పల్లెగూటికి పండగొచ్చింది

13 Jan, 2014 04:30 IST|Sakshi

రైతు కష్టం ఫలించింది. పంటలు ఇంటికి చేరుతున్నాయి. అందరి మొహాల్లో ఆనందం. ఇంట సంక్రాంతి సంబరాలు. పండిన ధాన్యాన్ని అవసరానికి దాచుకోగా మిగిలినది అమ్మేస్తున్నాడు. ఆ డబ్బుతో పిల్లలకు కొత్త బట్టలు కొనుగోలు చేశాడు. పండగ పూట పిండి వంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు సిద్ధమయ్యాడు.

 ఆనంద లోగిళ్లు..
  గుంటూరు జిల్లా తెనాలి మండలం కొల్లపర గ్రామం నుంచి వచ్చిన కుటుంబ రెడ్డి, కాంతమ్మ దంపతులు నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామంలో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు శివారెడ్డి, కోడులు సీతామహాలక్ష్మి వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు. కుటుంబీకుల మధ్య సంక్రాంతిని జరుపుకునేందుకు ఆయన కుమారుడు బసవ పున్నారెడ్డి, కోడలు దుర్గాలక్ష్మి, మనుమళ్లతో భువనేశ్వర్ రెడ్డి, సాయి రుత్విక్ రెడ్డితో కలసి ఇక్కడికి చేరుకున్నాడు.

 ప్రతి ఏటా జరుపుకునే పండుగ విశేషాలను ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు. ‘ పండుగ గ్రామానికి వచ్చినప్పుడల్లా చిన్నానాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తోటి మిత్రులతో కలసి ఇంటిలోని పాత వస్తువులను బోగిరోజు కాల్చడం, కాల్వలో ఈత కొట్టడం, పసందైన పిండి వంటలు తినడం ఎంతో ఇష్టం. మా అక్క రాములమ్మ చేసే పిండి వంటలు చాలా బాగుంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరం హాయిగా గడుపుతాం’. అన్నారు. అనంతరం అందరూ గ్రామంలో దేవాలయానికి ట్రాక్టర్లతో బయలుదేరారు.   
 
 సంబరాల సంక్రాంతి
 ఈ ఏడాది పత్తి పంట బాగా పండటంతో ఆదోని ప్రాంత వాసులు సంక్రాంతిని రెట్టింపు ఉత్సాహంతో చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆడబిడ్డలను, బంధువులను పండుగకు ఆహ్వానించారు. ఉద్యోగ రీత్యా ఆదోనిలో నివాసముంటున్న చంద్రశేఖర్ ఇద్దరు కుమార్తెలు. పండుగకు వారిద్దరూ భర్తలు, పిల్లలతో పండగకు వచ్చేశారు. ఇళ్లంతా సందడి సందడిగా ఉంది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.

 ‘శూన్య మాసం కావడంతో కొత్త బట్టలు పెట్టం. అయితే మూడు రోజుల పాటు పండుగకు ప్రత్యేక వంటకాలు తయారు చేస్తాం. ముఖ్యంగా నువ్వులు అద్దిన సద్ద రొట్టెలు, గుమ్మడికాయ, ఇతర కాయగూరలతో చేసిన తీపి పచ్చడి, గుగ్గిళ్లు, పిండి వంటలు, మరుసటి రోజు భక్ష్యాలు వండుతాం. అందరం కలిపి కబుర్లు చెపుతూ రుచికరమైన వంటకాలు ఆరగిస్తాం. ఉద్యోగం రిత్యా మేము పట్టణంలో నివాసం ఉంటున్నప్పటికీ కుటుంబానిది పల్లె నేపథ్యమే’. అని చెప్పారు.  

మరిన్ని వార్తలు