సాయిశ్రీకర్, మలబంటి శివనాగప్రసాద్‌లు విగతజీవులయ్యారు. గత ఫిబ్రవరిలో తెనాలిలో ఇంటర్ చదువుతున్న తొమ్మిదిమంది విద్యార్థులు, ప్రీ ఫైనల్ పరీక్షలు కాగానే, కొల్లూరు మం డలం చిలుమూరులంక వద్ద నదీతీరానికి విహారానికని వెళ్లారు.

అందులో అయిదుగురు విద్యార్థులు జలసమాధి అయ్యారు. గత ఆగస్టు నెలలో సీతానగరం వద్ద ముగ్గురు ఇంటర్ విద్యార్థులు చనిపోయిన విషాదం ఇంకా స్థానికుల మది నుంచి చెరిగిపోలేదు. గత ఏడాది జనవరిలో కొల్లిపర మండలం మున్నంగి వద్ద ఈ తరహాలోనే ముగ్గురు స్నేహితులు చనిపోయారు. వారిలో ఇద్దరు ఇంటర్ సెకండియర్ విద్యార్థులు.  వారేకాదు, అడపాదడపా ఎవరో ఒకరు నీటిలో దిగి గల్లంతవుతున్నారు.ఇలా ఏడాదిన్నరలో 20మందికి పైగా మరణించినట్టు సమాచారం. రోజువారీ పనుల్లో తెలియక నీటిలో దిగి మరణించిన వృద్ధుల వివరాలు అధికారుల వరకు రావటం లేదు.

 మామూళ్ల మత్తులో అధికారులు ...
 ప్రవాహ తీవ్రత, వరదల సమయాల్లో నదిలో గోతులు ఏర్పడుతుంటాయి. బంగారాన్ని మించిన ఆదాయాన్ని ఇసుకతో రాబట్టవచ్చన్న మహత్తరమైన ఆలోచన వచ్చాక ఇసుకాసురుల కన్నుపడి న దీతీరం చెల్లాచెదురైంది. నిబంధనలకు పాతరేసి, లెసైన్సు పొందిన విస్తీర్ణానికి మించి విస్తరించి, అంచనాలకు అందని లోతుల్లోకి పొక్లయిన్లతో కుళ్లబొడిచి మరీ ఇసుక తవ్వుకున్నారు. పర్యావరణానికి ప్రమాదమని తెలిసినా మామూళ్ల మత్తులో అధికారగణంలో పలువురు వారికి దాసోహమంటున్నారు. ఫలితంగానే నదిలోని నీటిపాయలు మృత్యునిలయంగా మారుతున్నాయి. కనీసం ఇలాంటిచోట్ల హెచ్చరిక బోర్డులనైనా ఏర్పాటుచేస్తే కొంత ఫలితముం డేది. ఇప్పటికయినా అధికారుల స్పందించాలి.

మరిన్ని వార్తలు