శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ అరెస్టుకు డిమాండ్‌

14 Nov, 2018 08:07 IST|Sakshi
కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి మద్దతు తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, షర్మిలారెడ్డి తదితరులు

పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన పోలీసులకు ఫిర్యాదు

వారం పాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను సెలవుపై పంపిన కమిషనర్‌

విచారణకు ముగ్గురు మహిళలతో కమిషన్‌ ఏర్పాటు

అండగా నిలిచిన  వైఎస్సార్‌ సీపీ నేతలు

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: పారిశుద్ధ్య కార్మికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణను అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలంటూ పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం నిరసన తెలిపారు. నగరంలోని 41వ డివిజన్‌ శ్రీరాంనగర్‌లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న మహిళను సత్యనారాయణ నెల రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలి బంధువులు, తోటి కార్మికులు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వారందరూ కార్పొరేషన్‌ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీరాంనగర్‌లో సోమవారం ఉదయం పారిశుద్ధ్య పనులు చేస్తున్న మహిళతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆ విషయాన్ని ఎంహెచ్‌ఓ డాక్టర్‌ మూర్తి వద్దకు తీసుకువెళ్లింది. మంగళవారం ఉదయాన్నే పరిశీలించి చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు.

కానీ మంగళవారం ఉదయం పనులు పూర్తయినా సత్యనారాయణపై ఎంహెచ్‌ఓ  చర్యలు చేపట్టలేదు. దీంతో బాధితురాలి బంధువులు, కార్మిక నాయకులు పోలీసులకు, కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆ పార్టీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధరరావు, కార్పొరేటర్‌ ఈతకోట బాçపన సుధారాణి బాధితురాలి తరపున కమిషనర్‌తో మాట్లాడి, ఆమెకు న్యాయం చేయాలని కోరారు. సమస్య విన్న కమిషనర్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణను వారం రోజుల పాటు సెలవుపై వెళ్లాలంటూ ఆదేశించారు. జరిగిన ఘటనపై ముగ్గురు మహిళలలో కమిటీ వేస్తున్నట్టు కమిషనర్‌ ప్రకటించారు. నివేదిక వచ్చిన వెంటనే సత్యనారాయణపై చర్యలు చేపడతామని ఆయన జక్కంపూడి విజయలక్ష్మి తదితరులకు హామీ ఇచ్చారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పారిశుద్ధ్య కార్మికులు తమకు న్యాయం చేయాలంటూ నిలదీశారు . దీనిపై కమిటీని ప్రకటించారని, నివేదిక ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు బుచ్చయ్య తెలిపారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. సత్యనారాయణతో గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కమిషనర్‌ దృష్టికి తీసుకుని రావాలన్నారు.

మరిన్ని వార్తలు