అతివ చేతికి ఇసుకాస్త్రం

4 Aug, 2014 02:14 IST|Sakshi

 ఏలూరు: జిల్లాలో మహిళలకు ఇసుక రీచ్‌లు అప్పగించనుండటంపై స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇసుక కొత్త పాలసీ ద్వారా ఆదాయం పెరగటం అటుంచితే ఈ విధానాన్ని ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందన్న  విమర్శలు రేగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టి చేతులు కాలాక ఆకులు పట్టిన చందంగా వదిలేసింది. ఇప్పుడు టీడీపీ సర్కార్ కూడా మహిళలకు రీచ్‌లు అప్పగింత పేరుతో ఇసుక పాలసీని గందరగోళం చేస్తుందన్న ఆందోళన అధికారుల్లో కలుగుతోంది. స్థానికంగా లభించే ఇసుక ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు ఆదాయ వనరుగా ఉండాలి.
 
 దీనిని మహిళా సంఘాల పేరిట తెలుగు తమ్మళ్ల స్వాహా పర్వానికి ప్రభుత్వం తెరలేపిందన్నా విమర్శలు వినవస్తున్నాయి.  ఇసుక అమ్మకాలపై పరిజ్ఞానం లేని మహిళా సంఘాలను పావులుగా వాడుకుని ఆదాయం తెలుగు తమ్మళ్లు జేబుల్లో చేర్చేందుకు ఈ విధానం అమలుకు ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. జిల్లాలోని మొత్తం 16 ఇసుక రీచ్‌లను మహిళా సంఘాల అప్పగించటంపై ఫిషర్‌మెన్ సొసైటీలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర కేబినెట్ ప్రకటించిన నూతన ఇసుక విధానంలో వారి ప్రస్తావన లేదు.
 
 ఎన్ని సంఘాలకు అప్పగిస్తారో
 ఇసుక రీచ్‌లను పర్యవేక్షిస్తూ, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తూ ఎప్పటికప్పుడు సాంకేతికపరమైన సమాచారం అందిస్తున్న మైనింగ్ శాఖను కూడా ఈ విషయంలో పక్కనపెట్టడం విమర్శలకు ఊతమిస్తోంది. ఏపీ మినరల్స్ కార్పొరేషన్‌కు ఇసుక తరలింపు బాధ్యతలను అప్పగించి,  మహిళా సంఘాల ద్వారా ఇసుక విక్రయాలు చేపట్టే పద్ధతి అవలంబిస్తారని సమాచారం. జిల్లాలో 62వేల డ్వాక్రా సంఘాలున్నాయి.  ఈ నేపధ్యంలో ఇసుక రీచ్‌లు ఏ విధంగా అప్పగిస్తారు? ఆదాయం ఎలా పంచుతారనేది మహిళా సంఘాల సభ్యుల్లో చర్చనీయాంశమైంది. మండలంలో చురుకుగా పనిచేసే 20 సంఘాలకు ఈ బాధ్యతలను అప్పగించి, ఇసుక విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 75శాతం ప్రభుత్వానికి జమ చేసి,
 
 మిగిలిన 25 శాతంలో పనిచేసే సంఘాలకు 50 శాతం, ఇతర సంఘాలకు కూడా కొద్ది మొత్తంలో జమ చేసి మహిళా సంఘాలను సంతృప్తి పరచే ఎత్తుగడకు ప్రభుత్వం దిగినట్లు భావిస్తున్నారు. మహిళా సంఘాలు కొన్ని చోట్ల శక్తిమేరకు పనిచేస్తూ లాభాలు గడిస్తున్నా మేజర్ సంఘాలు మాత్రం పొదుపు సొమ్ముతో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాయి. ధాన్యం సేకరణ వ్యవహారంలోనే  కొన్ని సంఘాలు అవకతవకలకు పాల్పడిన  సందర్భాలున్నాయి. ఇసుక రేటు బంగారం కన్నా మిన్నగా ఉన్న తరుణంలో రీచ్‌ల అప్పగింత, ఇతర వ్యవహారాలు పారదర్శకంగా సాగితేనే ప్రభుత్వ నిర్ణయానికి ఓ అర్ధం ఉంటుంది.
 
 ఆదాయ వనరులు నిర్వీర్యం
 గతంలో రెండేళ్ల కాలానికే రూ.24 కోట్ల ఆదాయం ఇసుక రీచ్‌ల వేలం ద్వారా లభించింది. ఇసుక తవ్వకాలను శాస్త్రీయంగా చేపట్టాలనే యోచనతో పర్యావరణ పరిమితులున్న చోట్లే రీచ్‌ల నుంచి ఇసుకు తీసుకునే విధానాన్ని రూపొందిస్తూ దానిని జిల్లా స్థాయి అధికారుల చేతుల్లో పెట్టడం దొంగచేతికి తాళాలు ఇచ్చిన మాదిరిగానే ఉందనేది పలువురి అభిప్రాయం. పొక్లెయిన్‌లను నిరోధించటం కొత్త విధానంలో సాధ్యమయ్యే అవకాశం కన్పించటం లేదు. మహిళా సంఘాలు కేవలం పోగుబడిన ఇసుక విక్రయించటమనేది పూర్తిస్థాయిలో లోపభూయిష్టమే. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలపై క్షేత్రస్థాయిలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రతి వ్యవహారాన్ని ఆన్‌లైన్‌లో రికార్డు చేస్తేనే పర్యవేక్షించటానికి సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇసుక రీచ్‌ల అప్పగింతపై ఇప్పటి వరకు విధివిధానాలు ఖరారు కాలేదని మైనింగ్‌శాఖ ఏడీ వైఎస్ బాబు తెలిపారు.
 

మరిన్ని వార్తలు