కార్పొరేట్‌ విద్యా సంస్థలను జాతీయం చేయాలి

30 Oct, 2017 01:34 IST|Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రముఖ విద్యావేత్త, రామన్‌ మెగసెసె  అవార్డు గ్రహీత సందీప్‌ పాండే

సాక్షి, అమరావతి బ్యూరో : ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెద్దలు, కార్పొరేట్‌ విద్యా సంస్థల మధ్యనున్న అనైతిక, అవినీతి బంధం విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోంది. అనారోగ్యకరమైన పోటీ, అనవసరమైన ఒత్తిడి వల్లే విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయి..’ అని ప్రముఖ విద్యావేత్త, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత సందీప్‌ పాండే తీవ్రంగా విమర్శించారు. జాతీయ విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించే కార్పొరేట్‌ విద్యాసంస్థలను జాతీయం చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని ఆయన సూచించారు. ఓ సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన సందీప్‌ పాండే ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. 

సాక్షి : తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్లలో దాదాపు 450మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? 
సందీప్‌ పాండే : కార్పొరేట్‌ విద్యా విధానంతో దేశ విద్యా వ్యవస్థలో విపరీత పోకడలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మరీ అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నారాయణ, చైతన్య అనే రెండు పెద్ద విద్యా సంస్థలు ప్రభుత్వ వ్యవస్థలను నియంత్రిస్తూ ఈ విష సంస్కృతిని పెంచిపోషిస్తున్నాయి. అనారోగ్యకర పోటీని పెంచుతూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి.
సాక్షి : పాలకులు, కార్పొరేట్‌ విద్యా సంస్థల బంధం విద్యా రంగంలో సంస్కరణకు అవరోధంగా మారుతోందా? 
పాండే : కచ్చితంగా. ప్రధానంగా ఏపీలో.. పాలకులు, కార్పొరేట్‌ విద్యా సంస్థల అవినీతి, అనైతిక బంధం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోంది. ఇక్కడ కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఏవీ కూడా పార్లమెంట్‌ ఆమోదించిన విద్యా హక్కు చట్టాన్ని ఏమాత్రం గౌరవించడంలేదు. 
సాక్షి : విద్యా రంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలని మీరు సూచిస్తారు? 
పాండే : దేశంలో సార్వత్రిక విద్యా విధానం ఉండాలి. విద్యా సంస్థలను ప్రభుత్వమే నిర్వహించాలి. 

మరిన్ని వార్తలు