విషాద జ్ఞాపకాల్ని కడిగేసి..

12 May, 2020 03:40 IST|Sakshi
ఆర్‌ ఆర్‌ వెంకటాపురంలో సోమవారం ఇళ్లకు చేరుకున్న అనంతరం ఇంటి ముందు ముగ్గులు వేసిన గ్రామస్తులు

స్టైరీన్‌ ప్రభావిత గ్రామాల్లో పూర్తయిన పారిశుధ్య పనులు 

ప్రతి ఇంటినీ బ్లీచింగ్, ఫినాయిల్‌తో శుభ్రం చేసిన జీవీఎంసీ 

యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన అధికారులు 

జనజీవనానికి అనుకూలంగా గ్రామాల్ని తీర్చిదిద్దిన సిబ్బంది

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి వెలువడిన విష వాయువు చేదు జ్ఞాపకాలను కడిగేశారు. స్టైరీన్‌ అవశేషాలు ఒక్క శాతం కూడా లేకుండా తుడిచేశారు. మూగజీవాల మృత కళేబరాలను తొలగించారు. ప్రతి గ్రామం.. వీధి.. ప్రతి ఇంటినీ జల్లెడపట్టి కాలుష్య ఛాయలు లేకుండా క్లీన్‌ చేశారు. ప్రమాదానికి గురైన ఆర్‌ఆర్‌ వెంకటాపురం, నందమూరి నగర్, కంపర పాలెం, పద్మనాభ నగర్, ఎస్సీ, బీసీ కాలనీ రూపురేఖలను కేవలం ఐదు రోజుల్లో మార్చేసిన ప్రభుత్వ యంత్రాంగం గ్రామాల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చింది. (గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ)

సీఎం ఆదేశాలతో.. 
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు 5 గ్రామాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇందుకోసం 700 మంది సిబ్బందిని మోహరించారు.  
► గ్రామాల్లోని ప్రధాన, అంతర్గత రహదారులను శుభ్రం చేశారు. వాయు కాలుష్యానికి మాడిపోయిన చెట్లు, మొక్కలను, కాలువల్లో పూడికను తొలగించారు. చనిపోయిన పశు కళేబరాలను తరలించారు.  
► వాటర్‌ ట్యాంకర్ల సాయంతో ఇళ్ల లోపల కూడా రసాయనిక వాయువుల జాడ లేకుండా శుభ్రం చేశారు. 
► 30 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో 5 బెల్‌ మిస్ట్‌ భారీ యంత్రాలు, 6 టాటా ఏస్‌ వాహనాల ద్వారా ప్రధాన రోడ్లపై సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేసి బ్లీచింగ్‌ చల్లారు.  
► వ్యాధులు ప్రబలకుండా 100 మంది మలేరియా సిబ్బంది పర్యవేక్షణలో పనులు చేపట్టారు. గ్రామాల్లోకి వచ్చాక ప్రజలు చేయాల్సిన పనులు, చేయకూడని పనులను వివరిస్తూ అవగాహన కల్పించారు.  
► సోమవారం సాయంత్రానికి ఐదు గ్రామాల ప్రజలను వారి ఇళ్లకు తరలించారు. 
► వాటర్‌ వర్క్స్‌ ఏఈల ఆధ్వర్యంలో స్టోరేజ్‌ ట్యాంకుల్లో నీటిని శుభ్రం చేశారు. గ్రామాల్లో తాగునీరు, ఇతర అవసరాలకు ఎస్‌ఈ వేణుగోపాల్‌ ఆదేశాలతో 30 ట్యాంకర్లతో 80 ట్రిప్పులు సరఫరా చేశారు.  
► కుళాయిల ద్వారా కూడా గృహాలకు మంచినీటి సరఫరా చేశారు. అలాగే యూసీడీ పీడీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం రాత్రికి గ్రామస్తులకు అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించారు.  
► ఐదు గ్రామాల ప్రజలకు 20 వేల మాస్కులను పంపిణీ చేశారు. జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.  

