కంపుకొడుతున్న గ్రామాలు

4 Mar, 2019 14:19 IST|Sakshi
 రెల్లివీధి–బీసీ కాలనీ కూడలి వద్ద పూడికలతో నిండిన డ్రైనేజీ  

పంచాయతీల్లో పారిశుద్ధ్య లోపం

రోగాల బారిన పడుతున్న ప్రజలు

పట్టించుకోని ప్రత్యేకాధికారులు

గ్రామాల్లో గాడితప్పిన పాలన

సాక్షి, కొత్తూరు : ప్రత్యేకాధికారుల  పాలనలోనూ పంచాయతీల్లో ప్రత్యేకత కానరావడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఆరు నెలలుగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో డ్రైనేజీల్లో పూడికలు, వీధుల్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. దుర్గంధం వెదజల్లుతుండడంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయి. అంటు రోగాలు వ్యాపిస్తాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


కంపుకొడుతున్న గ్రామాలు
కొత్తూరు మండలంలో మండల కేంద్రంతో పాటు నివగాం, దిమిలి, పారాపురం, కలిగాం అఫీషియల్‌ కాలనీ, ఎన్‌ఎన్‌ కాలనీతో పాటు మరికొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ఎల్‌.ఎన్‌.పేట మండలంలో ఎల్‌ఎన్‌పేట, యంబరాం, గొట్టిపల్లి, దబ్బపాడు తదితర గ్రామాల్లో మురుగుకాలువల్లో పూడిక తీతపనులు చేపట్టకపోవడంతో వీధుల్లో మురుగునీరు ప్రవహిస్తోంది.

హిరమండలం మండలంలో రెల్లివలస, పిండ్రువాడ, హిరమండలం, మహలక్ష్మీపురం తదితర గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. మెళియాపుట్టి మండలంలో చాపర, చీపురుపల్లి, గొప్పిలి గ్రామాల్లో ఆరు నెలలుగా పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. పాతపట్నం మండలంలో మండల కేంద్రంతో పాటు ఏఎస్‌ కవిటి, నల్లబొంతు, బూరగాంతో పాటు మరికొన్ని గ్రామాల్లో అపారిశుద్ధ్యం అలముకుంది.


స్పందించని అధికారయంత్రాంగం
పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం పూర్తికావడంతో వారిస్థానంలో ప్రత్యేకాధికారులను నియమించారు. అయితే పంచాయతీ నిధులు ఖర్చు చేసేందుకు వారికి పూర్తిస్తాయిలో అధికారాలు ఇవ్వకపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో మురుగు కాలువల్లో పూడికలు పేరుకుపోయాయి, వీధుల్లో చెత్తకుప్పలు దర్శనమిసుతన్నాయి. దుర్గంధం, దోమలుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. అయినా అధికారులు, పాలకుల్లో స్పందన లేకపోవడం దారుణం.


నిరుపయోగంగా చెత్త సేకరణ రిక్షాలు
స్వచ్ఛభారత్‌ లక్ష్యంలో భాగంగా అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. గ్రామాల్లోని చెత్తను సేకరించి ఆయా కేంద్రాలకు తరలించేందుకు ప్రతీ పంచాయతీకి చెత్త సేకరణ రిక్షాలు కేటాయించారు. అయితే వాటిని ఇప్పటి వరకు వినియోగించిన దాఖలాలు లేవు. వేల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన రిక్షాలు మూలకు చేరాయి. రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన చెత్తశుద్ధి కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

 బోరు చుట్టూ మురుగు
మంచినీటి బోరు చుట్టూ మురుగునీరు చేరడంతో బోరుకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. తాగునీరు కలుషితమవుతోంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలి.
– బొమ్మాలి నగేష్, కొత్తూరు  


రోగాల బారిన పడుతున్నాం
మురుగుకాలువల్లో పూడికలు పేరుకుపోవడంతో ఇళ్ల ముందు మురుగు నిల్వ ఉంటోంది. దుర్గంధంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయి. రోగాల బారిన పడుతున్నాం. కూలి డబ్బులు మందులకే సరిపోతున్నాయి.
 – పి.రాజేశ్వరి, బీసీ కాలనీ, కొత్తూరు 


ఇళ్లలో ఉండలేకపోతున్నాం
మురుగుకాలువలు నిండిపోవడంతో రోడ్డుపై నుంచి మురుగునీరు ప్రవహిస్తోంది. వర్షం కురిస్తే మురుగునీరు ఇళ్లలోకి చేరుతోంది. దుర్గంధం వెదజల్లుతుండడంతో ఇళ్లలో ఉండలేకపోతున్నాం.
– కొయిలాపు రాజారావు, కొత్తూరు 


ఇళ్ల ముందు నిల్వ ఉంటోంది
కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ ఉంటోంది. దీంతో ఇంట్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మేమే కాలువలను శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది.
– నిద్దాన లక్ష్మమ్మ, రెల్లి వీధి 


 పారిశుద్ధ్య పనులు చేపడతాం
మండలంలోని పలు పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించినట్లు గుర్తించాం. వెంటనే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అక్కడి సిబ్బందికి ఆదేశించాం. అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.
– నారాయణమూర్తి, ఈవోపీఆర్డీ, కొత్తూరు 


 

మరిన్ని వార్తలు