సంక్రాంతి 2020; పందెం రాయుళ్ల అరెస్టు

15 Jan, 2020 11:53 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి/పశ్చిమగోదావరి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతో ఈసారి కోడి పందేల శిబిరాల వద్ద పేకాట, మద్యం విక్రయాల జాడేలేకుండా పోయింది. గతంలో కోడి పందేల బరుల వద్దే అనధికారికంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగేవి. దాంతోపాటు పేకాట, గుండాట, కోతాట వంటివి పెద్ద ఎత్తున ఆడేవారు. కాగా, 2020 సంక్రాంతి సంబరాల్లో జూదాన్ని కట్టడి చేసేందుకు పోలీసుల చర్యలు ఫలించాయి. ఇక సంప్రదాయ కోడి పందాల్లో కత్తి కట్టడం లేదని నిర్వాహకులు చెప్తున్నారు. మూడు రోజులపాటు సరదాగా గడిపేందుకు, ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయ కోడి పందేల్ని వీక్షించేందుకు వచ్చామని ఔత్సాహికులు వెల్లడించారు. అయితే, అన్ని బరులపై నిఘా పెట్టామని.. నిబంధనలు ఉల్లంఘించి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 
(చదవండి : కొక్కొరొకో.. వేడు‘కోళ్లు’ వినవలె)

బరిలో నిలిచిన పందెం కోళ్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజు కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు జిల్లాకు చేరుకున్నారు. భీమవరం, నరసాపురం, ఆచంటతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో 100కు పైగా బరుల్లో కోడి పందాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఉంగుటూరు మండలం గొల్లగూడెం, బాదంపూడి, నల్లమాడు గ్రామాల్లో  కోడిపందాలపై పోలీసులు దాడులు చేసి.. ఆరుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. 3 కోళ్లు, రూ.4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసుల అరెస్టు చేశారు. రూ. 4780 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఉండి సంక్రాంతి సంబరాల్లో తలసాని
తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను గత సంవత్సరం వచ్చినప్పుడు చెప్పా ప్రభుత్వం మారుతుందని. మా రాష్ట్రం నుంఛఙ ఒకాయనకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తామని చెప్పాం అలాగే ఇచ్చాం. ఒక పెద్ద భవనం కట్టి హైదరాబాద్ నేనే డెవలప్ చేశానని చెప్పుకునే తిరిగి ఒకాయన మూలన పడ్డాడు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం మంచి పరిణామం.

కేసు నమోదు..
సాక్షి, చిత్తూరు : పీలేరులో రెండుచోట్ల (జాండ్ల, యర్రగుంట్ల వద్ద)  కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని  చుట్టుముట్టి 10 మంది పందెం రాయుళ్లని, 2 కోడి పుంజులను  లక్షా వెయ్యి రూపాయల నగదు , 54 కోడి కత్తులు, ఒక  కారు , రెండు మోటర్ సైకిళ్లను  స్వాధీనం చేసుకున్నారు. పందెం రాయుళ్లపై కేసు నమోదు చేశారు. జిల్లాలోని బి.కొత్తకోటలో ఆరు మంది పందెం రాయుళ్లను అరెస్టు చేసి  వారి వద్ద నుంచి..  రెండు కోళ్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.15 వేల 620 ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా వాజేడు మండలానికి  సమీపంలో ఉన్న చత్తీస్గఢ్ సరిహద్దుల్లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు జరిగినట్టు సమాచారం. పందాల్లో పాల్గొనేందకు రాష్ట్రం నుంచి  గుట్టుగా పోయేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. అసలే ఏజెన్సీ అందులోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో..  పోలీసులకు కోడి పందాల కట్టడి చేయడం కష్టతరంగా మారింది. 

మరిన్ని వార్తలు