సివిల్స్‌లో కర్నూలు తేజం

13 Jun, 2014 02:56 IST|Sakshi
సివిల్స్‌లో కర్నూలు తేజం

 యూపీఎస్సీ ఫలితాల్లో 786వ ర్యాంక్ సాధించిన సందీప్ చక్రవర్తి
 
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరానికి చెందిన వైద్య విద్యార్థి సివిల్స్‌లో మెరిశాడు. గురువారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 786వ ర్యాంకు సాధించాడు. ఎస్సీ కేటరిగీలో ఇతనికి ఐపీఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు నగరం సి.క్యాంపు సెంటర్‌లో ప్రభుత్వ క్వార్టర్‌లో నివాసముంటున్న డాక్టర్ జీవీ రాంగోపాల్ కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో సీఎస్‌ఆర్‌ఎంవోగా పనిచేసి పదవీ విరమణ పొందారు.
 
ఆయన భార్య పీసీ రంగమ్మ ప్రస్తుతం ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో హెల్త్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. విద్యావంతులైన ఈ దంపతులు తమ పిల్లలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించారు. కన్నవారి ఆశయాల మేరకు పెద్ద కుమారుడు జీవీ ప్రమోద్ చక్రవర్తి ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసి ప్రస్తుతం ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాడు. కుమార్తె జీవీ సౌజన్య ఏజీ ఎంఎస్సీ పూర్తి చేశారు. చిన్నకుమారుడు సందీప్ చక్రవర్తి ప్రస్తుతం సివిల్స్‌లో 786వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు మార్గం సుగమం చేసుకున్నాడు.
 
పాఠశాల నుంచే ప్రతిభ చాటిన సందీప్ చక్రవర్తి
గజ్జల వెంకట సందీప్ చక్రవర్తి స్థానిక ఎ.క్యాంపులోని మాంటిస్సోరి హైస్కూల్‌లో ఒకటి నుంచి పదో తరగతి వరకు అభ్యసించాడు. 2003లో ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 555 మార్కులు సాధించి ఆ యేడాది రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిభ అవార్డు కైవసం చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియట్ బైపీసీలో చేరి 940 మార్కులు సాధించాడు. అదే సంవత్సరం ఎంసెట్‌లో మెడికల్ విభాగంలో 1600 ర్యాంకుతో కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్(2005 బ్యాచ్) సీటు దక్కించుకున్నాడు.
 
డాక్టర్‌గా కేవలం కొద్ది మందికే సేవ చేయగలుగుతావని, సివిల్స్ సాధిస్తే నీ సేవలను విస్తృతం చేయవచ్చని కుమారునికి తండ్రి సూచించాడు. దీంతో సందీప్ చక్రవర్తి తండ్రి కోరికను నెరవేర్చేందుకు హౌస్‌సర్జన్ దశ నుంచే కష్టపడ్డాడు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక హైదరాబాద్ వెళ్లి సివిల్స్‌కు కోచింగ్ తీసుకున్నాడు. గత యేడాది ఇంటర్వ్యూ దాకా వెళ్లి 20 మార్కుల తేడాతో విఫలమయ్యాడు. అయినా మొక్కవోని పట్టుదలతో చదివి ప్రస్తుతం ఎస్సీ కేటగిరిలో 786వ ర్యాంకు సాధించాడు.
 
అమ్మా నాన్నల ప్రోత్సాహంతోనే..
పాఠశాల విద్య నుంచే అమ్మా నాన్నలు నన్ను బాగా ప్రోత్సహించేవారు. వైద్య విద్యను చదువుతున్నప్పుడు నాన్న సివిల్స్‌పై దృష్టి పెట్టాలని చెప్పారు. ఆయన సూచన మేరకు అహర్నిశలు కష్టపడ్డాను. హైదరాబాద్‌లో ఓ రూంలో ఉంటూ ప్రతి రోజూ 10 నుంచి 12 గంటల పాటు చదివాను. రోజూ నాలుగు ఇంగ్లిష్ పేపర్లతో పాటు తెలుగు పేపర్లనూ పూర్తిగా చదివే వాన్ని. మొదటిసారి ఇంటర్వ్యూ దాకా వెళ్లి ఫెయిలైన తర్వాత నాలో ఇంకా కసి పెరిగింది. మొదటిసారి లోపం ఎక్కడుందో తెలుసుకుని రెండోసారి మరింత పట్టుదలతో కష్టపడి ఫలితం సాధించాను. ఈ విజయం పూర్తిగా నా కుటుంబ సభ్యులకే అంకితం.

మరిన్ని వార్తలు