ఇసుక ధరలు ఖరారు

5 Oct, 2014 02:13 IST|Sakshi
ఇసుక ధరలు ఖరారు

తవ్వే విధానాన్నిబట్టి మూడుగా విభజించి, ధరలు నిర్ణయించిన ఏపీఎండీసీ
యంత్రాలతో తవ్వకాలు జరిగే రీచ్‌ల వద్ద టన్ను ధర రూ. 157
మనుషుల ద్వారా తవ్వే చోట టన్ను రూ. 211
మిషన్లు, కూలీలను వినియోగించే రీచ్‌ల ఇసుక ధర రూ. 177

 
హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక ధరలను ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఖరారు చేసింది. రీచ్‌లలో తవ్వకాలు జరిగే తీరునుబట్టి మూడు విభాగాలు చేసి, ధరలను నిర్ణయించింది. ప్రొక్లెయిన్ వంటి యంత్రాల ద్వారా తవ్వకాలు జరిగే రీచ్‌లో టన్ను ఇసుక ధర రూ. 157గా నిర్ణయించింది. పూర్తి స్థాయిలో మనుషుల ద్వారా తవ్వకాలు జరిగే రీచ్‌ల వద్ద టన్ను రూ. 211గా ఖరారు చేసింది. యంత్రాలు, కూలీలను సమంగా ఉపయోగించే రీచ్‌ల వద్ద టన్ను రూ. 177గా నిర్ణయించింది. ఈ ధరలు కేవలం రీచ్ స్టాక్ పాయింట్ల వద్ద వాహనంలోకి ఇసుక లోడ్ చేసేంతవరకు నిర్ధారించిన ధరలు మాత్రమే. అక్కడి నుంచి రవాణా చార్జీలను వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 28న కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం డ్వాక్రా గ్రూపు మహిళా సంఘాలు మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టి, అమ్మకాలు జరపాలి. ఇసుకను ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమ్మాలి. ధరను నిర్ణయించే అధికారాన్ని ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)కు అప్పగించింది. కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే జిల్లా ఇసుక కమిటీలు ఆ జిల్లాలో ఇసుక రవాణా ఖర్చును ఖరారు చేస్తాయి. ఈ రవాణా చార్జీలను ఏపీఎండీసీ నిర్ణయించే ధరకు కలిపి వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏపీఎండీసీ శనివారం ఇసుక ధరలను ఖరారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. ఆమోదం వచ్చాక అవి అమల్లోకి వస్తాయి.

ట్రాక్టర్ల ద్వారా వాగు ఇసుక...

రాష్ట్రంలో ఇప్పటివరకు 111 ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వివిధ నదీ పరివాహక ప్రాంతాల్లో 83 రీచ్‌లకు అవకాశం ఉంది. అయితే, నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. ఈ రీచ్‌లలో వేటికీ పర్యావరణ అనుమతులు లేవని అధికారవర్గాలు చెబుతున్నాయి. పెద్ద వాగులు, చిన్న చెరువుల్లో ఇసుక తవ్వకాలకు మాత్రం పర్యావరణ అనుమతులు అవసరంలేదు. ఇలాంటి 28 ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. కొత్త విధానం ప్రకారం అధికారికంగా గత నెల రోజులుగా పెద్దస్థాయి వాగులు, చెరువుల్లో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా వెలికి తీసే ఇసుకను ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా మాత్రమే ఆయా మండలాల పరిధిలోనే విక్రయించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం తాత్కాలికంగా ట్రాక్టరు ద్వారా ఇసుక రవాణా చార్జీలను రాష్ట్రస్థాయిలో ఖరారు చేయాలని భావిస్తోంది. ప్రతి 5 కిలోమీటర్లను ఒక కేటగిరీగా తీసుకొని రూ. 80 వంతున ట్రాక్టరు రవాణా చార్జీలు నిర్ణయించాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది.
 
రీచ్‌ల వద్ద లారీ ఇసుక ధర రూ. 3,165


సాధారణంగా పది టైర్ల లారీ ద్వారా 15 టన్నులు, ఆరు టైర్ల లారీ ద్వారా 8 టన్నుల ఇసుకను తరలిస్తుంటారు. ట్రాక్టర్లలో 4.5 టన్నులు రవాణా చేస్తుంటారు. కొత్త ధరల ప్రకారం పది టైర్ల లారీలో 15 టన్నుల ఇసుక లోడ్ చేయడానికే రూ 2,355 నుంచి రూ. 3,165 చెల్లించాల్సి ఉంటుంది. 4.5 టన్నుల సామర్ధ్యం ఉండే ట్రాక్టరు ఇసుకకు స్టాక్ పాయింట్ వద్ద రూ. 707 నుంచి రూ. 950 వరకు వసూలు చేస్తారు. అక్కడి నుంచి చేర్చాల్సిన దూరాన్నిబట్టి  రవాణా చార్జీలను అదనంగా చెల్లించాలి.
 

మరిన్ని వార్తలు