సిండి‘కేట్ల’కు బ్రేక్

17 Oct, 2014 03:37 IST|Sakshi
సిండి‘కేట్ల’కు బ్రేక్

ఇసుక రవాణా టెండర్లు రద్దు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఇసుక అమ్మకాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సుదీర్ఘ విరామం తర్వాత అధికారికంగా ఇసుక అమ్మకాలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలోని 71 ఇసుక రీచ్‌లను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి ద్వారా ఇసుకను డంపింగ్ యార్డుల నుంచి వినియోగదారులకు రవాణా చేసేందుకు కాంట్రాక్ట్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా రవాణా కాంట్రాక్టర్లకు సంబంధించి బుధవారం టెండర్లు పిలిచారు. అందుకు పెద్ద సంఖ్యలో టెండర్లకు షెడ్యూల్డ్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు వేసిన షెడ్యూల్డ్ ధరలకు భారీ తేడాలు ఉండడంతో టెండర్లను రద్దు చేయాలని అధికారులు భావించారు. ఆ మేరకు అధికారులు గురువారం రాత్రి ఒక ప్రకటనను విడుదల చేశారు.
 
ప్రభుత్వ ఆదాయానికి సిండికేట్ల తూట్లు : ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఇసుక రవాణాను అధికారికంగా కట్టబెట్టాలని నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని కొందరు నాయకులు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి జేబులు నింపుకోవాలని ఎత్తు వేశారు. ఇసుక రీచ్‌ల నుంచి డంపింగ్‌యార్డులకు ఇసుకును తరలించేందుకు ఎవరు తక్కువ మొత్తానికి కోడ్ చేస్తారో వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అధికారులు కిలో మీటర్ రూ.20 పైన ఇవ్వాలని భావించారు. అయితే కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి కిలో మీటరు అతి తక్కువగా రూ.4 నుంచి రూ.5 నిర్ణయించుకుని టెండర్లు దాఖలు చేశారు. ఇంత తక్కువ మొత్తంలో కోడ్ చేయడంలో ఏదో మతలబు ఉందన్న విషయాన్ని పసిగట్టిన ప్రభుత్వ ఉన్నతాధికారులు  ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుందని భావించి టెండర్లు రద్దు చేశారు.

మరిన్ని వార్తలు