లంకల్లో ఇసుకాసురులు

3 Nov, 2018 13:10 IST|Sakshi
మీటరుకు పైగా లోతు పెట్టి పొక్లయినర్‌తో ఇసుక తవ్వకం

సాక్షి, అమరావతి బ్యూరో/ కొల్లూరు: జిల్లాకు చెందిన ఓ మంత్రి కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతోంది. ప్రైవేటు భూముల్లో పర్మిట్‌లు తీసుకొని అధికార పార్టీ నేతలు భారీ దోపిడీకి ల్పడుతున్నారు. హైవేకు ఇసుక సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకొని భారీ యంత్రాలతో తరలిస్తున్నారు. ఇందులో మంత్రికి 40 శాతం వాటా ఉన్నట్లు ఆ ప్రాంత ప్రజల్లో చర్చ సాగుతోంది.

ఇదీ దోపిడీ తంతు
తాత్కాలిక పర్మిట్ల రూపంలో రైతుల పొలాల్లో ఇసుక మేటలు తొలగించే నెపంతో ఇసుక తవ్వకాలకు రైతుల పేర్లతో అనుమతులు పొందిన బినామీలు ఏకంగా నదిలో పాగా వేసి ఇసుకను కొల్లగొడుతున్నారు. ఉచిత ఇసుక నిబంధనలను అతిక్రమించి యూనిట్‌ ఇసుకకు రూ. 600 చొప్పున వసూలు చేస్తున్నారు.  నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈపూరు క్వారీలో రోజుకు సుమారు 100 లారీలు, 50 ట్రాక్టర్లలో ఇసుక తరలుతోంది.  కొల్లూరు మండలంలో గతంలో ఇదే తరహాలో ఆరు క్వారీలలో బినామీలు ఇసుకను కొల్లగొట్టారు. పంట భూమిలో పూడిక పేరుతో అనుమతులు తీసుకొచ్చి నదీ గర్భాన్ని కుళ్ల బొడుస్తున్నారు. తవ్వకాలు చేపట్టిన భూమిలో ఇప్పటి వరకూ ఎక్కడా సాగు చేపట్టిన దాఖలాలు లేవు.

ప్రస్తుతం మండలంలోని ఈపూరుకు చెందిన రైతు రావి హర్‌నాథ్‌బాబు సర్వే నంబర్‌ 357/1లో దశాబ్దాల క్రితం నదిలో కలిసిపోయిన 2.95 ఎకరాలలో పూడికతీత పేరుతో అనుమతులు తీసుకున్నారు. రెండు నెలల్లో మీటరు లోతున 4, 573 క్యూబిక్‌ మీటర్లు పూడిక తీసుకోవా లనే నిబంధన ఉంది. కానీ ఈపూరు క్వారీ నిర్వాహకులు మాత్రం హద్దులు లేకుండానే రెండు మీటర్ల లోతుకుపైగా యంత్రాల సాయంతో తవ్వేసి చిలుమూరు మీదుగా అక్రమ రవాణాకు పాల్ప డుతున్నారు. రోజుకు 100 లారీలు, 50కుపైగా ట్రాక్టర్లతో ఇసుక తరలిపోతోంది. సుమారు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు దోచుకుంటున్నారు. 

జువ్వలపాలెంలో..  
కొల్లూరు మండలం జువ్వలపాలెం, పెర్లంక, గాజుల్లంక ప్రాంతాల్లో ఒక్కొక్క ట్రాక్టర్‌ నుంచి రూ.100–రూ.150 అనధికారికంగా వసూలు చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తుతో జోగుతున్నారని తెలిసింది. అధికార పార్టీ నేత ఐదు ట్రాక్టర్లతో ఇసుకు అక్రమ రవాణా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ట్రాక్టర్‌ ఇసుక రూ.2500లకు అమ్ముతున్నారు.

రైతాంగాన్ని ఆదుకోవాలి...
నిబంధనలకు విరుద్ధంగా చిలుమూరు, ఈపూరులంక, పెదలంక, జువ్వలపాలెం గ్రామాల పరిధిలో ఇసుక రవాణా చేస్తున్నారు. ప్రైవేటు భూముల్లో పర్మిట్‌లు తీసుకొన్నామని, భారీ యంత్రాలతో గోతులు పెడుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారిపోతున్నాయి. రైతులు వ్యవసాయం చేసుకొనేందుకు వీలు కావటం లేదు. వెంటనే ఇసుక పర్మిట్‌లు రద్దు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. లేకపోతే రైతులతో కలిసి గుంటూరులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.– మేరుగ నాగార్జున,వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు

మరిన్ని వార్తలు