ఇసుక కొరత తీరేలా..

24 Jul, 2019 11:34 IST|Sakshi
ఇసుక తరలిస్తున్న లారీలు

జిల్లాలో ఇసుకకు పెరిగిన డిమాండ్‌

ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు

జిల్లాలో ఇసుక 2 నెలలు మాత్రమే వస్తుందని అంచనా

గోదావరి జిల్లాల నుంచి తరలించేందుకు సన్నాహాలు

సాక్షి, అమరావతి: ఇసుక కావాలంటూ జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. భవనాలు, అపార్ట్‌మెంట్లు, ఇతర నిర్మాణాలకు ఇసుక ఇవ్వాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఇసుక కేటాయింపులు చేస్తున్నారు.  నిర్మాణ రంగానికి సంబంధించి డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరిస్తున్నారు.  మరో వైపు జిల్లాలోని రీచ్‌లలో ఇసుక మరో రెండు నెలలకు మించి వచ్చే అవకాశం లేకపోవడంతో గోదావరి జిల్లాల నుంచి ఇసుక తెప్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొందరు అక్రమార్కులు మాత్రం అధికారుల కళ్లుగప్పి ఇసుక తరలించుకుపోతున్నారు. 

జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తీర్పుతో మూడు నెలలుగా జిల్లాలోని ఇసుక క్వారీలు మూత పడ్డాయి. ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ అమలులోకి తెచ్చే వరకు ఇసుక పంపిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పజెప్పింది. వారం రోజుల నుంచి జిల్లాలో ఇసుక కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇసుక కోసం పెద్ద ఎత్తున గృహ నిర్మాణ లబ్ధిదారులు, ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు వారి నుంచి తమకు ఇసుక కావాలని పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి.

జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు, పర్యావరణ అనుమతులు కేవలం కొల్లిపర, కొల్లూరులోని రెండు మండలాల్లో ఐదు ఇసుక రీచ్‌లకు మాత్రమే వచ్చాయి. అక్కడ కేవలం 2,00,847 క్యూబిక్‌ ఇసుక నిల్వలు మాత్రమే గుర్తించారు. వారంలోపే 2 వేల మంది 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో  20 వేల ట్రాక్టర్లకు సంబంధించి లక్ష క్యూబిక్‌ మీటర్ల ఇసుకను కేటాయించారు. ఈ ఇసుక కేటాయింపులు ప్రాధాన్యత క్రమంలో కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇసుక కొరత దృష్ట్యా వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే, జిల్లాలో 5 రీచ్‌లలో ఉన్న ఇసుక నిల్వలు రెండు నెలలలోపు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇసుక కొరతను అధిగమించేందుకు..
జిల్లాలో ఇసుక నిల్వలు తగినంత లేనందున కొత్త పాలసీ వచ్చేలోపు ఇసుక కొరతను అధిగమించేందుకు వీలుగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఎంత మేర ఇసుక అవసరం ఉంటుందో ఆ మేరకు.. ఇసుకను గోదావరి జిల్లాల నుంచి తరలించి మంగళగిరి, తాడేపల్లిలో స్టాక్‌ పాయింట్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వ స్థలాలు గుర్తించేందుకుగాను సంబంధిత తహసీల్దార్లతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.  

అగని అక్రమ దందా
ఇసుక అక్రమ రవాణా కట్టడికి అధికారులు చర్యలు తీసుకొన్నామని చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో దందా ఆగటం లేదు. స్థానికంగా ఇసుక క్వారీలు ఉన్న ప్రాంతంలోని అధికారులు ఇసుక తరలింపునకు ఎటువంటి అనుమతి తీసకోకుండానే తెనాలి, చెరుకుపల్లి, రేపల్లె ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొంత మంది బిల్టర్లు అవసరానికి మించి ఎక్కువ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఇసుకను గుంటూరుకు తరలించి అక్కడ నుంచి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి వేలాది రూపాయలు దండుకొంటున్నారు.

ఇసుక ట్రాక్టర్ల ద్వారానే తరలించాలని నిబంధన ఉంది. అయితే కొంత మంది క్వారీల సమీపం నుంచి నేరుగా కృష్ణా జిల్లా పర్మిట్‌లను అడ్డుపెట్టుకొని ఇసుక తరలిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యహరిస్తున్నారు. అధికారుల అనుమతితో తీసుకున్న ఇసుక నిర్మాణాలు చేపట్టే ప్రాంతంలో ఉండాలి. ప్రభుత్వం ట్రాక్టరు ఇసుక రూ.330కు అందిస్తోంది. అయితే కొంత మంది అక్కమార్కులు ఇసుక లారీ రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. దీంతోపాటు అచ్చంపేట నుంచి క్రోసూరు, రాజుపాలెం, పిడుగురాళ్ల మీదుగా ఇసుకను అధికారుల కళ్లు గప్పి తరలిస్తున్నారు. 

జిల్లాలో ప్రస్తుతం గుర్తించిన ఇసుక రీచ్‌లు  

  • పాత బొమ్మువానిపాలెం రీచ్‌లో 4,853 హెక్టార్లలో 48,530 క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉన్నట్లు అంచనా వేశారు.
  • కొల్లూరు మండలం గాజులంక–1 రీచ్‌లో 3,340 హెక్టార్ల విస్తీర్ణలో 33,399 క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉన్నట్లు గుర్తించారు.
  • కొల్లూరు మండలం ఈపూరు రీచ్‌లో 4,985 ఎకరాల్లో 48,530 క్యూబిక్‌ మీటర్ల ఇసుక  ఉన్నట్లు అంచనా వేశారు
  • కొల్లిపర మండలం పిడపర్తివారిపాలెం, బొమ్మువానిపాలెం గ్రామాల పరిధిలోని రీచ్‌లో, 3,340 హెక్టార్లలో 36,989 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను గుర్తించారు.
  • కొల్లిపర మండలం అత్తలూరిపాలెం–1, అత్తలూరిపాలెం రీచ్‌లో 3,700 హెక్టార్లలో 36,989 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను ఉన్నట్లు గుర్తించారు.  
మరిన్ని వార్తలు