ఇసుక తిన్నెలపై ప్రభుత్వ ‘పెద్దలు’

11 Nov, 2017 04:16 IST|Sakshi

బీచ్‌సాండ్‌ మైనింగ్‌ పేరుతో కొల్లగొట్టే పన్నాగం

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తీరప్రాంతంపై కన్ను

తొలిదశలో బందరు–కృత్తివెన్ను తీరంలో సన్నాహాలు

అస్మదీయ సంస్థకు కట్టబెట్టే దిశగా చర్యలు

మైనింగ్‌తో పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదమున్నా పట్టించుకోని వైనం

‘ముఖ్య’నేత కనుసన్నల్లో కొనసాగుతున్న వ్యవహారం

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలోని తీరం వెంబడి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఇసుక దిబ్బలపై తాజాగా ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. బీచ్‌సాండ్‌ మైనింగ్‌ పేరుతో ఈ ఇసుక దిబ్బల్లో మైనింగ్‌ కార్యకలాపాలు చేపట్టి.. వాటిలో ఉన్న అత్యంత విలువైన ఖనిజాల్ని వెలికితీసి.. వేలాది కోట్లు కొల్లగొట్టే దిశగా పథక రచన చేశారు. ఇందులో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తీర ప్రాంతంలోని ఇసుక దిబ్బలను తమ అస్మదీయ కార్పొరేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. తొలి దశలో బందరు–కృత్తివెన్ను మధ్యలోని 20 వేల హెక్టార్లను కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీచ్‌సాండ్‌ మైనింగ్‌ వల్ల తీరప్రాంత రక్షణకోసం ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదమున్నా పట్టించుకోవ ట్లేదు. ఇష్టారాజ్యంగా సాగే బీచ్‌సాండ్‌ మైనింగ్‌ కారణంగా.. ప్రకృతి విధ్వంసానికి దారితీసే ప్రమాదముందని, మత్స్యకారులు, రైతులు నష్టపోవాల్సి వస్తుందని పర్యావరణవేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను, అభ్యంతరాల్ని సైతం బేఖాతరు చేస్తున్నారు. ‘ముఖ్య’నేత కనుసన్నల్లోనే ఈ వ్యవహారమంతా సాగుతుండడం గమనించాల్సిన విషయం.

ఏపీఎండీసీ ద్వారా కథ నడిపిస్తున్నారు..
కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని తీరప్రాంతాల్లోని ఇసుకలో పలు ఖనిజ నిక్షేపాలున్నాయని ‘జియోగ్రాఫికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ గుర్తించింది. ప్రధానంగా ఇల్మనైట్, జిరాన్, గార్నెట్, మోనజైట్, సిల్మినేట్‌ వంటి ఖనిజాలున్నట్లు నిర్ధారించింది. దాదాపు 80 వేల హెక్టార్లలో 8 లక్షల మిలియన్‌ టన్నుల ఖనిజ నిక్షేపాలున్నట్లు అంచనా వేసినట్టు తెలుస్తోంది. ఆ ఖనిజ నిక్షేపాలను తన అస్మదీయులకు కట్టబెట్టాలని ‘ముఖ్య’నేత భావించారు. ఇందుకు ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా కథ నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ‘ముఖ్య’నేతకు సన్నిహితమైన కార్పొరేట్‌ సంస్థ ఒకటి బీచ్‌సాండ్‌ మైనింగ్‌కోసం దరఖాస్తు చేసింది.

తొలి దశలో బందరు–కృత్తివెన్ను మధ్యలో...
అస్మదీయ సంస్థలకు తీరప్రాంతాన్ని దశలవారీగా కట్టబెట్టాలన్నదే ‘ముఖ్య’నేత ఉద్దేశంగా ఉంది. ఈ క్రమంలో తొలిదశలో కృష్ణా జిల్లా బందరు–కృత్తివెన్ను మధ్యలో ఉన్న తీరప్రాంతాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో దాదాపు 20 వేల హెక్టార్లలో 2 లక్షల మిలియన్‌ టన్నుల ఖనిజ నిక్షేపాలున్నాయని అంచనా వేశారు. దీనికోసమే ‘ముఖ్య’నేతకు సన్నిహితమైన ఓ సంస్థ ఏపీఎండీసీ ద్వారా దరఖాస్తు చేసింది. దీనిపై ప్రభుత్వ పెద్దల సూచనలతో జిల్లా యంత్రాంగం ఈ దిశగా కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు బందరు–కృత్తివెన్ను మధ్యలో తీరప్రాంతంపై ప్రాథమికంగా సర్వే చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. సర్వే నంబర్లు, విస్తీర్ణం, భౌగోళిక స్వరూపం, ఆ ప్రాంతంపై ఆధారపడిన మత్స్యకార, ఇతర కుటుంబాలు తదితర వివరాలతో కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