అన్ని వసతులు కల్పించారు 
ప్రభుత్వం చెప్పిన విధంగానే మాకు అన్ని వసతులు కల్పించారు. ఈ ప్రాంతంలో అంతటి ప్రమాదం జరిగిందన్న ఆనవాళ్లు లేకుండా ఊళ్లను శుభ్రం చేయించారు. 
– పుల్లేటికుర్తి పుష్ప, వెంకటాపురం 
 
ప్రభుత్వ చర్యలు బాగున్నాయి 
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించిన తీరు అద్భుతం. ఆసుపత్రుల్లో ఉన్న బాధితులకు సైతం భరోసా కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా బాగుంది. 
– వెంకటరమణరావు, న్యాయవాది, వెంకటాపురం
 

 జీవితాంతం రుణపడి ఉంటాం 
ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చి అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే మమ్మల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చారు. సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటాం. 
    – యడ్ల వరలక్ష్మి, వెంకటాపురం  

నాలుగు రోజుల తర్వాత అమ్మ ఒడికి... 
నాలుగు రోజుల తర్వాత చంటి బిడ్డ కనిపించడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనలో అస్వస్థతకు గురైన ఎ.నాగమణి ఈ నెల 7 నుంచి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. సోమవారం ఆమె కోలుకోవడంతో రెండు నెలల పసికందును బంధువులు తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. కన్నబిడ్డకు కడుపునిండా పాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నానని నాగమణి కంటతడి పెట్టడంతో అక్కడున్న అందరి కళ్లూ చెమర్చాయి. దీంతో మంత్రులు, ఇతర అధికారులు ఆమెను ఓదార్చారు. 

ఊళ్లకు కళొచ్చింది
స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనతో చెల్లాచెదురైన గ్రామాలు కోలుకున్నాయి. ఐదు గ్రామాలను అన్నివిధాలా నివాసయోగ్యంగా తీర్చిదిద్దటంతో ప్రజలను వారి ఇళ్లల్లోకి సోమవారం అనుమతించారు. రాత్రి సమయానికి 70 శాతం ప్రజలు ఇళ్లకు చేరుకున్నారు.

క్షేమంగా చేరారు
► ఎల్‌జీ పాలిమర్స్‌కి ఆనుకుని ఉన్న వెంకటాపురంలో 1,250 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ నివసించే 5 వేల మందిలో 3 వేల మంది ఇళ్లకు చేరుకున్నారు. మిగతా వారు షెల్టర్లు, బంధువుల ఇళ్లలో ఉన్నారు. అస్వస్థతకు గురైన వారు కేజీహెచ్‌లో, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారు. 
► కంపెనీకి కిలోమీటరు దూరంలో ఉన్న నందమూరి నగర్‌లో 600 వరకూ ఇళ్లు, 2,250 మంది జనాభా ఉన్నారు. వారిలో 70 శాతం మంది సోమవారమే తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు.
► 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభ నగర్‌లో 500 వరకూ ఇళ్లు, 2,200 మంది జనాభా ఉంది. గ్రామస్తులంతా ఇళ్లకు చేరుకున్నారు.

మేఘాద్రి గెడ్డ నీరు సురక్షితమే
ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి విషవాయువు లీకైన ఘటనలో మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్‌ స్టైరీన్‌తో కలుషితమైపోయిందన్న సందేహాలను నివృత్తి చేస్తూ కాలుష్య నియంత్రణ మండలి నివేదిక విడుదల చేసింది. దుర్ఘటన జరిగిన నాటి నుంచి రోజూ రిజర్వాయర్‌ నీటి శాంపిళ్లని పరీక్షల కోసం గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ రీజనల్‌ వాటర్‌ లేబొరేటరీకి పంపించింది. ఈ నెల 7న పంపించిన శాంపిళ్లకు సంబంధించిన నివేదికను జీవీఎంసీకి కాలుష్య నియంత్రణ మండలి అందించింది. తొలి రోజు తీసుకున్న శాంపిళ్లలో స్టైరీన్‌ మోనోమర్‌ అవశేషాలు లేవని నివేదికలో పేర్కొంది. నీరు వినియోగించేందుకు సురక్షితంగా ఉందని తెలిపింది.  

మరిన్ని వార్తలు