తోడే స్తున్నారు!

10 Jan, 2014 02:04 IST|Sakshi

మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ :  మంచిర్యాల మండలం గోదావరి నది నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. గుడిపేట వద్ద నిర్మిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ భాగం లో ఉన్న గోదావరి నుంచి రోజూ వంద ల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ఈ ఇసుకను గోదావరి సమీపంలోని పంటపొలాలు, ఖాళీస్థలాల్లో డంప్ చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువ భాగాన ఇసుక తోడటంతో ఇప్పటికే 20 మీటర్లకుపైగా గుంతలు ఏర్పడ్డాయి.

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు, విద్యుత్ టవర్లకు సమీపంలోనే భారీగా గుంతలు ఏర్పడటంతో భవిష్యత్తులో వాటికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పదిహేను రోజులుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా రెవెన్యూ, భూగర్భశాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలా లు అడుగంటి పోయే ప్రమాదం ఉండగా, సమీపంలోని పంటపొలాల్లోకి దుమ్ము చేరి పంటలు పాడవుతున్నాయి. దిగుబడి తగ్గుతోంది. ట్రా క్టర్లు, లారీల రాకపోకలతో రహదారులు గుంతలుగా మారి పూర్తిగా పాడయ్యాయి. దుమ్ముతో పల్లెవాసులు అవస్థలు పడుతున్నారు.

 ముంపు గ్రామస్తుల కనుసన్నల్లో..
 ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గుడిపేట, నంనూరు, రాపల్లి, చందనాపూర్ గ్రామాలకు చెందిన పలువురు ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా మారి ఈ అక్రమ ఇసుక రవాణాకు తెరలేపారు. వారి గ్రామాలు ముంపులో పోతున్నందున వారికి కేటాయించిన పునరావాస కాలనీల్లో ఇసుక తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులకు పలుమార్లు విన్నవించారు. దీంతో ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను నిర్వాసితులు గోదావరి నుంచి తీసుకోవచ్చని అధికారులు సూచన ప్రాయంగా తెలిపారు. దీన్ని అడ్డుపెట్టుకుని ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు.

ముంపు పరిహారం రూ. లక్షలు నిర్వాసితుల దగ్గర ఉండడంతో, గ్రామంలో చాలామంది ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. అప్పటి వరకు గ్రామంలో కేవలం పదుల సంఖ్యలో ఉన్న ట్రాక్టర్లు కొద్దిరోజుల్లోనే వందల సంఖ్యకు చేరాయి. పునరావాస కాలనీల్లోని ప్లాట్లలో ఇసుకను పోస్టూ అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు అన్ని గ్రామాల ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా మారి అధికారులకు ఇవ్వాల్సిన ముడుపులు అందించి గోదావరిలో ఇష్టారీతిన తవ్వకాలు చేస్తున్నారు. వీరికి మంచిర్యాలకు చెందిన ఇసుక మాఫియా తోడవడంతో నిల్వ చేసిన ఇసుకను లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.

 రాత్రివేళల్లో హైదరాబాద్‌కు తరలింపు
 రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను గోదావరి సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ కేంద్రాలకు తరలిస్తుం టారు. గుడిపేటలో డంపింగ్ కేంద్రాలు వందకు పైగా ఉన్నాయంటే రోజూ ఎంత ఇసుకను తవ్వుతున్నారో అర్థమవుతుంది. మరికొందరు గుడిపేట వద్ద గల పునరావాస కాలనీలో ఇసుకను నిల్వ చేస్తున్నారు. రాత్రివేళల్లో వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్ల ద్వారా డంప్ చేసిన ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇందుకు ఆయా ట్రాక్టర్ యజమానులకు ఒక్కో లారీలోడుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తున్నారు. ఇదే ఇసుకను హైదరాబాద్‌కు తరలించి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముకుంటున్నారు. గోదావరి నది ఇసుకకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అక్రమార్కులు ఇసుకను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.

 ప్రాజెక్టుకు, విద్యుత్ టవర్లకు పొంచి ఉన్న ముప్పు
 గుడిపేట వద్ద నిర్మిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సమీపంలో కేవలం 15 రోజుల్లోనే 20 మీటర్ల మేర ఇసుకను తవ్విన అక్రమార్కులు, మరో నెలరోజులు ఇలాగే ఇసుకను తవ్వేస్తే ప్రాజెక్టు మనుగడకే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు రెండుసార్లు గోదావరిలో వేసిన విద్యుత్ టవర్లు నీటిలో కొట్టుకుపోయాయి. తూర్పు జిల్లాకు అందించే విద్యుత్ టవర్లు కూలిపోవడంతో రెండు నెలలపాటు తూర్పు జిల్లా వాసులు చీకట్లోనే గడిపారు. ప్రస్తుతం అవే టవర్ల సమీపంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో విద్యుత్ టవర్లు మరోసారి కూలే ప్రమాదం లేకపోలేదు. వచ్చే వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగితే ప్రాజెక్టుతో పాటు, విద్యుత్ టవర్లకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు