రంగంపేట జల్లికట్టులో మంచు మోహన్‌బాబు

17 Jan, 2020 10:06 IST|Sakshi
జల్లికట్టుకు వస్తున్న సినీనటులు మంచుమోహన్‌బాబు, మంచు మనోజ్‌కు స్వాగతం పలుకుతున్న జనం

సాక్షి, చంద్రగిరి/వెదురుకుప్పం: మండలంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగలో మూడో రోజైన గురువారం జిల్లాలోనే ఎడ్ల పందేల(జల్లికట్టు)కు ప్రసిద్ధి చెందిన రంగంపేట గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. వీక్షించడానికి మండలం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. దీంతో రంగంపేట గ్రామం జనసంద్రమైంది. గ్రామ ప్రారంభం నుంచి చివరి వరకు ఇసుకవేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. గ్రామంలోని పశువులను పందేలకు వదలడంతో యువకులు కేరింతలు కొడుతూ వాటిని నిలువరించేందుకు పోటీపడ్డారు.

మహిళలు సైతం మేడలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. పశువులకు కట్టిన పలకలను సొంతం చేసుకునే ప్రయత్నంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు. సుమారు 4 గంటల పాటు ఉల్లాసంగా జల్లికట్టు సాగింది.  

                            ఎడ్ల పందేలు తిలకించడానికి చెట్టు పైకి ఎక్కిన జనం 

పందేలను తిలకించిన మోహన్‌బాబు 
పశువుల పందేలను శ్రీవిద్యానికేతన్‌ అధినేత, సీనియర్‌ నటుడు డాక్టర్‌ మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు, నటుడు మంచు మనోజ్‌ తిలకించారు. మోహన్‌బాబు పశువుల పందేలను తిలకించడానికి రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు.   

మాంబేడులో.. 
వెదురుకుప్పం మండలం మాంబేడులో జల్లికట్టు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు కోడెగిత్తలను నిలువరించడానికి ఉత్సాహం చూపారు. 

మరిన్ని వార్తలు