వేడిగా.. రెడీగా..

14 Jan, 2014 00:19 IST|Sakshi
వేడిగా.. రెడీగా..

గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్: సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పిండివంటలు. నేటి పరుగులు ప్రపంచంలో పిండివంటలు చేసే తీరిక, ఓపిక తక్కువగా ఉంటోంది. రెడీమేడ్‌గా అన్ని పిండివంటలు అనేక రకాల గృహ ఫుడ్స్, స్వీట్‌హోమ్స్ నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో సంక్రాంతి రెడీమేడ్‌గా మారింది. విస్తర్లలో వడ్డించే పులిహోర, చక్రపొంగలి, పాలతాలికలు కూడా రెడీమేడ్‌గానే లభిస్తున్నాయి. ప్రజల మనోభావాలను కనిపెట్టిన అనేక గృహ ఫుడ్స్ సంస్థలు పండుగరోజుల్లో అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు.. వంటి సంప్రదాయ వంటకాలను వండి విక్రయిస్తున్నారు.

కొన్ని గృహ ఫుడ్స్‌లో నేతితో చేసిన పిండివంటలు అందిస్తుండగా, మరికొన్ని సామాన్యులకు అందుబాటులో విధంగా మంచినూనెతో తయారు చేస్తున్నారు. వీటి నాణ్యతను బట్టి వివిధ ధరల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. నేతితో చేసిన పిండివంటల్లో అరెసెలు కిలో రూ.410, షుగర్ ఫ్రీ అరిసెలు రూ.580, గట్టి అరిసెలు రూ.420, కొబ్బరిబూరెలు రూ.280, చెక్కలు, సన్నకారపు పూస, మినప చక్రాలు, మురుకులు తదితర కారపు పిండి వంటలు కిలో రూ.300 వరకు ధర పల్డుకుతున్నాయి. విస్తర్లో వడ్డించే పాలతా లికలు, చక్రపొంగలి, పులిహోర, పూర్ణాలు, గారెలు వంటివి కిలో రూ.280 ధర పలుకుతున్నాయి. బొబ్బట్లు రూ.370, నూనెతో చేసిన పిండి వంటలు వీటికంటే 30 శాతం తక్కువ ధరల్లో అందిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు