-

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

11 Aug, 2013 03:38 IST|Sakshi
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఇసుక ర్యాంపుల లీజు గడువు ముగిసింది. కొత్త లీజులకు టెండర్లు పిలవలేదు. అలాగని పాతవాటిని రెన్యువల్ చేయలేదు. అయినా దాదాపు అన్ని ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు, రవాణా ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ఇసుక ర్యాంపుల నిర్వహణకు గత ఏడాది ఇచ్చిన లీజుల గడువు జూన్ నెలాఖరుతో ముగిసింది. అయినా కొత్త లీజుల మంజూరుకు అధికారులు ఇంతవరకు టెండర్లు ఆహ్వానించలేదు. కనీసం పాతవాటి గడువు పొడిగించడానికి కూడా చొరవ తీసుకోలేదు. ఇసుకాసురులకు ఈ పరిస్థితి ఆయాచిత వరంగా మారింది. ఎక్కడికక్కడ అధికార పార్టీ నాయకులు అండదండలు పుష్కలంగా ఉండటంతో ప్రభుత్వ అనుమతి లేకుండా, ఎటువంటి రాయల్టీలు చెల్లించనవసరం లేకుండానే నాగావళి, వంశధార నదులకు ఇరువైపులా పెద్ద ఎత్తున ఇసుక తవ్వి పోసి, రవాణా చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే ర్యాంపుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
 
 ఇసుక దందాకు ఊతం ఇలా..
   2007 నుంచి జిల్లాలో ఇసుక ర్యాంపులకు గిరాకీ పెరిగింది. అప్పటికి 23 ఇసుక రీచ్‌లు ఉండగా ఆ తర్వాత ఏడాదిలో వాటి సంఖ్య 34 వరకు పెరిగింది. ఇవన్నీ నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిలో కొన్నింటికి న్యాయపరమైన సమస్యలు ఉండగా, మరికొన్నింటికి వివిధ శాఖల అనుమతులు లేకపోవడంతో గత ఏడాది 12 రీచ్‌లకు మాత్రమే టెండర్లు నిర్వహించారు. వీటిలో యరగాం మినహా మిగిలిన రీచ్‌ల కాలపరిమితి జూన్ నెలతో ముగిసింది. వీటికి జూలైలో కొత్త టెండర్లు పిలవాలి.. లేదా పాతవాటినే రెన్యువల్ చేయాలి. ఈ రెండూ జరగలేదు. ఇదే అదనుగా ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. లీజులు మంజూరు చేయనప్పుడు తవ్వకాలు నిషిద్ధమైనా.. దాన్ని ఇసుకారులు ఉల్లంఘిస్తున్న విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. 
 
 రెవెన్యూ, పోలీస్, మైన్స్, విజిలెన్స్, తదితర శాఖ లకు అక్రమ ర్యాంపులపైనా, రవాణా చేసే వాహనాలపైన దాడులు చేసే అధికారం ఉంది. అయినా వారెవరూ వాటి జోలికి పోవ డం లేదు. ఎప్పుడో ఒకటీఅరా దాడులు చేసి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు.   ఇసుక ర్యాంపు మంజూరుకు భూగర్భజల శాఖ, మైన్స్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అనుమతి అవసరం. అనుమతుల జారీలో ఈ శాఖలు తీవ్ర కాలయాపన చేస్తునానయి. జిల్లాలో 35 ర్యాంపుల నిర్వహణకు అనుమతి కోరుతూ డ్వామా అధికారులు ఆయా శాఖలు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికి 15 ర్యాంపులకే అనుమతులు వచ్చాయి. దీని వెనుక ఇసుకాసురుల, అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని తెలుస్తోంది. లీజులు మంజూరు కానంతవరకు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకోవచ్చన్నదే వారి పన్నాగం.
 
   సకాలంలో ఇసుక ర్యాంపులకు టెండర్లు పిలవకపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. ఇటీవలి కాలంలో ఇసుక ర్యాం పుల ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. 2007లో 27 ర్యాంపుల ద్వారా రూ.90 లక్షల ఆదాయం లభించగా.. 2012లో అది రూ. 6 కోట్లకు పెరిగింది. లీజులు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ ఆదాయం ప్రభుత్వానికి చేరడం లేదు. ఇసుకాసురు ల హస్తగతమవుతోంది.   గతంలో ఇసుక ర్యాంపుల పర్యవేక్షణ, టెం డర్ల ఖరారు వంటి వాటిని గనుల శాఖ నిర్వహించేది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ బాధ్యతలను ప్రభుత్వం డ్వామాకు అప్పగించింది. ఈ ప్రక్రియ వారికి కొత్త కావడం, అనుమతుల్లో జాప్యం కారణంగా ప్రస్తుత పరిస్థితి నెలకొంది. ఈ విషయమై డ్వామా పీడీ ఎ. కల్యాణ్ చక్రవర్తి వద్ద ప్రస్తావించగా ఈ ఏడాది రీచ్‌లను గుర్తించామన్నారు. 18 రీచ్‌లకు టెండర్లు పిలి చేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అయితే కొన్ని శాఖల నుంచి క్లియరెన్స్ రావల్సి ఉందని వివరించారు.
మరిన్ని వార్తలు