గోరంత అనుమతి... కొండంత తవ్వకాలు

9 Mar, 2019 08:52 IST|Sakshi
కోరుమిల్లి – కపిలేశ్వపురంలో ఇసుక తవ్వకాలు

జిరాయితీ పేరుతో దోపిడీ పర్వం

వ్యవసాయ యోగ్యం కోసమంటూ అనుమతులు

అడ్డుగోలుగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు

గోరంత అనుమతి... కొండంత తవ్వకాలు

‘గోదావరి వరదల వల్ల మా పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వ్యవసాయం చేసుకునే అవకాశం లేదు. కుటుంబం రోడ్డున పడుతోంది. ఇసుక తవ్వకాలకు మీరు అనుమతిస్తే మా పొలాలను వ్యవసాయ యోగ్యంగా మార్చుకుంటాము’ ఇదీ గోదావరి లంకలకు చెందిన కొంతమంది రైతులు రెవెన్యూ అధికారులకు చేసిన విన్నపం. దీనికి టీడీపీ పెద్దల సిఫార్సులు కూడా ఉండడంతో అధికారులు ఆగమేఘాలపై అనుమతులు మంజూరు చేశారు. ఇదే అదనుగా అధికార పార్టీ నాయకులు రంగప్రవేశం చేసి నిబంధనలకు విరుద్ధంగా.. అనుమతులకు రెట్టింపు ఇసుక తవ్వకాలు చేస్తూ లంక గ్రామాలను లూటీ చేస్తున్నారు. రోజుల్లో పూర్తికావాల్సిన తవ్వకాల పరిమితి నెలలు దాటుతున్నా నిరాటంకంగా సాగుతోంది.

తూర్పుగోదావరి, అమలాపురం: జిల్లాలో కపిలేశ్వరపురం, సీతానగరం మండలాల్లో జిరాయితీ భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చుకునేందుకు అంటూ అనుమతులు పొంది ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. గతంలో పి.గన్నవరం మండలంలో సైతం ఏళ్ల తరబడి ఇసుక తవ్వకాలు సాగడం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి – కపిలేశ్వరపురం గ్రామాల మధ్య ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గోదావరి చెంతనే ఉన్న జిరాయితీ భూముల్లో వరదల కారణంగా ఇసుక మేటలు వేశాయని, సాగుకు ఆటంకంగా మారిన వీటిని తొలగించేందుకంటూ అనుమతులు పొందారు. వీటిని అడ్డం పెట్టుకుని 2017 జూలై నుంచి నేటి వరకు ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇక్కడ 16.16 ఎకరాలలో 1,50,419 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇందుకు 100 రెట్లకు పైగా తవ్వకాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. జిల్లాలో ప్రధాన ఇసుక ర్యాంపులు మూతపడినా ఇక్కడ తవ్వకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఎక్కడా ఇసుక దొరకకపోవడంతో ఇక్కడ దొరికే ఇసుకను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. 2017 జూలై 10న వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుపుతున్న చోట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయినా ఏడాదిన్నర కాలంగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.

సీతానగరం మండలం కాటవరం, రఘుదేవపురం, మునికూడలి ర్యాంపుల్లో రైతుల పేరు మీద అనుమతులు పొంది ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. రఘుదేవపురంలో ఐదు నెలలు నుంచి ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. కాటవరం ర్యాంపులో 2015 నుంచి తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడ పంపింగ్‌ స్కీమ్‌ వద్ద ఇసుక మేటల తొలగింపు పేరుతో రెండేళ్లు, వ్యవసాయ భూములుగా మార్చుకునేందుకు అంటూ మరో రెండేళ్ల నుంచి తవ్వకాలు సాగిస్తున్నారు. మునికూడలిలో సైతం ఐదు నెలల నుంచి రైతుల జిరాయితీ భూముల్లో వ్యవసాయ యోగ్యం పేరుతో తవ్వకాలు సాగిస్తున్నారు. ఇదే మండలంలో వంగలపూడిలో ఒక ప్రైవేట్‌ ర్యాంపును నిర్వహిస్తుండడం గమనార్హం. ట్రాక్టరు మీద ఒక స్టాక్‌ పాయింట్‌కు ఇసుక తరలించి, అక్కడ అమ్మకాలు కొనసాగిస్తున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు.

గతంలో పి.గన్నవరం మండలం ఎల్‌.గన్నవరం గ్రామంలోని 17.76 ఎకరాల జిరాయితీ భూముల్లో ప్రభుత్వం నుంచి 2015లో ఇదే విధంగా అనుమతి పొంది ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు చేశారు. చినబాబుతోపాటు ఒక మంత్రి బంధువు, విజయవాడ, హైదరాబాద్‌కు చెందిన బడా వ్యక్తుల కనుసన్నల్లో ఈ దోపిడీ యథేచ్ఛగా సాగింది. స్థానికంగా ఇసుక దిబ్బలు లేకపోవడంతో ఏకంగా డ్రెడ్జెర్లతో ఇసుకను తోడేసి లంకలను గుల్ల చేశారు. ఇక్కడ 2,44,277 క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక తవ్వకాలకు అనుమతి పొంది అందుకు వందరెట్లు అదనంగా తవ్వకాలు చేశారు. మూడేళ్లపాటు సాగిన ఈ తవ్వకాలు 2018 జనవరిలో నిలుపుదల చేశారు. సమీపంలోని నడిగాడిలో నది ఒడ్డున ఉన్న స్టాక్‌ పాయింట్లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక అమ్మకాలకు అనుమతి పొంది ఏళ్లపాటు అక్రమంగా రవాణా చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా