నేటి నుంచి విధుల్లోకి పారిశుద్ధ్య కార్మికులు

26 Jul, 2015 00:18 IST|Sakshi

విజయనగరం మున్సిపాలిటీలో కొనసాగనున్న సమ్మె
గతంలో ఇచ్చిన హమీలు నెరవేర్చాలంటూ డిమాండ్
విధుల్లోకి చేరనున్న రెగ్యులర్ కార్మికులు
 

విజయనగరం మున్సిపాలిటీ:ఎట్టకేలకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెను విరమించారు. కార్మికుల సమ్మెకు ప్రతిపక్ష వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో పాటువామపక్షాలు, ట్రేడ్ యూనియన్లు   మద్దతు పలకడంతో ప్రభుత్వం దిగివచ్చింది.    16 రోజులుగా కనీస వేతనం రూ15,432కు పెంచాలన్న ప్రధాన డిమాండ్‌తో పాటు మరో 22 డిమాండ్‌లను నెరవేర్చాలని పారిశుద్ధ్యకార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసింది.   ప్రభుత్వంతో కార్మిక సంఘాల నాయకుల చర్చలు సఫలం కావడంతో  విధుల్లోకి చేరనున్నట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ తెలిపారు.   శనివారం నుంచి ప్రారంభమైన కార్మికుల నిరవధిక నిరాహార దీక్షలు సైతం విరమించారు. కార్మికులు డిమాండ్ చేసిన మొత్తం కాకుండా రూ11వేల వేతనాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మిగ తా 22 డిమాండ్‌లను దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం హమీ ఇచ్చింది.

జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలు ఉండగా.. అందులో బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల్లో రాష్ట్ర వ్యాప్త సమ్మె విరమణలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులతో  పాటు రెగ్యులర్ కార్మికులు విధులకు హాజరుకానున్నారు. విజయనగరం మున్సిపాలిటీలో సమ్మెను  కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. గతంలో కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె కొనసాగించనుండగా.. రెగ్యులర్ కార్మికులు విధుల్లోకి వెళ్లనున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ఆదివారం రావాలని మున్సిపాలిటీ నుంచి ఆహ్వానం వచ్చిందన్నారు. చర్చలు అనంతరం భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నట్లు టి.వి. రమణ తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు