కృష్ణాజలాలతో చెరువులన్నీ నింపుతాం

29 Aug, 2019 07:49 IST|Sakshi

బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ 

జీడిపల్లి నుంచి కాలువకు నీరు విడుదల 

సాక్షి, జీడిపల్లి(అనంతపురం) : కరువు జిల్లా అనంతకు హంద్రీనీవా వరంలాంటిదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువతోనే హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయన్నారు. ఆ మహానేతను జిల్లా వాసులెప్పటికీ మరువలేరన్నారు. బుధవారం ఆయన బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం రెండో దశ కాలువకు నీటిని విడుదల చేశారు.

అంతకుముందు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి, కలెక్టర్‌ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రైతు మిషన్‌ సభ్యుడు రాజారాంలతో కలిసి మంత్రి గంగపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ కృష్ణా జలాలతో జిల్లాలోని అన్ని చెరువులను నింపి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అనంతరం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ వెంకటరమణ మాట్లాడుతూ జీడిపల్లి రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1.68 టీఎంసీలు కాగా, ప్రస్తుతం రిజర్వాయర్‌లో 1.60 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతానికి రెండో దశ కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేశామని, 24 గంటల తర్వాత ఇన్‌ఫ్లో ఆధారంగా 600 క్లూసెక్కుల మేర విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో హంద్రీనీవా ఈఈ నారాయణ నాయక్, డీఈ వెంకటేశ్వర్లు, గోపినాథ్‌  తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు