అయ్యో.. సంజీవిని

5 Jan, 2019 08:16 IST|Sakshi

అన్న సంజీవినికి ఆదరణ కరువు

ఒక్కొక్కటిగా మూతపడుతున్న షాపులు

జనరిక్‌ మందులపై అవగాహన కల్పించని అధికారులు

సామాన్యులపై మందుల ధరల మోత

నిబంధనలు పాటించని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు

శ్రీకాకుళం: జిల్లాలోని అన్న సంజీవిని మందుల దుకాణాలకు ఆదరణ కరువవుతోంది. పేదలకు తక్కువ ధరకే మందులు అందిస్తామని చెబుతూ ప్రభుత్వం అన్న సంజీవిని పేరిట మందుల దుకాణాలను నెలకొల్పేలా చేసింది. 2015 అక్టోబరు 2న రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుకాణాలను ప్రారంభించారు. తొలుత పురపాలక సంఘాల పరిధిలో ఈ షాపులను ప్రారంభింపజేయించారు. డీఆర్‌డీఏ పరిధిలోని వెలుగు ఆధ్వర్యంలో జిల్లాలో 25 షాపులను నెలకొల్పేలా చేశారు. శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుప్రతిలో ఒకటి, నరసన్నపేట, టెక్కలి, కోటబొమ్మాళి, సోంపేట, రణస్థలం, సంతకవిటి, జలుమూరు తదితర చోట్ల ప్రారంభించారు. వీటిలో గతంలోనే టెక్కలి, సోంపేట దుకాణాలు ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగక మూతపడ్డాయి.

శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రిలోని మందుల దుకాణం కూడా తెరుచుకోవడం లేదు. మిగిలిన వాటి పరిస్థితి కూడా ఎప్పుడు తీస్తారో, ఎప్పుడో మూసివేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ప్రభుత్వం జనరిక్‌ మందులపై సరైన ప్రచారం, ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో అందరూ బ్రాండెడ్‌ వైపే చూస్తున్నారు. వాస్తవానికి అన్న సంజీవిని దుకాణాల్లో దొరకే జనరిక్‌ మందులు బ్రాండెడ్‌ మందులతో సరిసమానమైనవి కాగా, ధర కూడా చాలా తక్కువ. బ్రాండెడ్‌ మందులతో పోలిస్తే జనరిక్‌ మందుల ధర తక్కువగా ఉందనడానికి ఉదాహరణకు సాధారణ మెడికల్‌ షాపుల్లో రూ.115 వరకు ఉండగా జనరిక్‌ షాపుల్లో కేవలం రూ.20లకే లభిస్తున్నాయి. జనాభాలో 40 శాతం మందికి పైగా వినియోగించే మధుమేహం, బీపీ మందులు కూడా 60 నుంచి 70 శాతం తక్కువగా లభిస్తున్నాయి. కాల్షియం మాత్రలు సాధారణ కంపెనీలకు చెందినవి రూ.60 నుంచి రూ.80 వరకు ఉండగా, అన్న సంజీవిని దుకాణాల్లో రూ.20లకే విక్రయిస్తున్నారు.

ఇలా ప్రతి దానిలోనూ తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. అన్న సంజీవిని దుకాణాలు నెలకొల్పినప్పుడు వైద్యులు ప్రిస్కిప్షన్‌ అర్థమయ్యేలా రాయాలని అవి కూడా బ్రాండ్‌ పేరు కాకుండా మందు పేరును రాయాలని భారత వైద్య మండలి ఆదేశించింది. అయినా ఎక్కడా దీనిని అమలు చేయడం లేదు. ప్రభుత్వ వైద్యులు సైతం దీనిని పాటించకపోవడం విచారకరం. ప్రైవేటు వైద్యుల విషయం వేరే చెప్పాల్సినపని లేదు. వీరు తమ క్లినిక్‌లకు అనుబంధంగా ఉన్న దుకాణాల్లోనే మందులను కొనుగోలు చేయాలని రోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనివలన ప్రజలు తీవ్ర భారాన్ని మోస్తున్నారు. జనరిక్‌ మందులకు సాధారణ షాపుల్లో విక్రయించే మందుల ధరల్లో 70 నుంచి 80 శాతం వ్యత్యాసం ఉంటోంది. ఇంతటి ఉపయోగకరమైన అన్న సంజీవిని షాపులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానో, మరే కారణంగానో నిర్లక్ష్యం చేస్తుందనడంలో అవాస్తవం లేదు. ఇప్పటికైనా అన్న సంజీవినిపై ప్రత్యేక దృష్టిసారించి జనరిక్‌ మందులను అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు