‘పల్లెల్లో ఏముంది... మట్టి మనుషులు’

17 Jan, 2020 11:45 IST|Sakshi

సాక్షి, కడప: కోడి కూయకముందే పల్లె నిద్ర లేచింది.. ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చిన తన బిడ్డలను చూసి పల్లె తల్లి మురిసింది.. పట్టణాలు..నగరాల నుంచి తరలివచ్చిన బంధుమిత్రులతో కళకళలాడుతున్న తెలుగు లోగిళ్లను చూసి ముచ్చటపడింది. ‘పల్లెల్లో ఏముంది... మట్టి మనుషులు.. వట్టిపోయిన భూములు’ అంటుంటారు కదా.... ఇప్పుడు మీరే చూడండి.. నాలోని ప్రేమ.. ఆప్యాయత ఏపాటిదో.. కను‘మా విందు’ ఎలా ఉంటుందో.. అంటూ తన స్వగతాన్ని ఇలా చెప్పుకొచ్చింది.  

‘రేయ్‌ సంటోడా.. మీ నాయన ఏడిరా...’ తన మనవడిని ఆపి అడిగింది జేజి. ‘అదిగో వస్తున్నాడు చూడు..’ మనవడు సమాధానమిచ్చాడు.. అటు వైపు నుంచి వస్తున్న తన తండ్రిని చూపిస్తూ.. ‘యాడికిపోయినావ్‌.. నాయనా.. కూచ్చో.. కూచ్చో.. వడలు సల్లారిపోతాండాయ్‌.. ఓ పల్లెంలో వడలు.. నాటుకోడి కూర తెచ్చి పెట్టింది ప్రేమతో... నువు కూడా రామ్మా.. కోడలిని పిలిచింది.. దగ్గరుండి మరీ వడ్డించింది..’ పండక్కు కొడుకు కోడలు వచ్చినారని ప్రపంచాన్నే జయించానన్న సంతోషం ఆమెది. చూశారా.. కొడుక్కి దగ్గరదగ్గర ఐదు పదుల వయసున్నా.. అమ్మ ప్రేమ ఎలాంటిదో..  

అదిగో అటు చూడండి.. ‘నమస్తే సార్‌.. బాగున్నారా.. ’ తన చిన్ననాటి గురువు సత్యమయ్యకు దండం పెట్టాడు శిష్యుడు శివ. శివ వేరే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. సత్యమయ్య అంటే ఆ ఊర్లో అందరికీ గౌరవం. ట్యూషన్‌ పెట్టి ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించాడాయన. ‘ఏం శివా.. బాగున్నావా.. ఉద్యోగం ఎలా ఉంది’ బాగున్నా సార్‌.. మీరెలా ఉన్నారు.. ఇలా వారి సంభాషణ నడిచింది. చాలా ఏళ్ల తర్వాత ఊరికి వచ్చిన శివ తన గురువు కోసం తెచ్చిన కానుక ఇచ్చి.. శాలువాతో సన్మానించాడు.. కాళ్లకు దండం పెట్టి ఆశీర్వచనాలు అందుకున్నాడు.  చూశారా.. నా ఒడిలో పెరిగిన బిడ్డ ఎంతెత్తుకు ఎదిగినా ఎలా ఒదిగి ఉన్నాడో.. అంటూ ఆ  పల్లె తల్లి గర్వంగా చెప్పింది. ఆ పక్కనే ఉన్న ఇంట్లో ఒకటే నవ్వులు వినిపిస్తున్నాయ్‌.. హైదరాబాద్‌ నుంచి వచ్చిన తన సహచర ఉద్యోగులు, మిత్రులతో అనిల్‌ పండుగను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఊర్లో తన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ.. అవన్నీ తన మిత్రులతో పంచుకుంటున్నాడు.. అంతలోనే అనిల్‌ అమ్మ పల్లెం నిండా స్వీట్లు తెచ్చి పెట్టింది. ‘కడుపు నిండిపోయింది.. వద్దు.. వద్దు’ అంటున్న ‘లేదు తినాల్సిందే’ అంటూ వారి ముందు పెట్టింది.

మూడు రోజుల నుంచి ఆమె అలుపెరగకుండా వారికి ఏం కావాలో అడిగి మరీ వండి వడ్డిస్తోంది. అదీ నేను నేర్పిన ఆప్యాయత..   ప్రతి ఇంటా చుట్టాలు.. పిల్లల అల్లర్లు.. వంటింట్లో ఘుమఘమలాడే పిండివంటలు.. పంట చేలు.. పిల్ల కాలువలు.. బండెద్దు పోటీలు.. కర్రసాము విన్యాసాలు..ఒక ఇంట ఏంటి.. ఒక చోట ఏంటి.. ఊరు ఊరంతా సంబరం..చూశారా..నాలో ఉన్న అందాల్ని ....నా ఒడిలోని అనురాగ ఆప్యాయతల్ని ..పండుగ వేళ.. నాదొక విన్నపం..నేను పల్లెనే....ఊరికెనే ఎవరికీ పల్లెత్తి మాట అనను.. ‘మాట’ పడను..  అందుకే ఎవరైనా ‘పల్లెల్లో ఏముంటాయి’ అంటే బాధేస్తుంది.. ఏమున్నాయ్‌ అంటారే.. ఏమి లేవు నాలో.. సంస్కృతికి ప్రతీక నేను.. సంప్రదాయాలకు  పట్టుకొమ్మను నేను.. మనిషి నడకకు.. నడతకు ఊపిరిపోసిన‘తల్లి’ని నేను.. ఏదై తేనేం అందరూ వచ్చారు.. ఆడిపాడి ఆనందంగా గడిపారు... సంతోషం.. పండుగ పూ ట నా గురించి చెప్పుకునే అవకాశం కల్పించారు.. ఉంటాను.. మీ పల్లెను..    

మరిన్ని వార్తలు