ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం

25 Oct, 2017 07:42 IST|Sakshi

పారిశుద్ధ్యం అధ్వానం

ముందుకు కదలని మురుగు

ఏ వీధి చూసినా చెత్త దిబ్బలే

అనేక ఏళ్లుగా వేధిస్తున్న సిబ్బంది కొరత

పాలకులు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆదాయం వచ్చే పనులపై చూపుతున్న శ్రద్ధ పారిశుద్ధ్యం మెరుగుపై కనబరచడం లేదు. ఫలితంగా సీజనల్‌ వ్యాధులు ప్రజలను చుట్టుముడుతున్నాయి. ఇంటికి ఇద్దరు, ముగ్గురు జ్వరాల బారిన పడుతున్నారు.

అనంతపురం సిటీ: సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విషజ్వరాలు, డెంగీ, అతిసార తదితర జబ్బులతో రోగులు విలవిలలాడుతున్నారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో రోజుకు రెండు వేల దాకా రోగులు ఇన్‌పేషెంట్లుగా వైద్యం చేయించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షపునీరు ఎక్కడికక్కడ నిలుస్తోంది. రోజుల తరబడి అలాగే నిల్వ ఉండటంతో మురికిగుంటలుగా తయారవుతున్నాయి. మరోవైపు డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదు. ఏ వీధికెళ్లినా చెత్తదిబ్బలు కనిపిస్తూనే ఉన్నాయి. అపరిశుభ్రత కారణంగా దోమల బెడద అధికమైంది. పగలంతా ఈగలు, రాత్రి అయితే దోమల మోతతో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది.

గ్రామకార్యదర్శుల కొరత
జిల్లాలో 1003 పంచాయతీలను 572 క్లస్టర్లుగా విభజించారు. 330 మంది గ్రామ కార్యదర్శులు ఉన్నారు. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మరో 98 మంది కార్యదర్శులు ఉన్నారు. 575 మంది గ్రామ కార్యదర్శులను నియమించాల్సి ఉండగా ప్రభుత్వం ఇంత వరకు పట్టించుకోలేదు. గ్రామ కార్యదర్శుల కొరత కారణంగా ఉన్న వారు అదనపు పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారు.

పారిశుద్ధ్యంపై చిన్నచూపు
గ్రామపంచాయతీల ఆదాయంలో 30 శాతం పారిశుద్ధ్య పనులకు వెచ్చించాలి. డ్రెయినేజీలో పూడికతీత, చెత్తదిబ్బల తొలగింపు, మురికికుంటల పూడ్చివేతతోపాటు దోమల నివారణకు గంబూషియా చేపలను వదిలి, వేస్ట్‌ ఆయిల్, ఇతర రసాయనాలు చల్లి, ఫాగింగ్‌ తదితర కార్యక్రమాలు చేపట్టాలి. అయితే జిల్లాలో అత్యధిక గ్రామాల్లో ఈ పనులేవీ జరగడం లేదు. ఆదాయం తెచ్చి పెట్టే సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, వీధిలైట్ల ఏర్పాటు పనులు తప్ప పారిశుద్ధ్యాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికితోడు పదేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేసిన పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో కొత్త వారిని నియమించలేదు. 26 మేజర్‌పంచాయతీల్లో కాంట్రాక్ట్‌ సిబ్బంది ఉన్నారు. మైనర్‌ పంచాయతీల్లో ఆ ఊసే లేదు. దీంతో గ్రామాల్లో ఎక్కడా చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. కనీసం దోమలు నివారించేందుకు, దుర్వాసనలు రాకుండా ఉండేందుకు వాడే బ్లీచింగ్‌ పౌడర్, సున్నం కొనుగోలు చేయడంలో కూడా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మెరుగైన సేవలందిస్తున్నాం
వర్షాల కారణంగా పరిస్థితి మొదట దయనీయంగా ఉన్నా.. కలెక్టర్‌ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టి మెరుగైన సేవలందించాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సమస్యను అధిగమించడానికి ఎంపీడీఓలు, విస్తరణాధికారులతో పాటు అన్ని శాఖల అధికారులూ సహకరించారు. ఇక కార్యదర్శుల కొరత విషయం ఈనాటిది కాదు...చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి గ్రామాలను చక్కదిద్దుతాం.  – సుధాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

మరిన్ని వార్తలు