తీరప్రాంతం విధ్వంసం..
తీరప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఇసుక దిబ్బలు పర్యావరణపరంగా ఎంతో కీలకమైనవి. తీరప్రాంతం కోతకు గురికాకుండా కాపాడుతాయి. ఇసుకదిబ్బలపై ఏర్పడిన మడ అడవులు, జీడిమామిడి, సరుగుడు, ఇతర వృక్ష సంపద తుపాన్లు వంటివి సంభవించినప్పుడు రక్షణ కవచంగా ఉపయోగపడుతాయి. తుపాను వల్ల జరిగే నష్టం తీవ్రతను తగ్గించడంలో ఇవి తోడ్పడతాయి. అయితే బీచ్‌సాండ్‌ మైనింగ్‌తో.. తీరప్రాంతం విధ్వంసానికి దారితీస్తుంది. తీరప్రాంత రక్షణ కోసం ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ వ్యవస్థ దెబ్బతింటుంది. నిబంధనల ప్రకారం ఎక్కడ తవ్విన ఇసుకను మైనింగ్‌ చేసిన తర్వాత అక్కడే మళ్లీ వేయాలి. కానీ దేశంలో ఎక్కడా అలా చేయట్లేదు. అనుమతిచ్చిన దానికంటే ఎక్కువ పరిధిలో ఇసుకను తవ్వేస్తూ ఇష్టారాజ్యంగా మైనింగ్‌ చేస్తున్నారు. దీంతో మత్స్య సంపద లభ్యత తగ్గిపోతోంది. తీరప్రాంతం కోతకు గురవుతోంది. సముద్రపు ఉప్పునీరు పొలాల్లోకి చేరి పంటలు నాశనమవుతున్నాయి. ఇదే పరిస్థితి ఇక్కడా ఏర్పడుతుంది. ఒకవేళ దివిసీమ ఉప్పెన వంటివి సంభవిస్తే అప్పటికంటే మరింత తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదముందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

శ్రీకాకుళం అనుభవాలను పట్టించుకోకుండా..
గతంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లో భూముల్ని బీచ్‌సాండ్‌ మైనింగ్‌కోసం ఇవ్వాలని అప్పటి రోశయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై మత్స్యకారులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీన్ని విస్మరించి.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీరప్రాంతాన్ని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది.

కన్నేసింది అందుకే..
తీరప్రాంతంలోని ఇసుక దిబ్బల్లో దాదాపు 16 రకాల ఖనిజాలుంటాయి. క్వార్ట్‌జ్, ఇల్మనైట్, జిరాన్, గార్నెట్, మోనజైట్, సిల్మినేట్‌ వంటివి ఇందులో కొన్ని. ఇవి ఎంతో విలువైనవి. వీటిని బీచ్‌సాండ్‌ మైనింగ్‌ ద్వారా వెలికితీసి ప్రాసెస్‌ చేసి.. యూరప్‌కు ఎగుమతి చేస్తారు. వీటిని విమానాలు, రాకెట్‌ టెక్నాలజీ, వాచీలు, వజ్రాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్‌ తదితర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఒక్కో ఖనిజానికి ఒక్కో ధర పలుకుతుంది. మొత్తంగా ఈ ఖనిజాల విలువ వేల కోట్లలో ఉంటుంది. అందువల్లే ప్రభుత్వ పెద్దల కన్ను దీనిపై పడింది. అందుకే బీచ్‌సాండ్‌ మైనింగ్‌ వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ఏమ్రాతం పట్టించుకోకుండా అస్మదీయ కంపెనీకి కట్టబెట్టాలని చూస్తున్నారు.

>
మరిన్ని వార్తలు