ఎర్రచందనం దుంగలు.. ‘హెరిటేజ్‌’ దొంగలు

5 Jul, 2017 02:03 IST|Sakshi
ఎర్రచందనం దుంగలు.. ‘హెరిటేజ్‌’ దొంగలు
టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి
- గాల్లోకి కాల్పులు.. స్మగ్లర్లు పరార్‌..71 దుంగలు స్వాధీనం
ఇది టీడీపీ నేతల పనేనని అనుమానాలు
స్మగ్లర్ల జాబితాలో పలువురు అధికార పక్ష నేతలు
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, అమరావతి: హెరిటేజ్‌ పాల వ్యాన్‌లో తరలివెళ్తున్న ఎర్రచందనం దుంగలు మంగళవారం చిత్తూరు జిల్లాలో పోలీసులకు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ డెయిరీ వాహనంలో ఎర్రచందనం కనిపించగానే పోలీసులు విస్మయానికి గురయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ఆయన కంపెనీకి చెందిన వాహనంలో దుంగలను తరలిస్తున్నారంటే స్మగ్లర్ల అవతారమెత్తిన టీడీపీ నేతలు ఎంతగా బరితెగించారో ఇట్టే అర్థమైపోతోంది. పోలీసులపై రాళ్లు రువ్వి.. దాడులకు తెగబడ్డారంటే అషామాషీ వ్యవహారం కాదని, అధికారం అండ చూసుకునే ఇంతగా చెలరేగిపోయారని స్పష్టమవుతోంది. గతంలోనూ ఇదే రీతిలో పలు ఘటనలు చోటుచేసుకున్నా, పాలకులకు జడిసి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే టీడీపీ నేతలు పేట్రేగిపోయారని బట్టబయలైంది. ముఖ్యనేత అండ ఉంటే తప్ప ఈ రీతిలో స్మగ్గింగ్‌కు సాహసించరని అటవీ, పోలీసు శాఖలకు చెందిన పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు స్వగ్రామం నారా వారి పల్లె వద్ద భారీ ఎర్రచందనం డంప్‌ బయట పడటం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలు ప్రత్యక్షంగా పట్టుపడటం.. తదితర ఘటనలు వరుసగా చోటుచేసుకున్నా కంటితుడుపు చర్యలు మినహా అసలు నిందితులను ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులను ఏమార్చి ఎర్రచందనం దుంగలను సరిహద్దులు దాటించడానికి సులువైన మార్గంగా హెరిటేజ్‌ వాహనాలను ఉపయోగించుకుంటున్నారని తేటతెల్లమైంది.  
 
ఇది ఎర్ర స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ
టాస్క్‌ఫోర్సు ఐజీ కాంతారావు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరిస్తూ ఇది కొత్త ఎత్తుగడగా పేర్కొన్నారు. ‘మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌ఎస్‌ఐ విజయ నరసింహ బృందం కూంబింగ్‌ ముగించుకుని తిరుగు ముఖం పట్టింది. అదే సమయంలో వీరికి ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కచ్చితమైన సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు అటుగా అడుగులు వేశారు. తిరుపతి బీడీకాలనీ మీదుగా మొండోడికోన అడవుల్లోకి ప్రవేశించగానే సుమారు వంద మందికి పైగా ఎర్ర చందనం దొంగలు భుజాలపై దుంగలతో ఎదురు పడ్డారు. అకస్మాత్తుగా పోలీసులు ఎదురు పడటంతో ఏం చేయాలో తోచని స్మగ్లర్లు కొండరాళ్లతో పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

భీతిల్లిపోయిన స్మగ్లర్లు దుంగలను కింద పడేసి అడవిలోకి పరారయ్యారు. అరగంట తర్వాత సంఘటనా స్థలిలో పోలీసులు 63 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఓ నాటు తుపాకీ కూడా లభ్యమైంది. అక్కడికి కొద్ది దూరంలో ఆగి ఉన్న హెరిటేజ్‌ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‌లో ఉన్న మరో 8 దుంగలను, వ్యాన్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. సుమారు రెండున్నర టన్నుల బరువున్న ఎర్రచందనం విలువ రూ.80 లక్షలకు పైనే ఉంటుంద’ని ఆయన వివరించారు. పట్టుబడిన వాహనంపై టీఎన్‌ 18ఎం8996 నంబరు ఉంది. దానిపై పెయింట్‌ వేసి, స్మగ్లర్లు.. ఏపీ 26 టీసీ4187 నంబరు రాశారు. ఈ వాహనం నెల్లూరుకు చెందిన ఒర్సాల ముస్తాక్‌ అహ్మద్‌ అనే వ్యక్తి పేరుపై రిజిస్టర్‌ అయినట్లు ఆర్టీఓ వెబ్‌సైట్‌ తెలియజేస్తోంది. దీనిని అతను ఏడు నెలల క్రితం కలికిరికి చెందిన మహేశ్‌ అనే వ్యక్తికి అమ్మాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
సమాధానం లేని ప్రశ్నలెన్నో..
► సీఎం సొంత జిల్లాలో ఆయన అండ లేకుండా ఆయన కంపెనీ వాహనాన్ని ఎవరు ఉపయోగిస్తారు?
► హెరిటేజ్‌ వాహనంలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది?
► వంద మంది దాడికొస్తే పోలీసులు ఒక్కరిని కూడా పట్టుకోలేక పోయారా?
► గతంలో నారావారి పల్లె వద్ద డంప్‌ దొరికింది నిజం కాదా? అందులో టీడీపీ నేతల ప్రమేయం లేదా?
► గతంలోనూ దుంగలను తరలిస్తూ హెరిటేజ్‌ వాహనం పట్టుపడలేదా?
► ఎర్రచందనం స్మగ్లర్లతో ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం నిజం కాదా?
► ఎర్ర స్మగ్లర్లకు సీఎంతో సంబంధాలున్నాయంటూ గతంలో ఆరోపణలు వచ్చింది వాస్తవం కాదా?
► పట్టుబడిన టీడీపీ నేతలపై ఇప్పటి దాకా ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
మరిన్ని వార్తలు