ముదిరిన వివాదం

20 Feb, 2016 00:28 IST|Sakshi

* సంధ్యారాణి వర్సెస్ భంజ్‌దేవ్
* కేంద్రమంత్రి అశోక్ వద్దకు చేరిన పంచాయితీ

సాక్షి ప్రతినిధి, విజయనగరం: నాయకుల మధ్య వైరం ముదిరిపోతుంటే వారిని అంటిపెట్టుకున్న కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.  శాసన మండలి సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, సాలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌పి భంజ్‌దేవ్‌ల మధ్య ఆధిపత్య పోరు మరోమారు తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ నాయకుల మధ్యే చాపకింద నీరులా ఉన్న వైరం ఈ సారి ఆయా వర్గాల వారీగా పోట్లాడుకు నేంతవరకు పాకింది.   శాసన మండలి సభ్యురాలిగా పదవి ఉన్న తనను కాదని కొన్ని కార్యక్రమాలు, సభలకు భంజ్‌దేవ్ అన్నీతానై  ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, సంధ్యారాణి తీవ్రంగా మండిపడుతున్నారు.
 
పోస్టులు, నియామకాలు పక్క మండలానికి
పాచిపెంట మండలానికి చెందిన పలు పదవులు, పోస్టులను సాలూరు మండలానికి చెందిన వారికి కట్టబెడుతున్నారని సంధ్యారాణి వర్గం అరోపిస్తోంది. పాచిపెంట మండలానికి చెందిన పారమ్మకొండ ఆలయ కమిటీ నియామకంలో స్థానిక మండల నాయకులకు కాకుండా సాలూరు మండల నాయకులకు కట్టబెట్టారన్నది సంధ్యారాణి వాదన. అలాగే  ఇక్కడి విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ఉండే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులను కూడా సాలూరు మండలానికే కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. మరో పక్క పాచిపెంట మండలంలోని పెద్ద గెడ్డ జలాశయం సాగునీటి సంఘం ఎన్నికలో కూడా సాలూరు ప్రాంత వాసులకే ప్రాధాన్యం ఇచ్చి ఏర్పాటు చేశారని సంధ్యారాణి వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్సీని కాదని భంజ్‌దేవ్ అన్నీ తానే అయి ప్రొటోకాల్‌ను కూడా విస్మరించి ప్రారంభోత్సవాలు, సభలకు హాజరవుతున్నారని సంధ్యారాణి వర్గం వాపోతోంది.
 
కష్టానికి లేని గుర్తింపు
జిల్లాలో పార్టీ ముఖ్యనాయకులు  ఎవరు వచ్చినా సంధ్యారాణి సమాచారం ఇవ్వడం లేదని భంజ్‌దేవ్ వర్గంలోని పలువురు సాలూరు మండల నాయకులు  చెబుతున్నారు. ఎంతో కష్టపడి మున్సిపాలిటీని సాధించుకుంటే ఏదైనా చిన్న కార్యక్రమం జరుగుతున్నా ఆమె వచ్చి హల్‌చల్ చేస్తుండడంతో తమ కష్టానికి తగిన గుర్తింపు ఉండడం లేదని మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త గొర్లె మాధవ రావు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ఒకరి రూట్ మరొకరు తెలుసుకుంటూ ఆయా వర్గాల ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు.   
 
పార్టీని వీడిపోవాలా?
సాలూరులో వర్గపోరు తీవ్రమవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహం చెందుతున్నారు. నాయకుల మధ్య వైరం తమ పీకలమీదకి వచ్చిందనీ ఇలాగే కొనసాగితే పార్టీని వదిలి వెళ్లిపోవడం ఖాయమని కార్యకర్తలు, నాయకులు ఇద్దరినీ హెచ్చరించినట్టు తెలిసింది.  
 
అశోక్ బంగ్లాకు భంజ్‌దేవ్ వర్గం  
సాలూరు నియోజకవర్గానికి సంధ్యారాణి వర్గం వల్ల ఇబ్బందులు తప్పవని  ఫిర్యాదు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ వర్గంలోని నాయకులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పాచిపెంట మండల పార్టీ అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు గొర్లె మాధవరావు, మెంటాడ మండల పార్టీ ఉపాధ్యక్షుడు జలుమూరి వెంకట రమణ, సాలూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతి, మక్కువ మండలం జెడ్పీటీసీ భర్త తిరుపతి  తదితరులు  కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాకు వెళ్లి శుక్రవారం సాయంత్రం వెళ్లారు. ఆయనను కలిసి సంధ్యారాణిపై ఫిర్యాదు చేశారు.
 
ఇద్దర్నీ గట్టిగా నిలదీయండి
పార్టీ పరిస్థితిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలతో   అశోక్ గజపతిరాజు ఘాటుగా స్పందించారని తెలిసింది.  పార్టీ పరువు ఎక్కువగా తీస్తున్న వారిద్దరినీ గట్టిగా నిలదీయండని అన్నట్టుగా సమాచారం. ఇటువంటి వారి వల్ల పార్టీ పరువు పోతోందని, సద్దుమణిగిద్దామని సముదాయించినట్లు భోగట్టా!

మరిన్ని వార్తలు