ఏపీలో ఇసుక దోచేస్తున్నారు

29 May, 2018 02:43 IST|Sakshi

     ‘పోలవరం’ మత్స్యకారుల జీవనోపాధికి గండి

     ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లిన పిటిషనర్లు

     పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై వివరణ కోరిన ట్రిబ్యునల్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భారీస్థాయిలో అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతూ రోజూ రూ.కోట్లు దోచుకుతింటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్‌ చేస్తూ ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ రాజ్యవర్థన్‌రాథోర్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. ఏపీలో యంత్రాలతో ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశాలు ఇచ్చిందని,అయితే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో రోజూ రూ.కోట్ల విలువైన ఇసుకను దోచేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ వాదించారు. ఈ వ్యవహారంలో తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే గతంలో ఈ కేసును ఎన్జీటీ చైర్మన్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారించడంతో ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడంపై ఆ బెంచ్‌కే ఈ కేసును రిఫర్‌ చేస్తున్నామని జస్టిస్‌ రాజ్యవర్థన్‌ తెలిపారు. 

వారికి పరిహారమివ్వండి..
పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌ డ్యాం, డయా ఫ్రం వాల్‌  నిర్మాణంవల్ల  తమ జీవనోపాధికి గండి ఏర్పడిందని బాధిత మత్స్యకారులు ఎన్జీటీని ఆశ్రయించారు. కేజీ బేసిన్‌లో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు అక్కడి మత్స్యకారులకు నెలకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందించారని, పోలవరం విషయంలోనూ అదే పరిహారాన్ని అందించాలని పిటిషనర్లు కోరారు. కేసు విచారణకు స్వీకరించిన జస్టిస్‌ జావేద్‌ రహీమ్‌ నేతృత్వంలోని బెంచ్‌ పోలవరం అథారిటీ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది.

‘పురుషోత్తపట్నం’ పోలవరంలో భాగమేనా?
 పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది.  నిర్వాసితులు సత్యనారాయణ, రామకృష్ణ  దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ జావేద్‌ రహీమ్‌ నేతృత్వంలోని బెంచ్‌  పోలవరం ప్రాజెక్టులో పురుషోత్తపట్నం ప్రాజెక్టు భాగమా? కాదా?, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా?లేవా? అన్న విషయాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, జలవనరుల శాఖ, పోలవరం అథారిటీలకు  నోటీసులు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు