సంక్రాంతి సెలవులపై సందిగ్ధత

8 Jan, 2014 04:35 IST|Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ అకడమిక్ కేలండర్ ప్రకారం ఏటా ఇస్తున్న విధంగానే ఈసారి 10 రోజులు సెలవులుగా పరిగణించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఉత్తర్వులు జారీ చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో పాఠశాలలు మూతబడిన కారణంగా సెలవుదినాలు, ఆదివారాల్లోనూ పాఠశాలలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సంక్రాంతికి మూడురోజుల సెలవులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం.

 సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా పాఠశాలలు మూతబడగా, జిల్లాలో 50 రోజుల పాటు పాఠశాలలు తెరుచుకోలేదు. సెలవు లు పోనూ జిల్లాలో నికరంగా 33 పనిదినాల నష్టం జరిగింది. తెలంగాణా ప్రాంతంలోని పాఠశాలలకు ఈనెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ సెలవులివ్వగా, సీమాంధ్రలో మాత్రం ఈనెల 13, 14, 15 తేదీల్లో సెలవులుగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఉద్యమ సమయంలో జిల్లాలో సమ్మెలోకి వెళ్లని ఉపాధ్యాయులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి దొంతు ఆంజనేయులును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పాఠశాల విద్య డెరైక్టరేట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే జిల్లాలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులుగా పరిగణిస్తామని, దీనిపై ఎటువంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు