సంక్రాంతి సంబురం

15 Jan, 2015 04:25 IST|Sakshi
  • నేడు సంక్రాంతి
  • రేపు కనుమ
  • నిజామాబాద్‌కల్చరల్: మూడు రోజుల ముచ్చటైన పండుగలో మొదటిరోజైన బుధవారం జిల్లావ్యాప్తంగా భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే చిన్నా,పెద్దా అందరూ లేచి, ఒంటికి నువ్వులనూనె రుద్దుకొని స్నానాలు ఆచరించారు. పిల్లలకు నేరేడుపళ్లు, చెరుకుముక్కలు, బంతిపూలతో భోగి(బోడు) పళ్లను పోశారు. యువతులు, మహిళలు పొద్దున్నే లేచి ఇళ్లముందు ముగ్ధమనోహరమైన ముగ్గులు వేశారు. అందమైన రంగులు అద్ది.. ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టారు. పాలను పొంగించి భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

    భగవద్భక్తి పూజా కార్యక్రమాలతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికారు. హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు ఇంటిం టికి తిరుగుతూ హరినామస్మరణ చేస్తూ.. బసవన్నను ఆడిస్తూ.. సందడి చేశారు. వారికి తోచిన ధనధాన్యాలను దానం చేశారు. హరిదాసులు సంక్రాంతి లక్ష్మి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ముందుకు సాగారు. బసవన్న సైతం అందరినీ దీవించారు. గురువారం సంక్రాంతి, శుక్రవారం కనుమ పర్వదినాలను జిల్లావాసులు సంబురంగా జరుపుకోనున్నారు.
     
    పతంగులు ఎగరేసిన యెండల

    వినాయక్‌నగర్ : పండుగ కంటే నెల రోజుల ముందు నుంచే చిన్నారులు పతంగులతో సందడి చేస్తున్నారు. ఇక భోగి నాడు వీరి జోరు మరింత ఎక్కువైంది. యువకులు,చిన్నారులు దాబాలపెకైక్కి గాలిపాటలను పోటాపోటీగా ఎగురవేశారు. ‘పతంగుల పండుగ’ కార్యక్రమంలో భాగంగా గాయత్రీనగర్‌లో బీజేపీ మాజీ శాసనసభా పక్షనేత యెండల లక్ష్మీనారాయణ కూడా యువకులతో కలిసి పతంగులను ఎగురవేశారు.  యువమోర్చ నగర  ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో గాయత్రీనగర్‌లో స్థానిక యువకులతో కలిసి గాలిపటాలను ఎగురవేశారు. సంస్కృతిని, సంప్రదాయాన్ని ముందుతరాలకు అందించే పండుగలను అందరూ జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో యువ మోర్చ జిల్లా అధ్యక్షుడు గాదె కృష్ణ, నాయకులు రోషన్‌బోరా, సంతోష్‌గౌడ్, సుభాష్‌గౌడ్, అనిల్, చరణ్, సృజన్‌గౌడ్, టింకుల్‌గౌడ్  తదితరులు పాల్గొన్నారు.
     
    బెటాలియన్‌లో అంబరాన్నంటిన సంబురాలు

    డిచ్‌పల్లి : డిచ్‌పల్లి టీఎస్‌ఎస్పీ ఏడో బెటాలియన్‌లో సంకాంత్రి సంబురాల్లో భాగంగా బుధవారం భోగి పర్వదినాన్ని సం ప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.  ఉదయం 4 గంటల నుంచే సందడి మొదలైంది. కమాండెంట్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమాండెంట్లు వెంకట్రాములు, అమృతరావు, ప్రసన్న కుమార్ దంపతులతో పాటు బెటాలియన్ సిబ్బంది భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కమాండెంట్  శ్రీనివాసరావు ముం దుగా భోగి మంటలు వెలిగించారు.

    కమాండెంట్ సతీమణి రజిని ఆధ్వర్యంలో మహిళలు కొత్త కుండల్లో పాలు పొంగించారు. అనంతరం బెటాలియన్‌లో ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు, యువతులు  కోలాటం ఆడారు. సంప్రదాయబద్ధంగా చిన్నారులపై భోగి(బోడు) పండ్లు పోశారు. సంప్రదాయ పిండి వంటలు తయారు చేసి అందరికీ పంచిపెట్టారు. మహిళలు మంగళహారతులతో శ్రీలక్ష్మి వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిదాసు, గంగిరెద్దుల వారు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఈ సంబరాల్లో బెటాలియన్ బీడబ్ల్యుఓ మహేందర్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది వారి కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు