జీఓ నంబర్‌ 279ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

29 Sep, 2019 08:59 IST|Sakshi
ప్రజాసంకల్పయాత్రలో సాలూరు వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ సమస్యలు విన్నవిస్తూ పాదయాత్ర చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో పండుగ వెలుగులు

గత ప్రభుత్వంలో పోరాడినా ఫలితం శూన్యం

అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని పాదయాత్రలో  జగన్‌ హామీ

మాట తప్పని నైజం... మడమ తిప్పని నేపథ్యం... ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంతం. అందుకే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారు. అవసరం కోసం హామీలిచ్చి... అందలమెక్కాక వాటిని మరచిపోయే నాయకులను ఇన్నాళ్లూ చూసిన జనం... ఇప్పుడు మాటిచ్చి... నెరవేర్చే నాయకుడిని చూసి ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. పండగ చేసుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికుల బతుకును ప్రశ్నార్థకం చేస్తూ గత ప్రభుత్వం విడుదల చేసిన జీఓ రద్దుకోసం ఎన్నాళ్లుగానో పోరాడుతున్నారు. అయినా నాడు స్పందన కరువైంది. పాదయాత్రగా వచ్చిన జననేత దాని రద్దుకు హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిని ఆచరణలో చూపారు.

సాక్షి, విజయనగరం: రాజకీయ నాయకులంటే అవసరానికి మాటలు చెప్పి ఆ తర్వాత ఇచ్చిన మాటనే మర్చిపోతారనే అపవాదు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అతీతుడిగా నిలుస్తున్నారు. ప్రజా సంకల్పయాత్ర జిల్లాలో చేసినపుడు తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకున్న ప్రతిఒక్కరికీ జగన్‌ మాటిచ్చారు. ‘మీ అందరి ఆశీస్సులతో.. భగవంతుని దయతో రేపొద్దున మనందరి ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చాక మీ అం దరి సమస్యలను తీరుస్తాను’ అంటూ కొండంత భరోసానిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే అనేక హామీలను నెరవేరుస్తున్నారు. ఆక్ర మంలో తాజాగా జీఓ నెం.279ను రద్దు చేశారు. 

మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు:
2016 డిసెంబర్‌ 31న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ నెం.279ను కార్మికుల మెడపై కత్తిలా ప్రవేశ పెట్టింది. ఈ జీఓను వ్యతిరేకిస్తూ మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు తమ బతుకుల కోసం గత మూడేళ్లుగా పోరాడుతున్నారు. దానిని రద్దు చేయాలని అనేక ఆందోళనలు చేశారు. అయినా గత సీఎం చంద్రబాబు వారి వేదనను పట్టించుకోలేదు. ప్రజా సంకల్పయాత్రలో కార్మికుల మొరవిన్న జగన్‌ తాను సీఎం కాగానే న్యాయం చేస్తానని మాటిచ్చారు. ఒకానొక సందర్భంలో ‘పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు మొక్కినా తప్పులేదు’ అంటూ వారిపై తనకున్న గౌరవాన్ని జగన్‌ వ్యక్తీకరించారు. అధికారంలోకి రాగానే వారి కనీస వేతనాన్ని రూ.18వేలకు పెంచారు. తాజాగా 279 జీఓను రద్దు చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో జిల్లాలోని 735 మంది  పారిశుద్ధ్య, విద్యుత్, తాగునీటి సరఫరా కార్మికులకు  ప్రయోజనం చేకూరుతోంది. వారికి ఉద్యోగ భద్రత లభిస్తోంది.

నాడు 70 రోజుల పాటు సమ్మె:
జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు తమ బతుకులను ప్రశ్నార్థకం చసే జీఓను రద్దు చేయాలని 70 రోజుల పాటు సమ్మె చేశారు. సమ్మెను కొనసాగిస్తూనే మున్సిపాలిటీల ఎదురుగా టెంట్‌ వేసి నిరసనలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో జిల్లా అంతటా పారిశుద్ధ్య నిర్వహణకు ఇబ్బందులు తలెత్తినా అప్పటి టీడీపీ పాలకులు పట్టించుకోలేదు. జీఓను అమలు కాకుండా చూస్తానని అప్పటి రాష్ట్ర గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు చెప్పినా ఆ తర్వాత ముఖం చాటేశారు. తన సొంత నియోజకవర్గంలోనే కార్మికులను జైలుకు పంపించారు.

18 మంది జైలుకు
పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఎక్కడబడితే అక్కడ అణచివేసేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. నిరసనలు వ్యక్తం చేస్తున్న శిబిరాలను పోలీసులతో భగ్నం చేయించింది. పోరాటాలను అడ్డుకునేందుకు నాయకులపై నాన్‌బెయిలబుల్‌ కేసులను పెట్టింది. కేసులు పెడతామని బెదిరించింది. అంతే కాదు మొత్తంగా 18 మందిని సబ్‌జైలుకు పంపించింది. బొబ్బిలి మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్న  ఉద్దాన లక్ష్మణరావు వాహనం మీదే గుండెపోటుతో చనిపోయాడు. ఆ జీఓ వల్ల తన ఉద్యోగం పోతుందనీ, తన భార్యా పిల్లలను ఎలా పోషిస్తాననీ పలు మార్లు ఇంటివద్ద చెప్పేవారు. ఆ గుబులుతోనే గుండెపోటుతో 2018 ఆగస్టు 18న డంపింగ్‌యార్డు వద్ద తనకు కేటాయించిన చెత్తను తరలించే వాహనాన్ని నడుపుతూనే తుదిశ్వాస విడిచాడు. 

గత ప్రభుత్వం కుట్రలు చేసింది
జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. మమ్మల్ని అణచివేసేందుకు గత ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ జీఓను రద్దు చేయడం హర్షణీయం. అయితే టౌన్‌లెవెల్‌ ఫెడరేషన్లకు అప్పగించకుండా ట్రెజరీల ద్వారా వీరికి వేతనాలు ఇప్పిస్తే బాగుంటుంది. – పొట్నూరు శంకరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ మున్సిపల్‌ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికుల సంఘం. 

సీఎంకు ధన్యవాదాలు
మున్సిపల్‌ కార్మికులను ఇబ్బందిపెట్టే జీఓ నెం.279 రద్దు చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మున్సిపల్‌ కార్మికుల జీతం రూ.12వేల నుంచి రూ.18వేలకు పెంచినందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. పాదయాత్రలో మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీని పదవిలోకి వచ్చిన మూడు నెలల్లో అమలు చేయటం హర్షించదగ్గ విషయం. – టి.వి.రమణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, విజయనగరం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా